
Posted on 07 Jan 2026. Share
16. నిజమైన భూరిశ్రవుడు నేడును అభినందనీయుడే:
“ఈనాడు ఇతరకులములనుండి కూడా బ్రాహ్మణవృత్తిని స్వీకరించు పురోహితులను భూరిశ్రవునివలె ఏల ప్రోత్సహించుటలేదు?” అని వాదించకుము. ఈనాటి వృత్తికిని ఆనాటి వృత్తికిని ఏమాత్రము పోలికలేదు. ఆనాడు ఏమాత్రము ధనాశలేని వేదజ్ఞానప్రచారము. ఈనాడు జ్ఞానములేక బట్టీపట్టి వేదపఠనము ద్వారా ముందుగా నిర్ణయించిన ధనమును సంపాదించుట. ఇట్లు ఈ వృత్తియొక్క అసలు తాత్పర్యమే పూర్తిగా భ్రష్టమైన ఈ కాలములో ఈ వృత్తిని ప్రోత్సహించుట లేక నిరాదరము చూపుట - ఈ రెండును సముద్రములో పోసిన పంచదార లేక ఇసుకవలె వ్యర్థములే కదా. ఆనాడు వేదజ్ఞానప్రచారమను పురోహిత వృత్తికి ధనము మనస్సులోకూడా యాచింపబడలేదు. నీకైనీవు గురుదక్షిణను యథాశక్తి (నీకు ఉన్నంతలో) మరియు యథాభక్తి (పురోహితుని పై నీకుకల శ్రద్ధననుసరించి) దక్షిణను ఈయవచ్చును. నీకు ఉన్నను పురోహితునిపై శ్రద్ధ కలగనిచో ఈయపనిలేదు. నీకు పురోహితునిపై శ్రద్ధ కలిగినను నీకు లేనిచో ఈయపనిలేదు. ఇచట భక్తి శబ్దము పురోహితునిపై నీకుగల శ్రద్ధయేతప్ప దైవభక్తి కాదు. దీనిని దైవభక్తిగా సమన్వయించి నీనుండి ఎక్కువ రాబట్టు ఈ గురువులను ఏమందుము? అసలు ఈ వృత్తిలో ముందుగానే విక్రయవ్యాపారములోవలె పనికి మూల్యము నిర్ణయింపబడుచున్నది. ఈ వృత్తిని జ్ఞానప్రచారముగ చేయుచు, దక్షిణను ఏమాత్రము వీరు ఆశించనిచో, పరమేశ్వరుడు జనులచేత వీరు ఆశించిన దక్షిణకు వేయిరెట్లు ఇప్పించును. కావున ఈ వృత్తి జీవన భృతిగా మారినందున దీనిలో ఇతరులు ప్రవేశించుటకు ఆకర్షణము ఏర్పడినది. కావున ఇతర కులముల నుండి ఉద్యోగములు దొరకని ఈ కాలములో ఈ వృత్తిలోనికి ప్రవేశించుట మూలకారణమైనది. మరికొందరు బ్రాహ్మణులపై మొదటినుండియు ప్రజలుచూపించు గౌరవమును సహించలేక ద్వేషముతో కసిని తీర్చుకొనుటకు ఈ వృత్తిలోనికి దూకుచున్నారు. ఇట్లు దూకుచున్నవారిని మరియు ఈ వృత్తిని ధనార్జనముగా మార్చిన బట్టీ బ్రాహ్మణులను కూడా కలిపి నిందించవలయును. ఆనాడు ధనార్జన దృష్టి ఏమాత్రములేక కేవలము జ్ఞానప్రచారమను దైవకార్యమును నిర్వహించుచు పాపమును తగ్గించి ప్రజలను సహజముగనే ధర్మమార్గమున ప్రవర్తింప చేసిన ఋషులు ఎక్కడ? ఈనాటి ఈ బట్టీబ్రాహ్మణులు ఎక్కడ? ఆనాడు ధనార్జన లేకున్నను పూర్వజన్మ సంస్కారముచేత ప్రేరితుడై ఈ వైదిక వృత్తిలోనికి వచ్చిన భూరిశ్రవుడు ఎక్కడ? ధనార్జనకై మరియు బ్రాహ్మణద్వేషముతో ఈ వృత్తిలోకి వచ్చిన ఇతరకుల పురోహితులు ఎక్కడ? నిజముగ భూరిశ్రవునివలె ధనార్జన దృష్టిలేక పూర్వజన్మ సంస్కార ప్రేరితుడై జ్ఞానప్రచారములో ఆసక్తితో ఏ కులమునుండియైనను ఈ వృత్తిలోనికి వచ్చినచో నేడునూ తప్పక గౌరవనీయుడే.

“జన్మనాజాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః” అన్న శాస్త్రశ్లోకము ప్రకారముగా బ్రాహ్మణుడు ఉపనయనము చేత ద్విజుడు అయిననూ, శూద్రుడు మాత్రము ఉపనయనము లేకపోవుటచే శూద్రునిగానే మిగిలిపోవుట అన్యాయముకాదా? మరియు శూద్ర మ్లేచ్ఛులకు వేదమును వినకుండా కరిగించిన సీసమును చెవిలో పోయమనుట ఎంతో దారుణముకదా” అనివాదించకుము. ఏలననగా - అర్థమును ఏ మాత్రమును తెలియని బట్టీబ్రాహ్మణులు ఈ శ్లోకమునకు ఇట్టి దుష్టసమన్వయము చేయుట, వారివలె అర్థముతెలియని నీవును దానిని నమ్మి నిందించుట - ఈ రెండును హిందూమతమునకు పట్టిన దురదృష్టములు. ఈ శ్లోకములో సర్వః (అందరు) అనుపదమును రెండవ చరణములో అధ్యాహారముగా తీసుకువచ్చినావు. అదేపదము మొదటిచరణములో కూడా రావలయును. అనగా ఈ శ్లోకార్థము - ఎవరైనను ఉపనయన కర్మచేత ద్విజుడు కావచ్చును. మరియు ఎవరైననూ జన్మచేత శూద్రుడే. అనగా ఆసక్తిగలవారు వారిశ్రద్ధను అనుసరించి ద్విజునిగా మారి ధనాశలేకుండా జ్ఞానప్రచారమును చేయవచ్చును. అయితే ప్రతి మానవుడును జన్మచేత శూద్రుడు ఎట్లు అగును? శూద్రవంశమున పుట్టిన ప్రతిశిశువు మాత్రమే శూద్రుడుకదా! కావున ఇచ్చట కులపరమైన శూద్రశబ్దము రూఢిగా ప్రయోగించబడలేదు. అనగా ఒక ప్రత్యేక కులమును శూద్రశబ్దముచే అర్థవిచారము లేకుండా పిలచుట రూఢిఅగును. కావున శూద్రులు అని పిలువబడు కులము రూఢి మాత్రమేతప్ప యోగరూఢికాదు. యోగరూఢిలో శూద్రశబ్దము అర్థపరముగా ఎవరికైనను అన్వయించి అట్లుపిలువవచ్చును.
“శోచతి ఇతి శూద్రః” అను వ్యుత్పత్తి ప్రకారముగా ఎల్లప్పుడు ఐహిక జీవనమును గురించియే చింతించువాడు శూద్రుడు. ఇట్టి చింతాపరుడు ఏ కులమువాడైనను శూద్రుడే. అట్లే “సర్వాన్ బ్రహ్మనయతి ఇతి బ్రాహ్మణః” అను వ్యుత్పత్తి ప్రకారము అందరిని దైవభక్తులుగా మార్చగలవాడు ఏ కులమువాడైనను బ్రాహ్మణుడే. ఇదే గీతాశ్లోక సిద్ధాంతము. కృష్ణుడు గీతాజ్ఞాన బోధద్వారా యోగరూఢి పరముగా బ్రాహ్మణుడే. రూఢి పరముగా యాదవుడగు శూద్రుడే అనవచ్చును. కావున కులము యోగరూఢి ద్వారా ఏర్పడుటయే గీతామతము. అయితే జన్మచేత వ్యవహరించబడుచున్న కులములను కూడా ఆ శబ్దములతోనే పిలచుచున్నారు. ఇట్లు పిలచుట కేవలరూఢి. కావున నీవు ఈ కులశబ్దములను ఉపయోగించునపుడు అవి రూఢిగానా? లేక యోగరూఢి పరముగానా? అను విషయమును నిర్ణయించుకొనవలెను. ఇచ్చట శ్లోకములో శూద్రశబ్దము యోగరూఢి పరముగా సంసారచింత కలవాడు ఎవడైననూ శూద్రుడే అని ప్రయోగించబడినది. కావున మానవజన్మనెత్తిన ఎవడైననూ జీవనభృతి చింతాపరుడే కావున ప్రతి మానవుడును శూద్రుడే. అట్లే ప్రతి మానవుడును ధనదృష్టి లేక జ్ఞానప్రచార కర్మకు సంసిద్ధుడైనచో బ్రాహ్మణుడే. ఈ యోగరూఢశబ్దములతో రూఢశబ్దములను కలిపి ప్రయోగించినచో గందరగోళము ఏర్పడును. ఈ శ్లోకములో బ్రాహ్మణ శబ్దములేదు. కేవలము ద్విజశబ్దమే ఉన్నది. క్షత్రియ వైశ్యులుకూడా ద్విజులేకదా. ఉపనయనము లేనందున శూద్రులు ద్విజులు కానిచో బ్రాహ్మణ స్త్రీలు కూడా ద్విజులుకారు కదా. వారు కూడా శూద్రులే అగుదురు. అపుడు బ్రాహ్మణ కులములో నిత్యము వర్ణాంతర వివాహములు జరుగుచున్నట్లే కదా. కావున ఇచట ఉపనయనము అను శబ్దము కూడా రూఢమా? లేక యోగరూఢమా? అని చూడవలెను. సద్గురువును మాతృభాషలో గానముతో స్తుతించుచు సేవించు ప్రతి కర్మయు ఉపనయనమే అనుట యోగరూఢము. సంస్కృతములో అర్థము తెలియక వేదపఠనము చేయు ఒకానొక సంస్కార కర్మను ఉపనయనము అనుట రూఢము. శ్లోకములో ఉపనయనమునకు బదులు కర్మ శబ్దము ప్రయోగించబడినది. కావున యోగరూఢమైన ప్రతి ఉసాసనకర్మయు ఉపనయనమే. ఈ విధముగా శ్లోకమంతయును యోగరూఢముగా సమన్వయించినచో దీని సారాంశము ఏమనగా -
ఎవడైననూ ఐహికజీవన చింతకలవాడే కావున శూద్రుడే. అట్టి ప్రతి శూద్రమానవుడును జ్ఞానప్రచారమను వృత్తిని స్వీకరించినచో ఉపనయనకర్మ పొందినట్లే కావున ద్విజుడగుచున్నాడు. ద్విజుడు అనగా రెండవ జన్మనెత్తుట. అనగా రెండు జీవితములు కలవాడని అర్థము. i) జీవనభృతిని సంపాదించు ఐహిక జీవితము. ii) ధనాశలేని జ్ఞానప్రచార నిర్వహణము అను ఆధ్యాత్మిక జీవితము. ఇతర కులముల జీవనభృతి వృత్తులు ధనమును బాగుగనే ఇచ్చుచున్నవి. కానీ బ్రాహ్మణులు మాత్రము భిక్షాటనమే జీవనభృతి వృత్తి కావున దరిద్రులగనే ఉన్నారు. అయితే వారు ఇతరకుల వృత్తులను స్వీకరించవచ్చునా? అన్నచో దానికి నిషేధమున్నది. అట్టి ఇతర కులవృత్తుల ద్వారా ధనము చాలావచ్చును కావున అహంకారమేర్పడును. అహంకారము ఈ వృత్తిలో నిషిద్ధము. కావుననే ఈ వృత్తి చాలవరకు బ్రాహ్మణులకే పరిమితమైనది. ఏలననగా ఈ వృత్తిని చేయుచు భిక్షాటనముతో జీవించుటకు ఎవరును ఇష్టపడరు. శూద్రులు సంసారచింతాపరులై (యోగరూఢి) జ్ఞానమునందు నిరాసక్తులై ఉండి జ్ఞానప్రచారమును ప్రోత్సహించరు. వీరిలో కొందరు తీవ్రవాదులు నాస్తికులై జ్ఞాననిందను చేయుచున్నవారు మ్లేచ్ఛులు అనబడుదురు (నాస్తికోవేదనిన్దకః). ఇచట శూద్రశబ్దము వలె మ్లేచ్ఛశబ్దము కూడా యోగరూఢమే. రూఢిపరముగా మ్లేచ్ఛశబ్దము ముస్లీములు అనబడు కులమునందు ఉన్నది. వీరు అల్లా పేరుతో దైవమును నమ్మువారు మరియు ఖురాన్ పేరుగల జ్ఞానగ్రంథమును పఠించువారే. కావున యోగరూఢి పరముగా వీరు మ్లేచ్ఛులు కారు. కావున జ్ఞానదైవములను నిరాదరణచేయు శూద్రులు, నిందించు మ్లేచ్ఛులు జ్ఞానసత్సంగమునకు భంగము చేయకుండా వారిచెవులలో ధ్వని నిరోధకములగు సీసపు గోలీలను పెట్టి దూరముగా తీసుకొనిపోయి విడచుటయే దీని తాత్పర్యము. కరిగిన సీసము అను అపార్థమును సృష్టించినవారు హిందూమతములో చీలికలను కోరుకున్నవారే. కరిగిన సీసమును త్రాగి భరించుట శంకరులకు సాధ్యమైనది కానీ జీవులకు సాధ్యమా?
To be continued...
★ ★ ★ ★ ★