home
Shri Datta Swami

 Posted on 08 Jan 2026. Share

హిందూమత వివరణము (Part-16)

17. గుణకర్మానుసారమే కులవ్యవస్థ:

ఉపాధ్యాయులు లోకంలో అందరికీ విద్యాబుద్ధులను అందించు బాధ్యతను అల్పవేతనములున్నను (ఇటీవల కాలము వరకు) నెరవేర్చుచున్నందున వారిని ఇతరులు గౌరవించిరి. ఇతరులు మాత్రము మిగిలిన వృత్తులవైపే పరుగెత్తెడివారు. అల్పవేతనమైనను ఆ వృత్తిపై నీకు మక్కువ ఉన్నచో నీవు నిరభ్యంతరముగా భూరిశ్రవుని వలె రావచ్చును. ఈనాడు ఆనాడుగా ఉన్నచో ఎవరునురారు. జ్ఞానప్రచార వృత్తిని ఆరంభములోనే ఎన్నుకొని దరిద్రముననుభవించుచు వంశపారంపర్యముగా మెలకువలను పిల్లలకు నేర్పుచూ వచ్చిన ఋషులను అపార్థము చేసుకొని వారు ఇతరులకు అర్హతలేదని నిషేధించినారని దూషించుట అన్యాయము అవివేకము. ఈ వృత్తి పవిత్రతను సర్వనాశనము చేసిన బట్టీబ్రాహ్మణులను నిందించుటలో తప్పులేదు. వీరిని మేమే నిందించుచున్నాము. ఋషులు అట్టి పక్షపాత నిషేధములను చేసియున్నచో భూరిశ్రవుని గౌరవించుట, బ్రాహ్మణుడగు రావణుని నిందించుట, అబ్రాహ్మణులగు రామ, కృష్ణ విగ్రహముల పాదములను నేటికిని కడిగి తీర్థముగా స్వీకరించుట, పంచమ కులీనయగు శబరిని నేటికిని బ్రాహ్మణులు పూజించుట మొదలగు ఋషులు స్థాపించిన హిందూమత సత్సంప్రదాయములు ఎట్లు నిలచినవి?

Swami

“బ్రాహ్మణులు ఉపనయనమును వారికులమునకే పరిమితము చేసుకొనినారు” అని వాదించకుము. ఈ ఉపనయన కర్మను క్షత్రియ వైశ్యులకు వారే వర్తింపచేసిరి కదా. “వారు దీనిని శూద్రపంచములకు నిషేధించుట అన్యాయము కదా” అని వాదించకుము. వారు తమకులములోని స్త్రీలకును నిషేధించినారుకదా. ఎవరైననూ తమ కులములకు తామే చేతులారా అన్యాయమును చేయుదురా? కావున ఈ సంప్రదాయ స్థాపకులగు సద్బ్రాహ్మణ ఋషులకు స్వకులాభిమానము పరకుల ద్వేషము అగు పక్షపాతము లేదు. నీవు ఈ కర్మ యొక్క అసలు అర్థము తెలియక ఇట్లు ఆక్షేపించుచున్నావు. లోకములో జ్ఞానప్రచారమును చేయుటలో ఆసక్తిగల కొందరికే ఆ జ్ఞానప్రచార విషయములను బోధించుటయే ఈ ఉపనయన కర్మతాత్పర్యము. దీనిద్వారా ప్రచారముచేయబడిన జ్ఞానమును గ్రహించుటలో గానీ ఆచరించుటలో గానీ ఎవరికిని నిషేధములేదు. దీనికి ఒక చక్కని ఉదాహరణము: ప్రతివారును సేవించవలసిన మలేరియా నిరోధక మందును గురించి దాని సేవన విధానముల గురించి ప్రచారము చేసి మందును అందజేయుటలో ఆరోగ్యశాఖ ఉద్యోగులకు శిక్షణ ఈయబడినది. ఆ మందు దాని విధానములు ఎవరికైననూ అందనిచో వారు ఫిర్యాదుచేయుట న్యాయమే. ఏలననగా ఈ ప్రచారలక్ష్యము అందరును మందును పొంది సేవించి ఆరోగ్యమును పొందుటయే. కానీ ఎట్టి ధనలాభములేని ఆ ప్రచార శిక్షణ తమకు లభించలేదని, తాము ప్రచారములో పాల్గొనలేదనియు ఎవరైనా ఫిర్యాదు చేయుదురా? నీ ఉద్యోగబాధ్యతలను వదలుకొని దీనికై ముందుకురానేల? ప్రచారములో నీకు వచ్చులాభమేమున్నది? లాభమంతయును ఆ మందును పొంది సరిగా సేవించుటలోనే కలదు. ప్రచారఫలము ముఖ్యముగానీ ప్రచారక్రియ కాదు. ఆ ఫలమే మానవరూపములో నున్న భగవదవతారమును గానముతో స్తుతించి సేవించి ఆయన నుండి జ్ఞానబోధను పొందుటయే. “శూద్రపంచములతో పాటు వారి కులస్త్రీలకును కులలింగ పక్షపాతముతో ఋషులు అన్యాయము చేసినారు” అని వాదించకుము. ఆసక్తి ఆధారముగా మనుధర్మశాస్త్రము స్త్రీలకు గృహకృత్యములలోను, శూద్రులకు సంఘ సేవాకర్మలలోను విధులను ఏర్పాటుచేసినది. మరియు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధతో మెలకువలను నేర్చుట ద్వారా ఈ విధులు కూడా వంశపారంపర్యముగా కొనసాగినవి. ఇట్టి వీరు జ్ఞానప్రచారమునకు సమయములేని వారు.

ఇక పంచమ కులమన్నదే లేదు. వేదములో నాలుగుకులములే పేర్కొనబడినవి. ఈ నాలుగు కులములలో తీవ్ర పాపములను చేసినవారు మిగిలిన వారిచే మార్పుకొరకు బహిష్కరింపబడిరి. తీవ్ర నేరస్థులగు విద్యార్థులు పాఠశాలల నుండి మార్పుకొరకు బహిష్కరింపబడుట నేటికిని ఉన్నది కదా. ఈ బహిష్కృతులు కలిసి పంచమ కులముగా ఏర్పడిరి. తిండి కొరకు ప్రాణులను చంపితినుట పాపము. అందులోను సాయముచేసిన ప్రాణులను చంపితినుట తీవ్రపాపము. పాలు త్రాగి పాలనీయలేని ముసలి ఆవులను గేదెలను చంపితినుట మరియు వ్యవసాయములో సాయపడిన ఎద్దులను, దున్నలను ముసలితనములో చంపితినుట తీవ్ర పాపములు (ఉద్యోగ విరమణము చేసిన వృద్ధ ఉద్యోగులను ఇట్లు చంపని ప్రభుత్వము అభినందనీయము). అయితే ఈ శిక్ష కేవలము వారిలో మార్పుకొనివచ్చుటకే తప్ప ద్వేషముతో కాదు. కావున అస్పృశ్యత పాపము వల్లనే కానీ జన్మచేత కాదు. ఏ కులము జన్మచేత సిద్ధించదు. ఆ కులములో జన్మించిననూ శబరివంటి మహాభక్తులు నేటికినీ పూజనీయులే. దిద్దుకొనుటచేత పాపము మరియు దాని శిక్షయు నశించును. ఏలననగా శిక్ష దిద్దుటకే తప్ప కసితీర్చుకొనుటకు కాదు. పాఠశాల నుండి బహిష్కృతుడైన విద్యార్థి దాని యాజమాన్యమును నిందించునేకాని తాను దిద్దుకొనుటకు యత్నించడు. మార్పు చెందిన విద్యార్థి మరల పాఠశాలలోనికి ప్రవేశించుటయేకాక పరీక్షలకుకూడా హాజరు అగును. అట్లే పంచములలో మార్పు వచ్చిన తరువాత వారిని మరల సగౌరవముగా చేర్చుకొని వారిని జ్ఞానప్రచారమునకు కూడా పంపుటకు వీలగును. ఒక వ్యక్తి లేక కులము యొక్క గౌరవములో హెచ్చుతక్కువలు వారు చేయు పుణ్యపాప కర్మలను బట్టియే తప్ప వారు ఆ కులమున పుట్టినందుకు కాదు. అహింసయే పరమధర్మము (అహింసాపరమోధర్మః). కావున హింసయే పరమపాపము. ఆహారము కొరకు ప్రాణిహింసను చేయుట పరమ పరమ పాపము. భగవంతుడు ప్రొటీన్లు మొదలగు పోషక పదార్థములను ధాన్యము మరియు కూరగాయలలోనే ఎక్కువగా సృష్టించినాడు. వైద్యశాస్త్రము కూడా శాకాహారము ద్వారా లభించిన ఈ సహజ పోషకములే మంచివనియు, శాకములనుండి గ్రహించబడి మరల పునర్నిర్మాణము చేయబడిన ప్రాణుల శరీరములనుండి లభించిన పోషకములు మంచివి కావనియే చెప్పుచున్నది. వ్యక్తిగానీ కులముగానీ పాపములేని ధర్మప్రవర్తన ద్వారానే గౌరవమును అశించవలయును. ఋషినింద, బహిష్కృత విద్యార్థి యాజమాన్యమును నిందించినట్లుండును.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via