
Posted on 09 Jan 2026. Share
18. గుడ్డిగా వేదమును బట్టీపట్టుట - అపార్థములు:
ఉపనయన విషయములో కూడ అర్థము ఏమియు తెలియక బట్టీ బ్రాహ్మణులు అపార్థములను సృష్టించినారు. మలేరియా నిరోధక మందు ప్రచారమును గురించిన శిక్షణ మొత్తము ఇంగ్లీష్‌లోనే ఉన్నది. ఆ శిక్షణ పొందు ఒక ఉద్యోగికి ఇంగ్లీష్ ఏ మాత్రమురాదు. ఆ ఉద్యోగి, ఆ శిక్షణయే వ్యాధినిరోధక మందు అనియు, ఆ మందును తమకు మాత్రమే లభించినది అనియు ప్రచారము చేసినాడు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని మిగిలిన వారును దానిని నిజమే అని భావించి ఆవేశముతో దూషించుదురు. అట్లే ఈ బట్టీబ్రాహ్మణులు ఉపనయన కర్మ సారాంశమును ఏమాత్రము తెలియక, ఉపనయనము అనగా వారుచేయు ఆ సంస్కారమే అనియు, గాయత్రి అనగా అర్థము తెలియక బట్టీపట్టి తాము జపించు వేదమన్త్రమేననియు, అగ్నికార్యము అనగా కట్టెలతో నిప్పును రాజేయుట, హోమము అనగా దానిలో నేతినిపోసి దగ్ధము చేయుట, యజ్ఞము అనగా ఇట్టి అగ్నికార్య హోమములు, ఉపస్థానము అనగా సూర్యునిముందు నిలబడి దోసిలితో నీటిని పారబోయుట అనియు, సవిత అనగా ఆకాశములోని సూర్యుడేననియు, అగ్ని అనగా కట్టెలతో వెలిగించిన లౌకికాగ్ని అనియు భావించినారు. వీరు యోగరూఢి శబ్దములను ప్రత్యేకముగా గుర్తించక, రూఢి శబ్దములనే యోగరూఢి శబ్దములుగా భ్రమపడినారు. సంస్కృత భాషాజ్ఞానము మరియు శాస్త్రపాండిత్యము లేనందున వీటియొక్క అసలు అర్థములు తెలుసుకొనలేక భ్రష్టులై భ్రష్టాచారమును ప్రచారము చేసిరి.

అగ్నిద్వారా దేవతలు ఆహారమును తీసికొందురు అన్న వేదవాక్యమును (అగ్నిముఖా వై దేవాః) అపార్థము చేసుకొని లౌకికాగ్నిలో ఎంతో విలువగల ఆహారమైన నేతిని పోసి దేవతలకు ఆహారమును ఇచ్చుచున్నామని భావమును కల్పించిరి. అగ్ని అనగా బ్రహ్మజ్ఞానియగు సద్గురువే అనియు, సర్వదేవతలు ఆయనలోనే నివసింతురనియు, ఆయనకు పెట్టిన ఘృతాన్నము (ఘృతము) సర్వదేవతలకు చెందుననియు, దానితో ప్రసన్నులై వర్షమును కురిపింతురనియు తెలియకపోవుటయే అజ్ఞానము. ఈ విషయము వేదములో (యావతీర్వై...) స్పష్టము. వీరి విపరీతార్థము వలన ఘృతమును నేరుగా లౌకికాగ్నిలో దగ్ధము చేయుటవలన వాతావరణ కాలుష్యమేర్పడి వర్షములు ఆగుచున్నవి. ఇంతేకాక వాతావరణ కాలుష్యము వలన మానవులకు అనేక రోగములు వచ్చుచున్నవి. ఇట్లు విపరీతార్థము వలన లోకమునకు అపకారము చేయు అసురులుగా భూసురులైన ఈ బట్టీబ్రాహ్మణులు ఏర్పడిరి. మానవులకు ఆహారముగా శాకధాన్యములను భగవంతుడు సృష్టించినాడే తప్ప మానవులకు ఇతర ప్రాణులను చంపితినుట నిషేధము. అట్లు చంపి తిను మానవులు కౄరమృగములకన్న భిన్నులుకారు. ఈ బట్టీబ్రాహ్మణులు చివరకు యజ్ఞములో ప్రాణులను వధించి మాంసాహారులైనారు. మరియు సోమలతారసము అను మద్యపానము కూడా చేర్చినారు. ఇది కూడా వేదార్థము తెలియని అజ్ఞాన ఫలితమే. అచట చంపవలసినది పశువుకాదనియు, పశురూపమున ఉన్న మూర్ఖత్వమేననియు వేదవచనము (మన్యుః పశుః). భాగవతములో భగవదవతారమైన కపిలమహర్షి తల్లికి జ్ఞానమును బోధించు ప్రకరణములో లౌకికాగ్నిలో నేతిని పోసి దగ్ధము చేయువాడు మూఢుడని చెప్పినాడు. మరియు అదే గ్రంథములో లౌకికాగ్నిలో దగ్ధము చేయుటకు వండిన అన్నమును అట్టి హోమమునకు ముందే ఆకలితోనున్న తన మిత్రులకు పెట్టమని మునిపత్నులను కృష్ణభగవానుడు ఆదేశించినట్లు చెప్పబడినది. లౌకికాగ్ని వంటచేయుటకు ఉపకరించు యజ్ఞ సాధనమే కానీ యజ్ఞములో అర్చింపవలసిన ఉపాస్యము ఆకలితోనున్న సద్గురువు మరియు అతిథుల జఠరాగ్నియే. ఈ ఆకలి మంటయే తన స్వరూపమైన వైశ్వానరాగ్ని అని గీతలో భగవంతుడు వచించినాడు (అహంవైశ్వానరో...). తైలాభిషేక మనగా సద్గురువు జ్ఞానాగ్నిని బోధించినపుడు శిరస్సు చాల వేడిగానుండును. దానిని చల్లబరుచుటకు ఉష్ణవాహకమగు తైలమును దానిపై అర్పించవలెను. ఇదికూడ తెలియక బట్టీబ్రాహ్మణులు శిలలపై వ్యర్థముగా తైలమును కుమ్మరించుచున్నారు!
To be continued...
★ ★ ★ ★ ★