
Posted on 27 Dec 2025. Share
3. స్వామి దయానంద సరస్వతి సంస్కరణలు:
స్వామి దయానంద సరస్వతి హిందూమతములోని మతాంతరీకరణములను ఆపుటకు కొన్ని సంస్కరణలను చేసినారు. కులము జన్మచేత కాదనియు, ఉపనయనము మొదలగు వైదిక సంస్కారకర్మలు కుల, లింగములకు అతీతముగా అందరికినీ విధించినారు. దీనిచేత తాత్కాలికముగా ప్రయోజనము కనపడినది. అయితే, దీనివలన ప్రాచీన ఋషులు దోషులేననియు, ఇంతవరకూ జరిగిన అన్యాయము వలన గతించిన అనేక తరములు నష్టపడినవి అనియు, అంగీకరించ వలసి వచ్చుచున్నది. ఆవేశముతో జరిగిన మతాంతరీకరణములను ఆపుటకు ఆయన అభినందనీయుడే. కానీ ఆజ్ఞానులగు బట్టీ బ్రాహ్మణులు చేసిన వివరీతార్థముల వలన అపార్థములు వచ్చుటను ప్రశాంతముగ విశ్లేషించినచో ఋషులు ఎప్పుడునూ ఎవరికినీ ఎట్టి అన్యాయమును చేయలేదని స్పష్టమగును. దౌర్భాగ్యమేమనగా బట్టీ బ్రాహ్మణులగు పురోహితులు చేసిన అపార్థములనే ఋషుల నిర్ణయములుగా భ్రమపడి కొందరు ఋషినిందకు దిగిరి.
ఋషులవంశములో అవతరించిన పరబ్రహ్మమైన శ్రీదత్తాత్రేయ భగవానుడు ఈ దత్తస్వామి అనుపేరుగల జీవుని ఆవేశించి, నిశితవిశ్లేషణతో సత్యమును ప్రకాశింప జేసి, ఋషులు స్థాపించిన సత్యజ్ఞానమును చూపించుచు, తన కులీనులే అయిననూ బట్టీబ్రాహ్మణులను విమర్శించి వారి అపార్థములను ప్రదర్శించుచున్నారు. ఆయన సర్వజీవులకు తండ్రి కావున, గుణవంతుడైన పుత్రుని ప్రశంసించి, అజ్ఞానియైన పుత్రుని ద్వేషముతోకాక దిద్దుటకు విమర్శించుచున్నారు. ఆయన ఉపాధియగు శరీరమునకే కులముగాని, దానిలో ప్రవేశించిన అనూహ్యపరమాత్మ కులలింగాదులకు అతీతుడు.

4. ఋషులు, పండితులు మరియు బట్టీబ్రాహ్మణులు:
ప్రాచీన కాలములో బ్రాహ్మణులైన ఋషులు వేదశాస్త్రములను అనుసరించి హిందూమత సంప్రదాయమును నిర్మించిరి. తరువాత కాలములో వీరే పండితులుగా పిలువబడుచు, స్మృతులను కూడా సహాయముగా తీసుకొని ఋషిమార్గములోనే జ్ఞానమును విస్తరించిరి. ఇంతవరకూ నిశితవిశ్లేషణతో వేదార్థమును తెలియుట ప్రధానమైనందున సంప్రదాయము శుద్ధముగా అద్భుతముగా ఉండినది. దురదృష్టము వలన అప్పుడు గ్రంథముద్రణము లేనందున వేదమును బట్టీపట్టుట అవసరమైనందున, ఋషులు ఈ అధిక బాధ్యతను కూడా నెరవేర్చిరి. ఋషులకాలములోనే తరువాత తాళపత్రములపై వ్రాయుట వచ్చినది. కానీ, ఒక సమయములో ఒక్క గ్రంథమే తయారగును తప్ప ఈనాడు వలె ఎన్నోగ్రంథములు ఒకేసారి ముద్రితములగుటకు వీలుకాలేదు. ఒక్క గ్రంథమే ఉన్నప్పుడు కొన్ని వాక్యములను చేర్చుట లేక తీసివేయుటకు, అవకాశముండెను. కావున ఇట్టి ప్రమాదములను నివారించుటకు బట్టీపట్టుట తప్పలేదు. కానీ, వేదశాస్త్రముల తాత్పర్య విశ్లేషణమే ప్రధానకర్తవ్యముగా ఉండి బట్టీపట్టుట చాల తక్కువ సమయములో ఉండెడిది. వేదమును అనేక శాఖోపశాఖలుగా విభజించినందున, ప్రతివారును ఒక్కొక్క శాఖనే బట్టీపట్టుటకు తీసుకొన్నందున, చాల చిన్న భాగమును బట్టీపట్టుటయే జరిగినందున, వారి అధ్యయన (జ్ఞాన చర్చ) సమయము నష్టము కాలేదు. సమయమంతయును కేవలము బట్టీపట్టుటయే జరిగినచో బుద్ధి పనిచేయక మందగించి ఆలోచించు శక్తిని కోల్పోయి చెడిపోవును. కావున అర్థవిచారమే పూర్తి సమయములో జరిగినది.
ఋషులు, పండితుల అనంతరము, బట్టీబ్రాహ్మణులు సంస్కృత భాషను నేర్చుకొనక వేదశాస్త్రముల అర్థములను ఏ మాత్రము తెలియక ఆధ్యాత్మిక జ్ఞాన గంధమునకు పూర్తిగ దూరముగనుండిరి. వేదమును ఒక్క శబ్దమునకు కూడ అర్థమును తెలియక దానిని కేవలము బట్టీపట్టుటయే వారి విధి. చాలకాలము ఇట్లు జరుగుటచేత వారిబుద్ధులు పనిచేయక చెడినవి. చివరకు సామాన్యమైన లోకజ్ఞానము కూడా వారిలో లేదు. అయితే ఈ అజ్ఞానముతోబాటు, తాము ఋషుల కులములో పుట్టితిమన్న అహంకారము మాత్రము బాగుగ ఉండినది. నేటి ఈ బట్టీబ్రాహ్మణులు, ఋషులైన బ్రాహ్మణుల వంశములో జన్మించినందున వీరు కేవలము బ్రహ్మబంధువులు (బ్రాహ్మణులతో బంధుత్వము కలవారు) అని వేదముచేతనే చెప్పబడిరి. వీరిని దేవపశువులనియు వేదము పిలిచినది (దేవానాం పశురహహ...). వీరి చెవులు వేదపఠనములో శబ్దధ్వనిని మాత్రము వినగలవు. కానీ అర్థము ఏమాత్రము తెలియదు. అట్లే పశువులు మన సంభాషణ ధ్వనిని మాత్రమే వినునుకానీ శబ్దార్థమును ఏమాత్రము తెలియవు. స్వల్పమైన కూలిని ఆశించి మూటలోనున్నది బంగారమని తెలియక, బంగారపు మూటలను మోయుచున్నవాడే ఈ బట్టీబ్రాహ్మణుడని శాస్త్రవచనము (స్వర్ణభారహరః). జ్ఞానములేనప్పుడు మౌనముగనుండుట అజ్ఞాన లక్షణము. కానీ అజ్ఞానముతో అహంకారము చేరినపుడు విపరీతార్థమైన దుష్టజ్ఞానము బయలుదేరును. ఈ రెండునూ చేరియుండుట చాల ప్రమాదము. ఈ దుష్టజ్ఞాన ప్రభావములే హిందూమతములోని చీలికలు. ఈ దుష్టజ్ఞానము ఋషులనుండియే వచ్చినదని భ్రమించి జనులు ఋషినిందను చేయుచుండిరి. అసలు ఋషుల జ్ఞానమును తెలుసుకొనుటకు ఈ జనులకును సంస్కృత భాషాజ్ఞానము లేకున్నది. ఇప్పటికైననూ ఈ బట్టీబ్రాహ్మణులు, తమ తండ్రులు తమకు చేసిన అన్యాయమును తమపిల్లలకు మరల చేయకుండా వారినైననూ సరియైన మార్గములో సంస్కృతములో వేదశాస్త్ర జ్ఞానమును నేర్చుకొనునట్లు చేయవలెను.
ఈ బట్టీబ్రాహ్మణులు వేదార్థమును తెలియనక్కరలేదనియు, దాని ధ్వనిమాత్రమే భగవంతునికి ప్రీతిని కలుగజేయుననియు మూర్ఖముగ వాదించుచున్నారు. దీనితో వేదార్థవిచారమైన జ్ఞాన ప్రచారమును పూర్తిగ సమాధిచేసినారు. వేదము అనగా కేవలము ఒక పవిత్ర గ్రంథమేకాదు. వేదశబ్దము యొక్క అర్థము జ్ఞానము కావున ఆ గ్రంథములోనున్న జ్ఞానమే వేదము. వీరు వేదమును గ్రంథముగానే తీసుకొన్నారు. ఇది మొదటి పొరపాటు. కావున శాస్త్రము ఈ పొరపాటును దిద్దుటకు వేదమును అధ్యయనము చేయవలెనని చెప్పినది. అధ్యయన శబ్దము యొక్క అర్థము కూడా జ్ఞానమే. కానీ వీరు అధ్యయన శబ్దమును కూడా బట్టీపట్టుట అనియే తీసుకొన్నారు. మరల మూడవసారి శాస్త్రము ఈ రెండవ పొరపాటును దిద్దుటకు వేదజ్ఞానమును తెలియవలయునని ఆదేశించినది (వేదోఽ ధ్యేతవ్యో జ్ఞేయశ్చ). మూడవసారియు అదే పొరపాటు. దీనికి కారణము సంస్కృతములో చెప్పబడిన మాటను అర్థము చేసుకొనలేకపోవుటయే. ఇకచేయునది లేక శాస్త్రము వీరిని అధములని నిందించినది (అనర్థజ్ఞో - పాఠకాధమాః). ఇది కూడా అర్థముకాలేదు. కావున వారిని బాగుచేయలేమని చెప్పుచూ పాదనమస్కారము చేయుటయే మిగిలినది!
To be continued...
★ ★ ★ ★ ★