
Posted on 06 Jan 2026. Share
15. ఆక్షేపణలు - సమాధానములు:
స్తుతిని గానము చేయుమని సూచించు జ్ఞానబోధకమగు గాయత్రీ మన్త్రమును పాటగా పాడనవసములేదు. నీవు పాడుము అను మాట పాటగా పాడనవసరములేదు. గాయత్రీమన్త్రమును జపించుటలో ఉద్దేశము ప్రచారములో ముఖ్యమైన జ్ఞానాంశ విషయమును మాటిమాటికీ గుర్తుచేసుకొనుటకే. స్త్రీ, శూద్రాదులకు ప్రాకృతము తప్ప సంస్కృతము భాషించుటకు అర్హతలేదనుట సరిగాదు. శూద్రుడైన భూరిశ్రవుడు, గార్గి, మైత్రేయి, సులభాయోగిని మొదలగు స్త్రీలు సంస్కృత వేదపండితులు. అవతార పురుషుడగు బలరాముడు వచ్చినపుడు ఋషులు లేచినిలబడినను భూరిశ్రవుడు నిలబడలేదని వానిని చంపుట అగ్రవర్ణ అహంకారము అని ఆక్షేపించరాదు. ఏలననగా - ఋషులు వివరించిన తరువాత బలరాముడు తప్పుచేసినానని గ్రహించి భూరిశ్రవుని మరల బ్రతికించినాడు. ఈ పొరపాటును ఎవరును బలరామునితో సహా సమర్థించలేదు కదా. నీవు పిండిని మరల పిసుకుటయేల? బలరాముడు యాదవుడు. అగ్రవర్ణము కాదని తెలియవలయును. అవతార పురుషుడు కులములకు అతీతుడు. తొందరపడరాదినియు, పొరపాటుగా శిక్షించినపుడు సవరించుకొనుటకు శక్తిలేనపుడు ఆ శిక్షను ప్రయోగించరాదనియు జనులకు బోధించుటకు ఆయన ఆ విధముగా నటించినాడు.

వృత్తి మెలకువలు - మార్గములు:
ఏ వృత్తిలోనైనను నైపుణ్యము, ఆసక్తి రెండువిధములుగా రావచ్చును. i) పూర్వజన్మల బలీయమైన సంస్కార వాసనల మూలముగాను, ii) ఈ జన్మలో శ్రద్ధతో తమ తల్లిదండ్రులు, కులపెద్దలు ఇచ్చిన తీవ్రశిక్షణ మూలముగాను ఏర్పడవచ్చును. “ఈ రెండు కారణములుకాక మూడవ కారణముగా ‘జీన్’ సిద్ధాంతము ప్రకారముగా సంస్కారము రావచ్చు” నని చెప్పరాదు. ఏలననగా జీన్ కేవలము కొన్ని శారీరక భౌతిక లక్షణములకే పరిమితమని నిరూపించబడినది. కావున వీటికి సంస్కారములతో సంబంధములేదు. భూరిశ్రవునిలో మొదటికారణము ఉన్నది. రెండవ కారణముగా కులవృత్తిలోను తీవ్రశిక్షణచేత ఆ వృత్తిని తరతరములుగా సాగించినప్పుడు, నీవు దీనిని అపార్థము చేసుకొని అసలు మూలవ్యవస్థయే ఇట్టి నియమములనేర్పాటు చేసినదని వ్యవస్థాపకులను నిందించరాదు. దీనికి చిన్న ఉదాహరణ: ప్రభుత్వము ఉపాధ్యాయ పదవులను భర్తీచేయుటకు ఒక పరీక్షను నిర్వహించినది. దానిలో అందరు ఉపాధ్యాయుల పిల్లలే ఉత్తీర్ణులైనారు. దీనికి రెండు కారణములన్నువి.
i) ఉపాధ్యాయ పదవిలో ఎక్కువ ఆదాయములేనందున ఎక్కువ మంది హాజరుకాలేదు.
ii) ఉపాధ్యాయులు తమ పిల్లలకు తీవ్రశిక్షణను ఇచ్చినందున వారు ఆ వృత్తిపై ఆసక్తితో ఆ పరీక్షకు హాజరైనారు.
ఈ అంశములను గమనించి విచారించక, ప్రభుత్వమే ఉపాధ్యాయుల పిల్లలకే ఈ పరీక్షను పెట్టినది అని అపార్థముతో నిందించుట అన్యాయముకదా. సత్యమును తెలుసుకొనుటకు ఓర్పు మరియు విశ్లేషణ ఎంతో అవసరము.
To be continued...
★ ★ ★ ★ ★