
Posted on 10 Jan 2026. Share
19. సమత్వమే న్యాయము:
ఉపనయనము అనగా భగవంతుని సమీపించుట అని అందరికి తెలియును. దీనికి సర్వజీవులకును సమానమైన అధికారమున్నది. జగత్పిత అయిన పరమాత్మను చేరుటకు బిడ్డలందరును అర్హులే. భాషయు, అర్థజ్ఞానము లేని పశు పక్ష్యాదులకు అట్టి అర్హత లేకున్నది. శంకరులు బ్రహ్మసూత్ర భాష్యారంభములో కుల, లింగములకు అతీతముగా ఆసక్తిగల ప్రతిజీవుడును బ్రహ్మజ్ఞానమునకు అర్హుడని వచించినారు. గీతకూడా భగవంతుడు సర్వజీవులకు తండ్రి అనియు (అహంబీజప్రదః...), అన్ని కులములు ఆయనను చేరుటకు అర్హములనియు చెప్పుచున్నది (స్త్రీయో వైశ్యాః...). కావున యోగరూఢి పరముగా సత్యమైన ఉపనయనమును ఎవరికిని నిషేధించుటకు ఎవరికినీ అధికారము లేదు. దీనిని రూఢిపరముగా అర్థములేని ఒకానొక కర్మకు పేరుగా పెట్టుకొని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుల పురుషులకే పరిమితము చేయుట అజ్ఞానము. రూఢిపరముగా ఈ కర్మను స్త్రీ, శూద్ర, పంచములకు నిషేధించుటయు వ్యర్థమే. ఏలననగా రూఢిపరమైన ఈ కర్మ సత్యముగా ఉపనయనమేకాదు. రూఢిపరమైన ఈ కర్మను యోగరూఢిపరమేనని అసత్యము చెప్పుచు కొందరికి నిషేధించుట అజ్ఞానమే.
To be continued...
★ ★ ★ ★ ★