
Posted on 03 Jan 2026. Share
11. గాయత్రీ ధ్యానశ్లోకము - యజ్ఞోపవీతము:
గాయత్రీ ధ్యానశ్లోకమగు “ముక్తావిద్రుమ...” అనునది లౌకికమైన శార్దూలవిక్రీడిత ఛందస్సులో ఉన్నది కావున ఇది ఋషిరచన కాదు. అయిననూ అర్థజ్ఞానులగు పండితులచే రచింపబడినదే తప్ప బట్టీబ్రాహ్మణులు చేసిన పనికాదు. కావున ఋషుల జ్ఞానమార్గములోనే ఉన్నది. ఋషులు – పండితులు - బట్టీబ్రాహ్మణులు అను మూడు కాలక్రమ దశలను గుర్తించవలెను. ఈ శ్లోకములో గాయత్రి పంచముఖములు పంచభూతములను సూచించుచున్నవి. త్రిగుణములను సూచించు మూడుచూపులు (త్రీక్షణైః) త్రిగుణాత్మక చైతన్యమును సూచించును. ఇట్లు ముఖములు, చూపులును, జడద్రవ్య - జడశక్తి - చైతన్య సమాహారమైన సద్గురు భౌతికశరీరమును చెప్పును. పంచభూతములలో ఆకాశము మరియు అగ్ని జడశక్తి. మిగిలిన మూడు భూతములు ఘన, ద్రవ, వాయురూపములలోనున్న జడద్రవ్యము. చంద్రరేఖ గల రత్నకిరీటము (ఇందు నిబద్ధ...) మనో బుద్ధులను సూచించును. చంద్రుడు మనస్సును, జ్ఞానరత్నములు బుద్ధిని సూచించును. జ్ఞానవాక్యములు (తత్వార్థ వర్ణాత్మికామ్) తత్త్వబోధను సూచించును. ఇంతవరకు భక్తియోగ సాధనమగు మనస్సు మరియు జ్ఞానయోగసాధనమగు బుద్ధియు భావరూపమైన సేవను చెప్పును. చివరకు ఫలప్రదాయకమగు కర్మయోగసాధనమైన క్రియారూపసేవను పదిచేతులను పది ఇంద్రియములు గల శరీరము సూచించును. ఈ కర్మయోగమే వంటచేయుట (అగ్యికార్యము) మొదలగు సేవలు.
యజ్ఞోపవీతములోని మూడు పోగులు త్రిగుణాత్మక చైతన్యము అనగా చేతన నరశరీరమును సూచించును. దైవప్రార్థనలో చేతితో యజ్ఞోపవీతమును పట్టుకొనుటలో అర్థము - అనూహ్య పరబ్రహ్మమును నీవు చిక్కించుకొనలేవు. ఆ పరబ్రహ్మము నరశరీర ఉపాధిని ప్రవేశించి తాదాత్మ్యము చెందును కావున అట్టి ఉపాధిని పట్టుకొని అర్చించుటచే అనూహ్య పరబ్రహ్మమును దాని ద్వారా చిక్కించుకొన్నవాడవు అగుదువు అనియే. ఈనాటి బట్టీబ్రాహ్మణులు ఈ అర్థమును సంస్కృతభాషా శాస్త్రజ్ఞానము లేకపోవుటచే గ్రహించలేక, చేతితో యజ్ఞోపవీతమును పట్టుకొనుట వీపు జిలను దానితో గోకుటకు ఉపయోగించుటకు అని తలచుచున్నారు!
To be continued...
★ ★ ★ ★ ★