;

26 Dec 2025
2. దోషములకు మూలకారణము:
అన్ని మతములలోను దోషములు ఏదో ఒక రూపములో ఉండుచునే ఉన్నవి. ఒక మతములో ఒక కోణములో దోషముండును, మరియొక కోణములో గుణము ఉండును. ఈ దోషములను వడపోసి, విసర్జించి పరమతములోని గుణములను తన మతములోనికి తెచ్చుకొనుట నిజమైన విజ్ఞత. పరమతముల నుండి హిందు మతములోనికి తెచ్చుకొనవలసిన ఒకానొక ముఖ్య గుణము ఏమనగా - పరమతములలో దైవగ్రంములు వారి మాతృభాషలలో ఉన్నవి. వాటిని ఆ మత పురోహితులు బట్టీపట్టక (బట్టీపట్టుటలో సమయము చాల వ్యర్థమగును), గ్రంథములను చూచి పఠించుచున్నప్పుడు సర్వజనులకు అర్థము స్పష్టముగా తెలియుచున్నది. కావున సంస్కార కర్మలన్నియును సహజముగా జ్ఞానబోధలు అగుచున్నవి. పురోహితులు వాటి విశేషార్థమును వివరించి లోతుగ మరియు విస్తారముగా జ్ఞానబోధలను చేయుచున్నారు. దీనివలన దుష్టసమన్వయములు, అపార్థములు మరియు చెడు సంప్రదాయములు ప్రవేశించుట చాల కష్టము. ఒకవేళ ప్రవేశించినను, సర్వజనులును ప్రశ్నించి చర్చించుదురు. ఈ భయముతోనైనను, పురోహితులు మరియు వారి అనుయాయులు స్వార్థ - అహంకారములతో అపార్థములను సృష్టించుటకు ముందుకురారు.

కానీ హిందూమతములో దురదృష్టము ఏమనగా - మతగ్రంథములగు వేదములు, పురాణములు సంస్కృతములో నున్నవి. సంస్కృతము మాతృభాషగా ఉన్న ప్రాచీన సమయములో ఏ సమస్యయునులేదు. కానీ నేటికిని పురోహితులు సంస్కారకర్మలలో సంస్కృతభాషలోనే వేదపురాణములను పఠించుచున్నారు. కేవలము ‘జడమైన టేప్‌రికార్డర్’ వలె బట్టీపట్టి పఠించుటవలన, కొందరు వీరి స్థానములో టేప్‌రికార్డర్‌లను వాడుచుండుటయు సమ్మతమేకదా! వీరి అర్థరహిత పఠనములో అనేక వ్యాకరణదోషములు దొర్లుచుండుటవలన వినుటకు పండితులకు కర్ణకఠోరముగనుండును. కనీసము వాటి అర్థమునైనా వివరించరు. ఏలననగా అర్థమును తెలుసుకొనక కేవలము వాటిని బట్టీపట్టుట వలన వారికే అర్థము తెలియదు. వారి సొంతకవిత్వములగు అపార్థములను చెప్పుటవలనను, వినుచున్న జనులకు కూడా ఏమాత్రము అర్థము తెలియక పురోహితులు ప్రచారము చేయు అపార్థములను గుడ్డిగా నమ్ముచున్నందునను, హిందూమతములోనికి కలుషములు బాగుగ ప్రవేశించినవి. నిజముగా హిందూమత గ్రంథములలో ఉన్నంత నిశితమైన జ్ఞానము ఎచ్చటను కానరాదు. పండ్లు ఉన్నచోటనే పురుగులు పట్టినట్లు, జ్ఞానము యొక్క లోతు మరియు కలుషముల యొక్క సంఖ్యయు ఈ మతములో ఎక్కువగా ఉన్నవి.
To be continued...
★ ★ ★ ★ ★