home
Shri Datta Swami

 11 Nov 2025

 

బ్రహ్మజ్ఞానసారము

గమనిక: ఈ భగవత్ సందేశం పండితులు మరియు మేధావుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Updated with Part-3 on 13 Nov 2025


Part-1   Part-2   Part-3


Part-1

జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా

[వృషనామ సంవత్సరము, మార్గశిర బహుళ దశమి, మంగళవారము, ఉదయం 06.00 గంటలకు శ్రీదత్త దివ్యవాణి.]

పంచభూతమయమైన మనుష్యశరీరమును ధరించిన బ్రహ్మర్షులు సైతము యుగయుగముల తపించి, పంచభూతమయసృష్టికి అతీతమైన పరబ్రహ్మస్వరూపమును గ్రహించుట అసాధ్యమని తెలిసి, వారి కొరకు పంచభూతమయమైన మనుష్యశరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమైన కృష్ణావతారములో గోపికలుగా పుట్టి సేవించి తరించిరి. “మానుషీం తనుమాశ్రితమ్‌” అన్న గీతార్థమిదే. మరియు శ్రుతి “యత్‌ సాక్షాత్‌ అపరోక్షాత్‌ బ్రహ్మ” అని చెప్పుటలో అర్థమేమి? పరబ్రహ్మము పరోక్షముగా ఉన్నపుడు అగ్రాహ్యము కావున మనకు అది అందదు. కావున లేని దానిగా పరిగణించవచ్చును. మనకు ఉన్న పరబ్రహ్మము, మనకు అందిన శిలావిగ్రహరూపమున దర్శన, స్పర్శనలిచ్చి అందుచున్నది. కావున ఉపాసనకు దర్శన, స్పర్శనలు యోగ్యములే కాని అవి సహవాస, సంభాషణాదులను అనుగ్రహించ లేనందున పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపము కాజాలవు.

Swami

ఆదిత్యం బ్రహ్మేతి ఉపాసీత” అనగా ‘సూర్యుని పరబ్రహ్మముగా ఉపాసించుము’ అని అర్థము. సూర్యుడు దర్శన, స్పర్శన యోగ్యుడే కాని సహవాస, సంభాషణా యోగ్యుడు కాడు. కావున కేవలం ఉపాసనామాత్రుడేనని ఈ శ్రుతికి అర్థము. ఇక మహావాక్యములలో “అయమాత్మా బ్రహ్మ” అని అనగా మనుష్యశరీరమును ఆశ్రయించిన ఒకానొక విశిష్ట జీవస్వరూపుడైన రామకృష్ణాది అవతారపురుషుడే పరబ్రహ్మము అని ఈ శ్రుతికి అర్థము.

ప్రజ్ఞానం బ్రహ్మ” అనగా విశిష్టమైన జ్ఞానసంపన్నుడైన గురుస్వరూపుడైన అట్టి విశిష్టమానవుడే పరబ్రహ్మమని గుర్తించవలయును. “సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ”, “రసో వై సః” ఇత్యాది శ్రుతులు అట్టి అవతారపురుషుడు జ్ఞానానందాది కళ్యాణగుణతత్త్వసంపన్నుడై ఉండుననియు, అట్టి దానిని అవతార పురుషుని గుర్తించు లక్షణమనియు శ్రుతి బోధించుచున్నది. శ్రీకృష్ణుని భగవద్గీత ద్వారా పరబ్రహ్మముగా ఋషులు గుర్తించినారు. కాని ఆయన చూపిన సిద్ధుల వల్ల కాదు. అట్టి సిద్ధులు ఆయన సంకల్పమాత్రములే. ఏలననగా సిద్ధులు సృష్టిలోని భాగములు. సృష్టియును ఆయన సంకల్ప స్వరూపమే. అట్టి సిద్ధులను కంసాదిరాక్షసులు కలిగియుండెను.

అట్టి అవతార పురుషుని “తత్త్వమసి” అను మహావాక్యముతో గుర్తించవలెను. “తత్త్వమసి” అనగా 'తత్‌' =ఆ అందని పరబ్రహ్మము, 'త్వమ్'= అందిన మానవాకారమైన నీవు, 'అసి'= అయి ఉన్నావు. ఇట్టి ఉపాసనకు అద్వైతము ఆధారమైయున్నది. ఒక తీగెను విద్యుత్‌ అంతయు ఆక్రమించినప్పుడు ఆ కరెంటుతీగెను ‘కరెంటు’ అందురు. అట్లే ఆపాదమస్తకము ఆ కృష్ణస్వరూపము పరబ్రహ్మముచే వ్యాపించబడియున్నది. కరెంటు తీగెను ఎచ్చట ముట్టుకొన్ననూ కరెంటుషాకు తగులుచున్నది.

ఈ అద్వైతమును అవతారపురుషుడు కూడా “అహం బ్రహ్మాస్మి” అను వాక్యముతో బోధించును. కృష్ణభగవానుడు అట్లే “అహం సర్వస్య జగతః ప్రభవః ప్రళయ స్తథా, మత్తః పరతరం కించిత్‌ నాన్యదస్తి ధనంజయ” అని చెప్పినాడు కదా. కావున మహావాక్యములన్నియు అవతారపురుషుడే పరబ్రహ్మమనియు అతనిని ఇచ్చట సేవించి ఆనందించి తరించు స్థితియే “జీవన్ముక్తి” అనియు, పరోక్షముగా ఏమియు లేదనియు, అంతయు ఇచ్చటనే కలదనియు, అంది వచ్చినదానిని కాదన్నవాడు మహావినాశము పొందుననియు “మహతీ వినష్టిః" అని శ్రుతి చెప్పుచున్నది. “న విదుః సతి” అను శ్రుతి మరణము కేవలము ఏమీ తెలియని గాఢనిద్ర వంటి విశ్రాంతి, విరామమైన అజ్ఞానావస్థ అనియు చెప్పుచున్నది. ఈ శ్రుతి కూడా పై శ్రుతినే బలపరచుచున్నది.

 

Part-2

1. అవతార పురుషుని శరీరములోని చైతన్యము ఎట్టి సంస్కారము లేక శుద్ధ జలము వలెయుండును.

బృహదారణ్య ఉపనిషత్తు మరణం గురించి చెప్పుచున్నది. పరమాత్మ అవతరించినపుడు తనకు అతి సన్నిహితమైన ఆత్మీయమైన ప్రకృతిని ఆశ్రయించును. “ప్రకృతిం స్వామ్ అధిష్ఠాయ” అన్న గీతార్థమిదే. ఆత్మీయమైన ప్రకృతి సత్త్వగుణస్వరూపము. అనగా ఈ ప్రకృతి పంచభూతమయమైన శరీరముతో పాటు శుద్ధచైతన్యమును (చేతన - pure awareness) కూడా కలిగియుండును. ఈ శుద్ధచైతన్యము తాను జీవించుచు శరీరమును జీవింపచేయునది కావున జీవుడు అని పిలువబడుచున్నను ఇతర మానవులయందున్న జీవస్వరూపములకు భిన్నముగా యుండును. “జీవతి, జీవయతి ఇతి జీవః” అని జీవశబ్దమునకు అర్థము, అనగా శుద్ధచైతన్యము. ఇతరమానవులలో ఈ శుద్ధచైతన్యము పుణ్యపాపకర్మల సంస్కారములతో కలుషితమై పంచదార మరియు మురికి కలిసిన శుద్ధజలము వలెయుండును. అవతారపురుషుని శరీరములో ఉన్న శుద్ధచైతన్యము ఎట్టి కర్మల సంస్కారము లేక శుద్ధజలమువలె యుండును. ఇట్టి శుద్ధచైతన్యము ఎట్టి ప్రత్యేకతయు లేక శరీరములో ఒక భాగముగానే యున్నది. కావున ఇచ్చట ఈ శుద్ధచైతన్యము శరీరము కన్న భిన్నమైన జీవునిగా వ్యవహరింపబడుటలేదు. ఇతరప్రాణులలో ఈ శుద్ధచైతన్యము సంస్కారములతో కలుషితమై శరీరము కన్న భిన్నముగా ఒక ప్రత్యేకత కలిగి జీవుడని పిలువబడుచున్నది.

అవతారశరీరము కార్యము ముగిసిన తర్వాత ఇచ్చట త్యజింపబడినపుడు పరమాత్మను వదలి పంచభూతములలో కలియుచున్నది. ఈ శుద్ధచైతన్యము మనోమయమై తేజస్సు యొక్క రూపము కావున అగ్ని అను భూతమునందు ఇచ్చటనే కలియుచున్నది. “మనోమయ”, మరియు “తేజః సతి” అను శ్రుతులు దీనికి ప్రమాణములు. ఇతరప్రాణుల మరణమునందు ఈ శుద్ధచైతన్యము సంస్కారములచే కలుషితమైనందున జీవుడు అనబడుచు “జాయస్వ”, “మ్రియస్వ” అను శ్రుతి ప్రకారముగా ఆయా కర్మఫలములను పొందుచు పుట్టుచు, గిట్టుచు ఉన్నాడు. ఇక పరమాత్మ అవతరించినప్పుడు ఆయన వెంట వచ్చిన భక్తులగు సేవకుల గతి ఏమి? వీరు మరణమున పరమాత్మను పొంది “పురుషాయణాః పురుషం ప్రాప్య” అను శ్రుతి ప్రకారముగా పరమాత్మలో అవ్యక్తస్థితిలో ఉండి “న విదుః సతి” అను శ్రుతి ప్రకారముగా నిద్ర, విశ్రాంతినికొని మరల పరమాత్మతో పాటు అవతరించుచున్నారు. ఇట్టి వీరి యొక్క జీవస్వరూపము ఎట్లుండుననగా జ్ఞానము, విశ్వాసము, శ్రద్ధ, భక్తి మొదలగు పుణ్యసంస్కారములతో కూడిన శుద్ధచైతన్యముగా కేవలం పంచదార కలసిన శుద్ధజలము వలెయుండును. వీరికి పరమాత్మకువలె జన్మించునపుడు బద్ధనరకదుఃఖము కాని, మరణించునపుడు మరణవేదన కాని యుండదు. ఇట్టి జననమరణదుఃఖము నుండియే మోక్షము. అంతే తప్ప జననమరణములు లేవని కాదు. పరమాత్మయే అవతారముల ద్వారా జననమరణములను గ్రహించుచున్నాడు. ఇట్టి జననమరణములు పరమాత్మకు కాని, ఆయన సేవకులకు గాని కేవలము కట్టిన వస్త్రమును వదలి శుద్ధవస్త్రమును గ్రహించిన రీతిగా ఉండును. “వాసాంసి జీర్ణాని” అను గీతార్థము ఇదే. “నివసిష్యసి మయ్యేవ" మరియు "ప్రవేష్టుం చ పరంతప” అను గీతలు స్వామి ఆత్మీయులైన భక్తులు మరణానంతరము స్వామిలోనికి ప్రవేశించి అణుప్రమాణ జీవరూపులుగా నివసించెదరని చెప్పుచున్నది.

 

Part-3

2. శుద్ధావతారము - ఆవేశావతారము

రామకృష్ణాది అవతారములు శుద్ధావతారములు లేక నిత్యావతారములు అనబడును. ఇందులో స్వామి శుద్ధ చైతన్యముతో కూడిన తన సంకల్పముచే సృష్టించబడిన శరీరమును ఆశ్రయించి అవతార జననము మెదలు మరణము వరకు అందులో నిత్యముగా యుండును. ఆవేశావతారములో పరమాత్మ ఒక సామాన్య మానవుని ఆవేశించును. ఇట్టి ఆవేశములో సామాన్య మానవుని శరీరముతో పాటు జీవుని కూడా వ్యాపించి యుండును. ఇట్లు వ్యాపించిన సమయమున శుద్ధావతారమునకు, ఆవేశావతారమునకు ఎట్టి భేదము లేదు. ఒక లోహపు తీగెను కరెంటు వ్యాపించి యున్నను, రెండు లోహముల మిశ్రమమైన తీగెను కరెంటు వ్యాపించియున్నను, కరెంటు ప్రవహించుచున్నంత వరకు ఆ రెండునూ కరెంటు తీగెలె. కావున ఆవేశావతారమైన పరశురాముడు దశావతారములలో చేర్చబడినాడు. పరశురాముడు ఒక ముని కుమారుడు. అతని శరీరములో సంస్కారమయుడైన జీవుడున్నాడు. ఆ శరీరము అతనికి కర్మఫల లబ్ధమే. ఆ శరీరము ఒక వృక్షము వంటిది. ఆ శరీరములో ఉన్న ఆ జీవుడు ఒక పక్షి వంటివాడు. ఆ జీవుడు అనేక జన్మలు పరమాత్మకై తపించినవాడు. ఆట్టి ఆ జీవుని శరీరమును పరమాత్మ ఆవేశించుట పరమాత్మ అను మరొక పక్షి ఆ శరీరమున వాలి ఆ జీవునితో కలసి గూఢముగా కూర్చున్నది. ఈ శరీరములో ఉన్న పరమాత్మ దుష్ట సంహారమను అద్భుతమహిమను చేసి, ఆ కీర్తిని పరశురామునికి ఇచ్చినది. ఈ ఆవేశావతార విషయమునే “ద్వా సుపర్ణా సయుజా” అను శ్రుతి చక్కగా వివరించుచున్నది. గీతలో కూడా “ప్రహ్లదశ్చాస్మి” అను గీతలు ప్రహ్లాదుడను జీవపక్షితో పరమాత్మపక్షి చేరి హిరణ్యకశిపుడు సంహరించుటకు ఎంత ప్రయత్నించిననూ, ఆ ప్రయత్నములన్నియు విఫలములగునట్లు చేసి ప్రహ్లదునకు కీర్తి నిచ్చినది. ఈ శ్రుతిలో “సఖాయ” అను శబ్ధము తపస్సు ద్వారా జీవపక్షి, పరమాత్మపక్షికి ఇష్టుడగుట సూచించుచున్నది. “సయుజ” అను శబ్ధము దానికి సంతోషించిన పరమాత్మపక్షి, జీవపక్షిలో చేరుటను సూచించుచున్నది.

స్వాదు అత్తి” అను శబ్ధములు జీవపక్షి కీర్తి ఫలమును భోగించుటను సూచించుచున్నది. “అనశ్నన్‌” అను శబ్ధము ఆ కీర్తి పరమాత్మ గ్రహించక జీవపక్షికి ఇచ్చుటను సూచించుచున్నది. ఐతే ఈ మహిమను పరమాత్మ చేసినాడని గ్రహించక, పరశురామ జీవపక్షి తానే చేసితినని అహంకరించెను. ఇట్టి ఈ అహంకారమును నిత్యావతారమైన రామ పరమాత్మపక్షి పోగొట్టినది. ఇట్టి ఆవేశావతారమే హనుమంతుడు కూడా. అయితే సముద్రలంఘనమను మహిమను చేసిన తర్వాత హనుమంతుడు అహంకరించక ఇది రామ శక్తియేనని ప్రకటించినాడు. అట్టి భక్తునికు ఆ కీర్తిని శాశ్వతముగా అంటగట్ట తలచి రామాంజనేయ యుద్ధమున రాముడు ఓడిపోయి ఆంజనేయుని గెలిపించి తన కన్న ఆంజనేయుడే గొప్పవాడనియు, తన కన్న హనుమంతుడే మహామహిమాన్వితుడనియు ప్రకటించుటకై రాముడు ఎట్టి మహిమలను చేయక, తాను సామాన్యునివలె నటించెను. రాముడే మహిమలను చేసియున్నచో హనుమంతుని సముద్ర లంఘనము రాముడే చేయించినాడని లోకము భావించి యుండెడిది. ఈ నిత్యావతారము చేయవలసిన కార్యము యొక్క స్ధాయిని బట్టి కళావతారముగను, అంశావతారముగను ఉండుచుండును.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch