
Posted on 05 Jan 2026. Share
14. అగ్నికార్యము:
జ్ఞానయోగముద్వారా సద్గురుదేవుని గుర్తించి, భక్తియోగము ద్వారా గానముతో స్తుతించి, కర్మయోగము ద్వారా ఆయనను సేవించుటయే సారాంశము. జ్ఞానభక్తి యోగములు భావరూపములు. కర్మయోగమగు సేవ క్రియారూపము. భావము క్రియను, క్రియ ఫలమును పుట్టించును. కావున భావక్రియలు రెండూ ముఖ్యములే. అగ్నికార్యములో వంటను చేయుటకు ఆ కాలములో రెండు కట్టెల నుపయోగించి అగ్నిని పుట్టించుట చాల కష్టమైన క్రియ. కావున గురువువద్దకు పోవునపుడు కట్టెలను చేతపట్టుకొని పోవలయునని వేదముచెప్పుచున్నది (సగురు మేవాభి గచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్). యజ్ఞము యొక్క అంతరార్థము ఏమనగా - కట్టెలతో లౌకికాగ్నిని ఏర్పరచి, యజ్ఞసాధనమగు దానితో వంటచేసి, ఆ వంటద్వారా ఆకలిగొన్నవారి కడుపులలో మండు వైశ్వానరాగ్ని అను యజ్ఞ ఉపాస్యమైన దేవతాగ్నిని శాంతింపచేయుటయే. ఇట్లు ముందు సద్గురువును శాంతింపచేసి సేవించుటయే యజ్ఞము. యజ్ఞ శబ్దము యజ ధాతువునుండి ఏర్పడినది. యజ అనగా పూజించుట లేక సేవించుట. అగ్ని శబ్దము అగ్రి శబ్దమునుండి పుట్టినది. చేసినపాకములను మొదట (అగ్రి) వడ్డించి అర్చించవలసిన సద్గురువే అగ్ని. జ్ఞానాగ్నితో (జ్ఞానాగ్ని...- గీత) ప్రకాశించు సద్గురువే అగ్ని అని వేదవాక్యము (ఆగ్నేయోవై బ్రాహ్మణః). ఆదివేదమగు ఋగ్వేదములో అగ్ని అనగా - ముందుగానే జ్ఞానము ద్వారా హితమును బోధించువాడు (పురోహితుడు), యజ్ఞములో మొదట అర్చించవలసిన దేవుడు (యజ్ఞస్యదేవమ్), యజ్ఞకారకుడు అగు ఋత్విక్కు (ఋత్విజమ్) ఆహారసమర్పణమను హవనమును చేసి తన వైశ్వానరాగ్నిని శాంతింపచేయువాడు (హోతారం) మరియు జ్ఞానరత్నములను ధరించినవాడు (రత్నధాతమమ్) అని ‘అగ్నిమీళే’ అను ఆదిమన్త్రములో వర్ణించుచున్నది. యజుర్వేదము కూడా పాకయజ్ఞ సాధనమగు లౌకికాగ్నిని మండించుటకు కావలసిన సమిధను స్తుతించుచు ఆరంభమగుచున్నది (ఇషే...). ఘృతమును అగ్నికి మొదట ఆహుతిచేయవలయును అనగా ఘృతముతోకూడిన అన్నమును మొదట సద్గురువుకు సమర్పించవలయును అనియే. ఘృతమనగా కేవలము నేయికాదు, నేతితోకూడిన అన్నముఅని శాస్త్రములో చెప్పబడిన లక్షణావృత్తిద్వారా గ్రహించవలెను. సత్యార్థగ్రహణములో సంస్కృత భాషాప్రావీణ్యము మరిము శాస్త్రజ్ఞాన పాండిత్యము చాలముఖ్యములు.
To be continued...
★ ★ ★ ★ ★