
Posted on 12 Jan 2026. Share
21. అహింస పరమధర్మము గౌరవ ప్రదము:
గుణానుసారముగా, ఆసక్తిని ఆధారము చేసుకొని, బాధ్యతలను పంచి ఏర్పరిచిన కులవ్యవస్థలో ఎట్టి దోషము లేదు. వీటి మూలముగా కులములలో హెచ్చు తక్కువలు లేవు. నాలుగు కులములను సృష్టించిన బ్రహ్మయొక్క ముఖము, బాహువులు, తొడలు, పాదములు సమాన అంగములే. దేనిని కొట్టిననూ మిగిలిన వాటికి కూడా బాధకలుగును. ఇంతవరకును నాలుగు కులములకు సమానస్థానము మరియు సమానగౌరవము ఉన్నది. కానీ పరమధర్మమైన అహింసకు విరోధముగా ప్రాణి హింసను చేసి మాంసాహారమును భుజించుట మహాపాపము మిక్కిలి అధర్మము. కేవలము ఈ విషయమును బోధించుటకు బుద్ధ, మహావీరులను రెండు అవతారములు వచ్చినవి. ఈ ధర్మాధర్మములను ఆధారముగా చేసుకొని గౌరవములో హెచ్చుతగ్గులు వచ్చినవి. నిజముగా మాంసాహారులగు క్షత్రియులకన్నా వైశ్యులు గౌరవనీయులు. కానీ క్షత్రియులు రాజ్యపాలకులు కావున పాలకునకు అత్యధిక గౌరవము అవసరమైనందున మూడవ స్థానములో ఉండవలసిన క్షత్రియులు రెండవ స్థానమునకు వచ్చిరి. క్షత్రియులు, యుద్ధములో బలము అవసరము కావున తమ మాంసాహారమును సమర్థించుకొనరాదు. ఏలననగా కేవలము శాకాహారియైన పరశురాముడు యుద్ధములో సర్వక్షత్రియ సంహారము చేసినాడు. శూద్రులు సంఘసేవలో ప్రభుత్వము యొక్క ముఖ్యయంత్రాంగములు. గృహకృత్యములలో స్రీలు ఎంత గౌరవనీయులో సంఘసేవలో శూద్రులును అంత గౌరవనీయులే. కులవివక్షతో శూద్రులను, లింగ వివక్షతో స్త్రీలను తక్కువచేయరాదు. స్త్రీలను గౌరవించిన చోట దేవతలు ప్రసన్నులగుదురని మనుధర్మశాస్త్రము. ఆహారములో ప్రాణిహింసా విషయమే గౌరవమును తగ్గించుచున్నది. భగవంతుడైన రాముడు మాంసాహారియని భ్రమించరాదు. భగవంతుడు ఒక కులమును ఉద్ధరించుటకు దానిలో అవతరించి వారికి సన్నిహితుడుగా అగుటకు వారి సంస్కృతిని పాటించవలసి వచ్చును. బురదగుంటలో కూరుకుపోయిన వారిని ఉద్ధరించుటకు బురదగుంటలో దూకినందున బురద అంటుకొనక తప్పదు.
“మీరు శూద్రులను బుజ్జగించి మోసగించుటకు ఇట్టి నయవంచకపు మాటలను పలుకుచున్నారు” అని పలుకవలదు. శూద్రులను మోసగించినచో, బ్రాహ్మణులు తమ కులస్త్రీలను కూడా మోసగించినట్లే కదా! ఉపనయన (రూఢి) నిషేధము, సేవాధర్మము స్త్రీ, శూద్రులకు సమానమే కదా! పైగా నిషేధింపబడిన ఉపనయనము అసత్యమైనదే (రూఢమే) కానీ సత్యము (యోగరూఢము) కాదుకదా! సత్యమైన ఉపనయనము అందరికిని మలేరియా నిరోధక మందువలె సమానముగా అందుచున్నది. ఆ మందు ప్రచారము వంటి అసత్యమైన ఉపనయనము (అనగా సత్యముగా మందు ప్రచారకులకు మాత్రమే ఈయబడుటలేదు) కొందరికి మాత్రమే విధించబడుటలో ఎవరికిని ఎట్టి నష్టము లేదు కదా! మరియు ఎవరికిని ప్రత్యేక లాభము కూడా లేదుకదా!
To be continued...
★ ★ ★ ★ ★