home
Shri Datta Swami

 Posted on 13 Jan 2026. Share

హిందూమత వివరణము (Part-21)

ఉపసంహారము

హిందూమతము శైవ, వైష్ణవ, శాక్తేయ ఆది అనేక మతముల సమన్వయముతో ప్రకాశించుచు, ప్రపంచములోనున్న అనేక మతముల సమన్వయముతో రావలసిన విశ్వమతమును సూచించు సందేశము నిచ్చుచున్నది. హిందూమతములోని మతగ్రంథములగు వేద, పురాణ, బ్రహ్మసూత్ర, ధర్మసూత్ర ఆది శాస్త్రగ్రంథములను ఇతర దేశస్థులగు ఇతర మతముల వారు తమ భాషలలోకి అనువదించుకొని, ఆ గ్రంథములలోగల ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క ఔన్నత్యమునకు ఆశ్చర్యపడుచున్నారు. కానీ, హిందూమతము వారు మాత్రము అర్థజ్ఞానము ఏమాత్రము తెలియని అజ్ఞానములో, కేవలము వేద పఠనధ్వని శ్రవణ మాత్రముచే సంతృప్తులై పరస్పర ద్వేషములతో కొట్టుమిట్టాడుచున్నారు. ఒక దీపము యొక్క కాంతి గది మొత్తము ప్రసరించి ఆ గదిని ప్రకాశవంతముచేయుచున్నను, దీపము కుంది కింద మాత్రము ప్రకాశము లేక అంధకారముండును. ఇట్టి పరిస్థితిని తొలగించుటకు మతగ్రంథములను ఆయా మాతృభాషలలోకి అనువదించుకొని పురోహితులు సంస్కారకర్మల సందర్భములలో పఠించి అందరికి అర్థవివరణము చేయవలెను. సంస్కృతభాషపై మక్కువ ఉన్నచో, మతగ్రంథములను యథాతథముగా పఠించి అర్థవివరణము చేయవలెను. ప్రతి సంస్కార కర్మ సందర్భము జ్ఞాన యజ్ఞముగా పరిణమించి అందిరిలో ఆచరణను ప్రేరేపించవలెను. అంతే కాని కేవల శబ్ద - కర్మ - ద్రవ్య యజ్ఞములుగా కొనసాగినచో చివరకు హిందూమతము అదృశ్యమైపోవును. ఈ ఒక్క మూలదోషమును చంద్రునిలో మచ్చనువలె తొలగించినచో బంగారమునకు సుగంధమబ్బినట్లు హిందూమతము అందరినీ ఆకర్షించి పవిత్ర హిమాలయ శిఖరమువలె ప్రపంచములో ఎంతో ఉన్నతముగా నిలచును. తిరుపతి దేవస్థానము వంటి సంస్థలు ఈ సంస్కరణకు శ్రీకారమును చుట్టి, వేద పాఠశాలలో వేదములను బట్టీపట్టుట తొలగించి, సంస్కృత - వేద - శాస్త్ర జ్ఞానమును నేర్చుకొనునట్లు మార్పుచేయవలెను. వేదమును గ్రంథమును చూచి చదువుటలో తప్పులేదు. ఇతర మతములలో పురోహితులు వారి మత గ్రంథములను చూచి చదువుచున్నారు. లిఖితపఠనము (లిఖిత పాఠకః) దోషముగా చెప్పబడినదిగదా అని సంశయింప పనిలేదు. ఈ శ్లోకము ప్రాచీన కాలములో వేదమును బట్టీపట్టవలసిన అవసరమున్నపుడు దానితోపాటు అర్థమును తెలియుటను కూడ చేర్చి లిఖింపబడి ఉండవచ్చును. లేదా కేవల వేదపఠనముచే జీవనభృతిని సంపాదించుకొనువారిలో ఎవరైనను ఈ పదమును ముందున్న మరియొక పదమును తొలగించి దాని స్థానములో ప్రక్షేపముగా లిఖించి యుండవచ్చును. బహుశః తొలగించబడిన పదము ‘నియత దక్షిణః’ అనగా ముందుగనే దక్షిణను నిర్ణయించువాడు కూడ అధముడు అని ఉండి ఉండవచ్చును. అదే శ్లోకములో అర్థమును తెలియనివాడు (అనర్థజ్ఞః) కూడ అధముడని కూడా చెప్పబడినది గదా! వేదశబ్దర్థామే జ్ఞానము కదా! శాస్త్రముచెప్పిన వేదః - అధ్యేతవ్యః - జ్ఞేయశ్చ అను మూడు శబ్దములకు కూడా జ్ఞానమే అర్థము కదా జ్ఞానముతోనే కర్మ చేయవలయును, కర్మ కూడా జ్ఞానమును బోధించుటకే, జ్ఞానముతో సమాన పవిత్రత కలిగినది ఏదియులేదు (జ్ఞాత్వా కుర్వీత..., సర్వం కర్మాఖిలం... నహిజ్ఞానేన...) మొదలగు అంశములతో జ్ఞానప్రాధాన్యతను గీత ఎలుగెత్తి చాటుచున్నది గదా!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via