
Posted on 28 Dec 2025. Share
5. సమస్యలు - సమన్వయములు:
హిందూమతములో ఏ విషయమును చర్చించినను దానికి రెండు కోణములుండును. i) సత్యజ్ఞానమార్గమైన సత్సంప్రదాయమగు ఋషికోణము. దీనిలో సమన్వయము గోచరించును. ii) అజ్ఞాన - అపార్థ దుష్టసంప్రదాయమగు అర్థము తెలియక బట్టీపట్టిన పురోహితుల బట్టీ కోణము. దీనిలో సమస్య గోచరించును. కొన్ని విషయములను పరిశీలించుదుము.
i) ఋషికోణములో: జ్ఞానప్రచారము చేయు కొందరికి మాత్రమే ఆ జ్ఞానములో శిక్షణనిచ్చుట అను ఉపనయనము, గాయత్రి అందరికి అక్కరలేదు. ఈ జ్ఞానప్రచారకులకే వేదాధ్యయనము పరిమితము. జ్ఞానప్రచారములోని విషయములను విని అర్థము చేసుకొని ఆచరించి తరించుట అను ఫలములో అందరికినీ సమాన అధికారము కలదు కావున ఎవరికినీ అన్యాయము జరుగలేదు.
బట్టీకోణములో: ఉపనయనము క్రియద్వారా ఉపదేశించబడుచున్న ప్రత్యేక ప్రార్థనయగు గాయత్రీమన్త్రము పవిత్ర కులీనులగు కొందరికే పరిమితము. అపవిత్రకులీనులకు నిషిద్ధము.
ii) ఋషికోణములో: వేదాధ్యయనము అనగా వేదములోని జ్ఞానమును తెలియుట మాత్రమే కావున ఆ జ్ఞానమును నీ మాతృభాషలో వివరించబడిననూ ఎట్టి భేదమూలేదు. అట్లు వివరించిన జ్ఞానమే వేదము. వేదశబ్దార్థము జ్ఞానమే.
బట్టీకోణములో: వేదాధ్యయనము అనగా వేదమును అర్థరహితముగా బట్టీపట్టుటయే.
iii) ఋషికోణములో: పవిత్ర - అపవిత్ర కులములు ఆయాజీవుల యొక్క గుణకర్మలను అనుసరించియే. కులము అనగా గుణకర్మ రూపమైన ఒకానొక వృత్తి కర్తవ్యమే. దీనికి జన్మతో పనిలేదు.
బట్టీకోణములో: కులము జన్మచేతనే తప్ప గుణకర్మల వలనకాదు. కొన్నిమాత్రమే పవిత్ర కులములు, మిగిలినవి అపవిత్ర కులములు.
iv) ఋషికోణములో: గౌరవమునకు కారణము గుణకర్మలేకాని కులలింగములు కావు. స్త్రీలకు ఉపనయనము, గాయత్రి, వేదాధ్యయనము, ఆస్తిలో సమానభాగము ధర్మసమ్మతములు. పుత్రులకు ఆస్తిని సమముగా ఇచ్చుట వేదములో చెప్పబడినది (పుత్రేభ్యో దాయమదాత్). కానీ ఏకశేష సూత్రప్రకారము పుత్రశబ్దమునకు అర్థము పుత్రుడు మరియు పుత్రిక. అన్ని సంస్కారములు వీరికి సమానముగా కలవు. సహగమనము అనగా భర్త లేక భార్య మరణించిన వార్తనువిని రెండవవారి ప్రాణముపోవుట. ఇది చాల అసాధ్యము. దీనిని కేవలము స్త్రీలకే పరిమితముచేయుట అధర్మము. అగ్నిలో దూకి ప్రాణమును విడచుటయు, ఆత్మహత్యా పాపమువలన నిషిద్ధము. ఇక అగ్నిలోనికి త్రోయుట పరమదారుణము. భార్య మరణించిన తరువాత భర్తకును మరియు భర్త మరణించిన తరువాత భార్యకును సంసారములో ఆసక్తి నశించకున్నచో, రహస్యముగా పదిమందితో వ్యభిచరించుట కన్న పునర్వివివాహము శ్రేష్టము. దీనిని స్త్రీలకు కూడ సమానముగనే శాస్త్రము విధించినది (పతిరన్యోవిధీయతే). సంసారమునందు ఆసక్తిలేనిచో విధురుడగు భర్తకు కాషాయవస్త్రముతో సంన్యాసస్వీకారము మరియు విధవయగు భార్యకు తెల్లని వస్త్రముతో సంన్యాస స్వీకారము విధింపబడినవి. సంన్యాసము ఆధ్యాత్మిక మార్గములో జీవించుట. శిరోముండనము ఇరువురికిని కలదు. అయితే మనస్సు ప్రధానముగానీ మిగిలినవి అప్రధానము.
బట్టీకోణములో: కులలింగములే గౌరవ కారణములు. ఋతు దోషముకల స్త్రీలు అపవిత్రులు. కావున పురుషులే అధికులు. ఈ కారణమువలన స్త్రీలకు ఉపనయన, గాయత్రీ, వేదాధ్యయనములందు అధికారము లేదు. పురుషులగు పుత్రులకే ఆస్తి. సహగమనము స్త్రీలకే కావున బలవంతముగనైనను వారిని అగ్నిప్రవేశము చేయించవలెను. పునర్వివాహము పురుషులకేతప్ప స్త్రీలకు లేదు. సంన్యాసము పురుషులకు విధికాదు. స్త్రీలకు మాత్రము శిరోముండనము, తెల్లని వస్త్రములను ధరించుట అను సంన్యాసము విధి.
v) ఋషికోణములో: శ్రాద్ధకర్మలు అనగా మృతులైన జీవుల పేరుమీద యోగ్యులగు వారికి అన్న, వస్త్ర, దక్షిణాదానములను చేయుట. ఇచ్చట దానములు మరియు దానము స్వీకరించు వారి యోగ్యతయు ప్రధానముగానీ వేదపురాణ పఠనములు కావు. వేదపురాణ పఠనమే ప్రధానమని వాదించినచో ప్రపంచములో అనేక భాషలు కల ఇతర దేశములలోను అట్టి దానములున్నవి కాని ఈ మన్త్రములు లేవుకదా! అవి చెల్లనిచో, ప్రపంచమంతయును సంస్కృత - వేద - పురాణ పద్ధతినే సృష్టిప్రారంభములోనే భగవంతుడు విధించి యుండవలెను. అట్లు విధించలేదు కావున కేవలము భారతదేశమునకే అకారణ పక్షపాతము చూపినందున ఆయన విశ్వపిత కాలేడు. అప్పుడు అనేక విశ్వపితలగు భగవంతులను అంగీకరించ వలెను.
బట్టీకోణములో: కేవలము భారతదేశములో శ్రాద్ధకర్మలు మాత్రమే చెల్లును. దానములు కేవలము బట్టీబ్రాహ్మణులకే ఈయవలయును. వీరు శ్రాద్ధములో “ఎవరునూ, ఎప్పుడునూ అన్నమును పారవేయరాదు (అన్నం న పరిచక్షీత)” అను అర్థముగల మన్త్రమును పఠించియూ అర్థజ్ఞానము లేనందున, అన్నమును పారవేయుచున్నారు. వారి ఈ పాపకర్మకు విపరీతార్థమును అనగా పారవేసినగాని తృప్తిచెందినట్లుకాదని పలుకుచున్నారు. వడ్డించిన తరువాత, తినకముందు ఇష్టములేని పదార్థములను దొన్నెలో విడువవలయును (యన్నరోచతే తత్ త్యాజ్యం) అను వాక్యమును అర్థము చేసుకొనక దొన్నెలో అన్నమును పారవేయుచున్నారు. శ్రాద్ధానంతరము దొన్నెలో ముందుగనే తీసి ఉంచినదానిని ఏమిచేయవలయునని ప్రశ్న రాగా, బంధువులతో కలిసి భుజించమని పలుకుట (ఇష్టైస్సహభుజ్యతామ్) కూడా అర్థము తెలియక వంటి ఇంటిలో మిగిలిన వంటను గురించి 'అందరును తినుడు' అని అర్థమును చెప్పుచున్నారు! కావున సంస్కృత భాషను నేర్చుకొనుట హిందువులందరును చేయవలెను. పురోహితులు హిందూమత గ్రంథములను మాతృభాషలలోకి అనువదించి పఠించవలెను లేదా సంస్కృతమును నేర్చుకొని పఠనముతో పాటు అర్థమును జనులకు వివరించవలెను. కులలింగ వ్యవస్థ, ఉపనయనము, గాయత్రి ప్రధాన విషయములు కావున ముందుముందు విస్తారముగా చర్చించెదము.
To be continued...
★ ★ ★ ★ ★