
Posted on 04 Jan 2026. Share
12. మాతృభాషలోనే దైవ స్తోత్రగానము:
ప్రాచీనకాలములో సంస్కృతము భారతదేశములో మాతృభాషగా ఉన్నప్పుడు కూడా ప్రపంచములో ఇతర దేశములు వాటివాటి మాతృభాషలతోనున్నవి. కావున ఏ భాషలోనైననూ దేవుని స్తోత్రముతో గానము చేయవచ్చును. దేవుడు అన్నిభాషలను తెలిసిన సర్వజ్ఞుడు. మరియు అన్ని దేశములను సృష్టించినవాడు. కావున ఒకదేశములోని భాషపై పక్షపాతములేని విశ్వపిత. కేవల సంస్కృత భాషాప్రియుడైనచో అన్నిదేశములలో ఆదినుండియు సంస్కృత భాషనే ఏర్పాటుచేసియుండెడివాడు. ఈనాడు భారతదేశములో అనేక భాషలుగల అనేక రాష్ట్రములు ఏర్పడి ఇది చిన్న ప్రపంచముగా ఉన్నది. కావున ఆనాటి విధానమే ఈనాటికినీ వర్తించునుగావున, భారతదేశములో ఎవరైననూ వారి మాతృభాషలో దేవుని గానముతో స్తుతించుటయే ఉపనయన గాయత్రీభావము. ఆనాడు సంస్కృతము మాతృభాషగా అందరికి తెలియును కావున మన్త్రములు వాటి విధానములు అందరికిని ఆనాడు తెలిసియే ఉన్నవి. ఈనాడు వినువారికే కాదు పఠించువానికి కూడా అర్థము తెలియక సర్వమును వ్యర్థము చేసినారు.

13. సవిత పరమాత్మయే - సూర్యుడు కాడు:
“వేదము సూర్యుని బ్రహ్మముగా ఉపాసించమని చెప్పుచున్నది (ఆదిత్యంబ్రహ్మ ఇతి...) కావున యిచట సూర్యోపాసనమే విషయము. సూర్యుని నేరుగాచూచుట కష్టము కావున సూర్యతేజస్సును ఉపాసించుము” అనియే గాయత్రీమన్త్రము యొక్క అర్థముగా మీరు వాదించరాదు. సద్గురువు యొక్క జ్ఞానశక్తియే జ్ఞాన ప్రదాయకము కాని జడమైన సూర్యతేజస్సు జ్ఞానము నీయజాలదు. నీవు చెప్పిన వేదవాక్యమును నీవు అపార్థమును చేసుకున్నావు. సూర్యుని బ్రహ్మముగా భావించి ఉపాసించమనియే యీ వేదవాక్యార్థము. అలా భావించుటను “ఇతి” అను శబ్దము సూచించుచున్నది. పైగా, వేదము స్పష్టముగా “నీవుఉపాసించు సూర్యుడు నిజముగా బ్రహ్మము కాడు” అనియే పలుకుచున్నది (నేదంతత్...). నిజముగా సూర్యుడే బ్రహ్మమైనచో, “ఇతి” అను శబ్దము అచట ఉండరాదు. ఒక సామాన్యుడు సూర్యుని దైవప్రతీకగా భావించి ఉపాసించవచ్చునుకాని, అంత మాత్రమున సూర్యుడు సాక్షాత్తుగా దైవము కాడు. సూర్యుని ప్రత్యేక దర్పణములద్వారా నేరుగా చాలాసమయము చూడవచ్చును. కావున సూర్యుని, ఊహలలో సైతము చూచుటకు వీలుగాని అనూహ్యపరమాత్మతో పోల్చలేము. యోగరూఢిద్వారా సవిత శబ్దమును సూర్యుడని తీసుకొనవచ్చును. మానవుల అజ్ఞాన నిద్రా తమస్సును పోగొట్టి జ్ఞానగ్రహణమునకు సూర్యుడు సహకరించుచున్నాడు. సూర్యతేజస్సు ఇట్లు సహకరించుచున్నది కావున రెండవ అర్థముగా తీసుకొనవచ్చును. ముఖ్యార్థములో యోగము ద్వారా సవిత అనగా సృష్టికర్తయగు పరమాత్మ అనియే అర్థమును గ్రహించవలెను. మొత్తము మీద దీని అర్థమును సూర్యోదయమున జ్ఞాన ప్రదాతయగు సద్గురువును సేవించి ఉపాసించుట అని తీసుకొనవచ్చును.
To be continued...
★ ★ ★ ★ ★