;
home
Shri Datta Swami

 24 Dec 2025

 

హిందూమత వివరణము (Part-1)

ఉపోద్ధాతము:

హిందూ మతములో కుల, లింగ వివక్షలతో వచ్చిన చీలికలకు ప్రధానకారణములు - ఉపనయనము, గాయత్రీమన్త్రము, వేదాధ్యయనము, వేదోక్తములైన సంస్కారకర్మలు అందరికీ వర్తించక పోవుట, ఇవి కేవలము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషలకు మాత్రమే పరిమితమగుట, శూద్రులు, పంచములు మరియు సర్వ స్త్రీలు వీటికి నిషిద్ధులు అగుట, స్త్రీలకు బాల్యవివాహము చేయుట, సహగమనము విధించుట, విద్య - స్వాతంత్ర్యము మరియు సమాన ధనభాగము లేకుండుట మొదలగునవి. ఈ మూడు కులముల మరియు పురుషుల ఆధిక్యతకు ఇవి మూలకారణమైనవి. గౌరవము సద్గుణములకును సత్కర్మలకును ఉండవలెను గానీ కుల, లింగముల వలన ఉండరాదు. హిందూమతములో మాంసాహారము పాపముగా పరిగణించబడుటవలన, మాంసాహార - శాకాహార చీలికకూడా వచ్చినది. ఇతర మతములలో ఇట్టి చీలికలకు తావులేనందున, తమ మతములో జరిగిన అవమానము వలననూ, కొందరు ముఖ్యముగా మాంసాహారులు (అన్య మతములలో అందరునూ మాంసాహారులే) ఇతర మతములలోనికి మారుట జరిగినది. ప్రాణిహింసను తీవ్రముగా వ్యతిరేకించిన బుద్ధుని కాలములోనే కొందరు బౌద్ధులు మాంసాహారులుగ ఉండిరి. ఇప్పుడు బౌద్ధులందరునూ మాంసాహారులే. అన్ని మతములలో దైవారాధనము ఉన్నది కావున ఆధ్యాత్మిక నష్టము ఏమియు లేనందున మతాంతరీకరణములో ప్రోత్సాహము లభించినది. ఈ చీలికలే హిందూమతమును బలహీనవరిచినది.

నిజముగా ప్రస్తుతము చేయు ఒకానొక సంస్కారకర్మను ఉపనయనము అనుటకు వీలులేదు. దీని అర్థము ఎవరైననూ, ఎట్టి దైవారాధనము చేతనైననూ భగవంతునికి దగ్గరగా అగుట కావున దీనిలో ఎవరికినీ నిషేధములేదు. క్షత్రియులకు దీనిని ఏర్పరుచుట వారి రాజ్యాధికారము, దీనిని వైశ్యులకు ఏర్పరుచుట వారి అధిక ధనము కారణములు కావచ్చునని బ్రాహ్మణులపై సందేహములు వచ్చుట సహజమే. వేదార్థమును తెలియక వేదమును కేవలము బట్టీపట్టు ఈ బట్టీబ్రాహ్మణుల విపరీతార్థముల వలన విప్లవమే ఏర్పడినది. స్రీలు, శూద్రులు మరియు పంచములు సంప్రదాయ స్థాపకులైన ఋషులగు బ్రాహ్మణ పురుషులపై తమ అనర్హత గురించి తిరగబడిరి. ఈ బట్టీ బ్రాహ్మణులపై వచ్చిన ద్వేషము ఋషినిందగా మారినది. బ్రాహ్మణ స్త్రీలు మాత్రము తమ తండ్రులపై మరియు భర్తలపైగల గౌరవ, భయముల వలన మౌనము వహించిరి. ఇట్లు కుల, లింగ వివక్షలే హిందూమతమును రోగిగా మార్చినవి.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via