
Posted on 11 Jan 2026. Share
20. లింగవివక్ష పూర్తిగా అర్ధరహితము:
కులవివక్షను కొంతవరకైననూ అర్థము చేసుకొనవచ్చును కానీ లింగవివక్ష మరీ అర్థరహితమైనది. ఈ వివక్ష స్త్రీ పురుషుల బాహ్య శరీరములలో కల కొన్ని స్వల్పమైన మాంసవికారములపై ఆధారపడి ఏర్పడుచున్నది. కులవివక్ష కనీసము అంతర్గత గుణములపై ఆధారపడియున్నది. పురుషుడనగా పురము అనబడు శరీరమునందు చైతన్యస్వరూపముగా శయనించిన లేక వ్యాపించిన జీవాత్మయే తప్ప మగమనిషి అని కాదు. పురుషునకు బాహ్యశరీర లక్షణములతో సంబంధములేదు. కావున ప్రతి మానవజీవియు పురుషుడే. ఈ చైతన్యమే సృష్టిలో శ్రేష్టభాగము కావున పరాప్రకృతి అనబడుచున్నది. మిగిలిన ప్రకృతి శరీరమును సూచించు అపరాప్రకృతి లేక ప్రకృతి అనబడుచున్నది. ఈ రెండు పరా మరియు అపరా ప్రకృతులు, పురుషుడు మరియు ప్రకృతిగా సృష్టిలోని భాగములే. ఈ సృష్టికి అతీతుడైన సృష్టికర్త పురుషోత్తముడు అనబడును. ఇది ఒకరకమైన వర్గీకరణము. మరియొక వర్గీకరణములో పురుషోత్తముడే పురుషుడు. జీవాత్మయు శరీరము కలిసి ప్రకృతి అనబడును. కావున ఇందులో పురుషుడు ప్రకృతి అని రెండు విభాగములే ఉండును. ఏ వర్గీకరణములోనూ శరీరలక్షణములోని భేదము యొక్క ప్రసక్తిలేదు. మగ లేక ఆడ శరీరములలోనున్న ప్రతిజీవాత్మయు పురుషుడే. గీతలో ఒక పురుషుడు మరియొకరిని ఎట్లు చంపును (కథం సపురుషః...) అన్నపుడు పురుషుడు అనగా చంపుచున్న మగవాడేకాదు ఆడదియు అని తెలియవలెను.
ఇట్లు ఆత్మా, జీవః మొదలగు పుంలింగ శబ్దములన్నియును జీవాత్మనే చెప్పునుకానీ లింగ వివక్షను చేయవు. కొందరు మూర్ఖులు పురుషుడనగా మగవాడేననియు కావున వేదాంతశాస్త్రము మగవారికేననియు పలుకుదురు. గార్గి, మైత్రేయి, సులభయోగిని మొదలగు స్త్రీలు వేదాంత విదుషీమణులు. జ్ఞానాధిదేవతయగు సరస్వతియు స్త్రీయే. గాయత్రిని స్త్రీదేవతగా వర్ణించిరికదా. మరి స్త్రీలకు గాయత్రినెట్లు నిషేధింతువు? స్త్రీయగు దేవీపూజలో షోడశోపచారములలో యజ్ఞోపవీతమునెట్లు సమర్పించుచున్నావు? సీత సాయం సంధ్యావందనము చేయుటకు ఈ సరస్సు వద్దకు వచ్చునని హనుమంతుడు చింతించుట సుందరకాండలో కలదు (సంధ్యార్థం వరవర్ణినీ). పూర్వయుగములో స్త్రీలకు ఉపనయనములు జరుగుచున్నట్లు స్మృతి (పురాకల్పేతు నారీణాం). మరి ఈ కలియుగములో స్త్రీలకు ఉపనయనము ఏల లేదు? దీనికి కారణము ఈ కలియుగములో నిత్యము పాకయజ్ఞమును స్త్రీలు చేయవలసి వచ్చినందున వారి యజ్ఞోపవీతమును వివాహములో భర్తలకు కన్యల తండ్రులు అందించుచున్నారు. దీనివలన భర్తచేయు పుణ్యకర్మల ఫలములో సగము భార్యకు వచ్చుచున్నది. ఇట్టి ఏర్పాటుకు కారణము కలియుగములో ప్రతిదినము స్త్రీలు పాకయజ్ఞమును చేయవలసి వచ్చినది. పూర్వయుగములో కందమూల ఫలాదులు నిత్యాహారములు. ఎప్పుడో అతిధి వచ్చినప్పుడే వంటలను చేయు పాకయజ్ఞము జరిగెడిది. ఆ యజ్ఞములో భార్యాభర్తలిరువురును సమముగా పాల్గొనెడివారు. కావున ఎవరి అనుష్టానములు వారే చేసుకొనెడివారు. ఇట్టి ఏర్పాటు రోగి యొక్క సంధ్యావందనము బంధువుచేయు ఆచారమున కనపడుచున్నదికదా! వేదము కూడా పురుషుడనగా భగవంతుడేనని జీవాత్మలందరును స్త్రీలు ఆయన సతులేననియు చెప్పుచున్నది (స్త్రీయఃస్సతీః...). ఈ సందర్భములో మీరా తులసీదాసుల సంభాషణము ఒకటి గమనీయము. మీర తులసీదాసు ఆశ్రమములో ఒకరోజు ఉండుటకు తులసీదాసును అర్థించినది. దానికి ఆయన తన ఆశ్రమమున స్త్రీలకు నిషేధమని పలికినారు. దానికి మీర ఆశ్చర్యముతో “మన జీవులలోకూడా పురుషులున్నారా? ఇప్పటివరకు కృష్ణుడొక్కడే పురుషుడని భావించుచుంటిని” అని పలికినది. ఈ రెండు వర్గీకరణములలో పరమాత్మను పురుషశబ్దముతో చెప్పుటకు కారణము: పరమాత్మ ఒక జీవాత్మ శరీరములోనికి ప్రవేశించి పురుషుడు అనబడు నరశరీర ఉపాధితో తాదాత్మ్యము చెందుటవలన పరమాత్మను చూపించుటకు అవకాశము వచ్చినది. లేకున్నచో అనూహ్యుడగు పరమాత్మ ఊహలకు సైతము అందడు కావున “ఇదిగో పరమాత్మ” యని చూపించుటకు సాధ్యము కాదుకదా.

బ్రాహ్మణుడు ఇంటిలో భార్యనుండి గృహకృత్యముల సేవాఫలమును పొందినట్లు, సంఘములో శూద్రులు చేయు సంఘసేవా ఫలములు కూడా పొందుచున్నాడు. కావున అతడు చేయు అనుష్ఠాన ఫలములో కొంతభాగము శూద్రులకును చెందుచున్నది. సర్వజనులు సుఖముగా నుండవలెనని బ్రాహ్మణుని అనుష్ఠాన ఫలము లోకమునకు అర్పించబడుచున్నది. అనుష్ఠానమును చేయు క్షత్రియ వైశ్యులకు ఈ ఫలభాగము అవసరములేదు. కావున ఈ ఫలభాగము అనుష్ఠానము చేయని గృహములోని స్త్రీలకు, సంఘములోని శూద్రులకు అందుచున్నది. అయితే, జ్ఞానప్రకరణమైన గాయత్రీమన్త్రమును మాటిమాటికి గుర్తుచేసుకొనుటకు చేయు జ్ఞానప్రచార శిక్షణయేకానీ, పరమాత్మను ఉపాసించు నిజమైన అనుష్ఠానముకాదు. అర్థముతెలియనందున ఇది జ్ఞానప్రచార శిక్షణయుకాదు. కానీ, దీనిని నిజమైన అనుష్ఠానముగా అందరును భ్రమపడుచున్నందున దీనికి ఫలము ఉండుటయు దానిని పంచుటయు భ్రమయే. ఇట్లు అర్థరహితమైన వైదికకర్మలన్నియు పూర్తిగ వ్యర్థములే. నిజమైన అనుష్ఠానము - పరమాత్మను కులలింగములకు అతీతముగా ఎవరైనను తన మాతృభాషలో లేక అర్థము బాగుగ తెలిసిన మరియొక భాష (సంస్కృతము) లో కానీ గానముతో, భక్తితో స్తుతించుటయే. అర్థము తెలిసిన భాషలో శబ్దము అర్థమును, అర్థము భావమును, భావము రసమును పుట్టించును. నారద భక్తి సూత్రముల ప్రకారము భక్తి రసస్వరూపము.
“స్రీలు మాసిక ఋతుచక్రము వలన నాలుగు రోజులు అస్పృశ్యులు కావున వీరికి ఉపనయనము నిషిద్ధము” అని వాదించకుము. ఏలననగా - ఇంద్రుడు వృత్రాసురుని చంపిన పాపము నాలుగు భాగములుగా స్త్రీల ఋతువులోను, జలము యొక్క నురుగులోను, భూమి యొక్క గంధములోను, పుష్పముల యొక్క రేణువులలోను నిక్షిప్తమైనదని శాస్త్రప్రమాణము. మిగిలిన మూడు నిత్య పవిత్రములుగా చూచుచున్నాము. మట్టిని యజ్ఞవేదికా నిర్మాణమునకు, జలమును పుణ్యకర్మలలోను, పుష్పములను అర్చనలోను వాడబడుచునే యున్నవి. భూమిమట్టిలో గంధమున్ననూ, జలములో నురుగు ఉన్ననూ, పూలలో పుప్పొడి రేణువులున్ననూ వాటికి పుణ్యకార్యములలో నిషేధములేనప్పుడు స్త్రీలకు మాత్రము ఋతుదినములలో సైతము నిషేధమెట్లు వచ్చును? అయితే స్త్రీలకు ఆ నాలుగు దినములు గృహకృత్యములలో పాల్గొనకుండా వ్యవస్థ నిషేధించుటలో అంతరార్థము ఏమనగా - ఆ నాలుగు రోజులు రక్తస్రావము వలన స్త్రీని రోగిగా భావించి గృహకృత్యములలోనికి రానీయకుండా బలవంతముగా విశ్రాంతిని కల్పించుటయే. ఈ నిజము తెలిసినచో వారు విశ్రాంతిని లెక్కచేయక ఆ నాలుగు రోజులలో కూడా గృహకృత్యములలో పాల్గొందురు కావున వారి విశ్రాంతి ప్రయోజనమును లక్ష్యముగా నుంచి అస్పృశ్యత అను అసత్యము ద్వారా విశ్రాంతిని సాధించుచున్నారు. ఇట్టి ఏర్పాట్లు అర్థవాదము లనబడును. రోగియైన పురుషుడు రోగసమయములో అనుష్ఠానము చేయడు కదా! కానీ పురుషునికి దీనివలన ఉపనయన నిషేధములేనప్పుడు, స్త్రీకి మాత్రము ఎట్లు నిషేధము వచ్చును? భూమి, జలము, పూలు విషయములో అవి అచేతనములు కావున రోగము విశ్రాంతి ప్రసక్తిలేదు. రక్తస్రావము కల గాయమున్నప్పుడు పురుషునకు కూడా విశ్రాంతి నిర్దేశింపబడుచున్నది కదా! కావున స్త్రీల ఋతుచక్రమునకు ఉపనయనాది వైదిక కర్మలకు ఏ సంబంధమూ లేదు.
To be continued...
★ ★ ★ ★ ★