home
Shri Datta Swami

 Posted on 02 Jan 2026. Share

హిందూమత వివరణము (Part-10)

10. గాయత్రీ మన్త్రార్థము

ఈ పూర్వ రంగముతో గాయత్రి అని పేరుగల ఛందస్సులో రచింపబడిన గాయత్రి అను వేద మన్త్రము అర్థమును ముందు మనము విశ్లేషించవలయును.

గాయత్రీ మన్త్రము:

ఓం భూర్భువస్సువః । తత్సవితుర్వరేణ్యం ।

భర్గోదేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్‌ ।

ఓమ్‌ = ఇది అనూహ్య పరబ్రహ్మమును సూచించుచున్నది. (తస్యవాచకః - బ్రహ్మసూత్ర). ఇది సృష్టిస్థితిలయ కారకులగు బ్రహ్మ, విష్ణు, శివులను సూచించు అకార - ఉకార - మకారముల యొక్క మిశ్రమము. ఇది అనూహ్య సృష్టికర్తకు ప్రతినిధి. త్రిమూర్తి స్వరూపుడగు శ్రీదత్తాత్రేయ సద్గురుభగవానుని సూచకము.

భూర్భువస్సువః = (ఈ మూడు శబ్దములు వ్యాహృతులనబడును.) ఇవి ఊహించుటకు వీలగు యీ సృష్టి యొక్క మూడు ఘటక పదార్థములను బోధించును. భూః (భూలోకము) అనగా విష్ణుశక్తి రూపమైన లక్ష్మీ తత్త్వమగు జడద్రవ్యము. భువః (భువర్లోక/ద్యులోక/జ్యోతిర్లోకము) - శివశక్తి రూపమైన పార్వతీ తత్త్వమగు జడశక్తి. సువః (సువర్లోక/స్వర్లోక/స్వర్గలోకము) అనగా చైతన్య వికారములగు ( modification of pure awareness) త్రిగుణముల రూపములగు కోరికలను నెరవేర్చు భోగలోకమును సూచించు బ్రహ్మశక్తి రూపమైన సరస్వతీ తత్త్వమగు చిత్‌శక్తి. ఈ మూడును, బ్రహ్మాండమును (cosmic universe) లేక పిండాండ (human being)రూపమగు నరశరీర - ఉపాధి (medium) స్వరూప పదార్థములుగ చెప్పబడినవి. బ్రహ్మాండములోను, నరశరీరమగు పిండాండములోను తొమ్మిది ప్రకృతులే కలవు (ఎనిమిది అపరాప్రకృతులు, ఒక పరాప్రకృతి - గీత). నరశరీర - ఉపాధిలోకి పరమాత్మ ప్రవేశించి, దానితో తాదాత్మ్యమును (merging) చెంది భక్తకోటికి జ్ఞాన ప్రచారమును చేయును.

దేవస్య = క్రీడార్థము సృష్టిని చేసి రమించుచున్న / అనూహ్యుడైననూ (unimaginable) సృష్టిద్వారా తాను కలనని తనను ప్రకాశింప చేసుకొనుచున్న (‘ఏకాకీనరమతే’ అను శ్రుతి ప్రకారము ఒక్కనిగా ఉన్న తనయొక్క రమణము కొరకే సృష్టిని చేసినాడని అర్థమును కానీ, లేక ఊహించుటకు వీలగు సృష్టిభాగమైన జగత్తు లేక నరశరీర ఉపాధి ద్వారా అనూహ్యుడైన తాను ప్రకాశించుచున్నాడు అనగా వ్యక్తమగుచున్నాడు అని అర్థమును కానీ తీసుకొనవచ్చును).

తత్సవితుః = ఆ సృష్టికర్త యొక్క (యోగముద్వారా సవిత అనగా సృష్టికర్త) యోగరూఢిద్వారా సవిత అనగా సూర్యుడు. యోగరూఢి సిద్ధుడైన సూర్యుడుకాదని, యోగసిద్ధుడైన పరమాత్మయేనను అర్థమును ‘ఆ’(తత్‌) అను పదము సూచించుచున్నది.

వరేణ్యంభర్గః = శ్రేష్టమైన సృష్టిభాగము. భర్గః అనగా తేజస్సు లేక శక్తి. ఆ శక్తికార్యమే ఈ సృష్టి కావున భర్గః అనగా సృష్టి అనినేరుగా అర్థము ఏర్పడును. ఇట్టి యీ సృష్టిలో శ్రేష్టమైన భాగము, గీత చెప్పినట్లు పరాప్రకృతి అనగా చైతన్యము ( pure awareness). అయితే యీ చైతన్యము స్వతంత్రముగా సృష్టిలో లభించదు. అది ఒక శరీరమును ఆశ్రయించియే గోచరించుచున్నది. ఈ చైతన్యము పైన చెప్పినట్లు సువః అను శబ్దముచేత చెప్పబడినది. చైతన్యము వెంటనుండు జడశరీరభాగములగు భూః (జడద్రవ్యము - inert energy) మరియు భువః (జడశక్తి - inert energy) ఎల్లప్పుడును సువః (చైతన్యము)తో చేరియుండుట వలన, సువః అనగానే భూః మరియు భువః కూడ గోచరించును. సువః (చైతన్యము) లేకుండా భూః(జడద్రవ్యము) మరియు భువః (జడశక్తి), కలిసిగానీ విడివిడిగా కానీ గోచరించవచ్చును. కానీ సువః (చైతన్యము) వెంట భూః మరియు భువః కలిసిగానీ విడివిడిగాకానీ గోచరించవలెను. తేజోరూపులగు ( energetic forms) జీవులలో కేవల జడశక్తి ఉపాధి మరియు లోపల జీవుడు చైతన్యము అనగా భువః తో కూడిన సువః. మనుష్య శరీర ఉపాధిలో భూః (జడద్రవ్యము) మరియు భువః (జడశక్తి) కలిసి, దానిలో జీవుడను చైతన్యము సువః ఉండును. కావున సువః (చైతన్యము) వెంట భూః మరియు భువః విడిగా లేక కలిసిగానీ ఉండవలసినదే. కావున చైతన్యము అనగానే చైతన్యముతో కూడిన ప్రాణి శరీరమనియే సిద్ధించుచున్నది.

ధీమహి = ధ్యానించుచున్నాము.

ఇప్పటివరకు సిద్ధించిన సారాంశమేమనగా - అనూహ్యుడగు పరమాత్మ ఒక ప్రాణిశరీరమును ప్రవేశించి దానితో తాదాత్మ్యమును చెందును. చైతన్యములేని జడపదార్థములలోనికి పరమాత్మ ప్రవేశించడు (నతస్యప్రతిమా-శ్రుతి) అనియు స్పష్టము. అనగా - జడ పదార్థములను దైవమునకు ప్రతీకలుగా సామాన్యులు ఉపాసించిననూ, దైవమును సాక్షాత్తుగా ఉపాసించుమార్గము కేవలము చేతన పదార్థములలోనే అవకాశమున్నది. ఇప్పటివరకు తాత్పర్యమేమనగా - అనూహ్యుడైన పరమాత్మను నేరుగా ధ్యానించి సేవించలేవు. ఆయన ఒక ఉపాధిని ప్రవేశించి దానితో తాదాత్మ్యమును చెందినపుడు దానిని (భర్గః) మాత్రమే ధ్యానించి సేవించగలవు.

నః = మా యొక్క, థియః = బుద్ధులను, యః = ఉపాధిని ప్రవేశించిన ఏ పరమాత్మ, ప్రచోదయాత్‌ = ప్రేరేపించగలడో (అట్టి పరమాత్మ యొక్క ఉపాధిని ధ్యానించుదుము). బుద్ధికోశము మాత్రమే విన్న జ్ఞానమును బాగుగ విశ్లేషణ చేసి సత్యనిర్ణయములను చేయకలదు. ఈ భాగముద్వారా చేతనశరీరులగు పశుపక్ష్యాదులు పరమాత్మ ఉపాధులు కావని స్పష్టము. ఏలననగా అవి జ్ఞానబోధ చేయలేవు. గీతలో చెప్పినట్లు కేవలము సద్గురువగు ఒకానొక చేతన శరీరము మాత్రమే జ్ఞాన ప్రచారము చేయగలదు (మానుషీంతనుమాశ్రితమ్‌). కృష్ణ, శంకర, రామానుజ, మధ్వ - ఆది సద్గురువులే సమర్థవంతముగా జ్ఞానబోధ చేయగలరు. ఈ ఉపనయనము, సద్గురువు వద్దకు బ్రహ్మచర్యాశ్రమములో శిశువును పంపుటకు ముందు జరుపు ఆచారము కూడా కావున ఇట్టి ఉపనయనార్థమును సమర్ధించుచున్నది. బుద్ధియొక్క నిశిత విశ్లేషణ చర్యను సంతృప్తిపరచ గల విశిష్టజ్ఞానమే ప్రజ్ఞానము కావున, అట్టి ప్రజ్ఞాన బోధకుడే పరమాత్మయని గుర్తించవలయునని వేదము (ప్రజ్ఞానంబ్రహ్మ).

గాయత్రీమన్త్ర సారాంశము

గాయత్రీ మన్త్రమును రెండు భాగములుగా విభజించవలయును.

i) ఓం... సువః - ఓంకారము అనూహ్యుడైన పరబ్రహ్మమును, మూడు వ్యాహృతులు జగత్తును సూచించును. జన్మాద్యస్య యతః అను బ్రహ్మసూత్రము ప్రకారముగా జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయముల ద్వారా పరబ్రహ్మము (అస్తీత్యేవ - వేద) ఉన్నదని మాత్రమే తెలియుచున్నది తప్ప దాని స్వరూపలక్షణము ఏమియు తెలియుటలేదు. పరబ్రహ్మము ఉన్నది అని మాత్రమే ఓంకారము మరియు మూడు వ్యాహృతులు చెప్పుచున్నవి. ఇందులో జగత్తు ద్వారా దాని కర్త, భర్త మరియు హర్తయగు పరబ్రహ్మము అనుమాన ప్రమాణముద్వారా ఉన్నది అని మాత్రమే సిద్ధించును. ఇందులో దూరమునుండి పొగను చూచి అచట నిప్పు ఉన్నది అని అనుమానించబడును. పొగయొక్క స్వరూపము వలన నిప్పుయొక్క స్వరూపము తెలియదు. కేవలము నిప్పు ఉన్నది అని మాత్రమే తెలియును.

ii) తత్సవితుః ... ప్రచోదయాత్‌ - ఇట్లు ఉన్నది అని తెలియబడిన పరబ్రహ్మమును దర్శించి, సంభాషించి, స్పృశించి దానితో సహవాసమును చేయు నాలుగు మహాభాగ్యములను కోరు భక్తుల కొరకు, ఆ పరబ్రహ్మము జగత్తు (బ్రహ్మాండము) లోని శ్రేష్ట భాగమైన విశిష్ట నరశరీరమును (పిండాండమును) ప్రవేశించి (తదేవానుప్రావిశత్‌ - వేద, మానుషీంతనుమాశ్రితమ్‌ - గీత) సద్గురువుగా జ్ఞాన ప్రచారకునిగా భక్తుల ప్రార్థనను నెరవేర్చుచున్నది. బ్రహ్మాండ పిండాండములలో పరిమాణ భేదముతప్ప ఘటకపదార్థముల భేదములేదు. రెండింటిలోను ఒకే అనూహ్య పరమాత్మ కలడు. రెండును (బ్రహ్మాండ పిండాండములు) శక్తి లేక ప్రకృతి లేక జగత్తు యొక్క పూర్ణ మరియు అంశ రూపములే. అనూహ్య పరమాత్మను వేదాంతమతము బోధించును. శక్తిని (బ్రహ్మాండ పిండాండములను) శాక్తేయ మతము బోధించును. ‘అమ్మ ద్వారానే అయ్యను చేరగలము’ అను వాక్యములో అమ్మయనగా శక్తి లేక ప్రకృతి. అయ్య అనగా అనూహ్యుడైన పరమాత్మ. అనూహ్య పరమాత్మను సేవించవలయునన్నచో ఊహించుటకు వీలగు సృష్టిభాగమైన నరశరీర ఉపాధి కావలయును. అట్టి ఉపాధితో పరమాత్మ తాదాత్మ్యమును చెందును కావున ఆ ఉపాధిని సేవించుట అనగా సాక్షాత్తు పరమాత్మను సేవించుటయే. ఇట్టి తాదాత్మ్యము జగత్తుతో పరమాత్మకు ఉండదు కావున జగత్తులో ఏ భాగము పరమాత్మ కాదనియే తాత్పర్యము (నేతి నేతి- వేద). “ఈ జగత్తు బ్రహ్మము” అను వేదవాక్యములో (సర్వంఖల్విదమ్‌) జగత్తు పరమాత్మ అధీనములో ఉన్నది అని తీసుకొనవలయును (తదధీన ప్రథమా విభక్తి). లేకున్నచో పై వేద వాక్యమునకు విరోధము వచ్చును. జగత్తు ద్వారా పరమాత్మ ఉన్నాడని తెలియుటయేతప్ప, జగత్తును సేవించుట ద్వారా పరమాత్మను సేవించుట కుదరదు. జగత్తులో ఒక భాగమగు నరశరీర ఉపాధితో తాదాత్మ్యమును చెందినందున పరబ్రహ్మము ప్రత్యక్షముగ కనపడుచున్నది కావున సేవకు యోగ్యము. ఇది ప్రత్యక్ష ప్రమాణము (ప్రత్యగాత్మానమైక్షత్‌ - వేద).

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via