
Posted on 29 Dec 2025. Share
6. కులము అనగా ఒకానొక గుణకర్మయే:
కులములు గుణకర్మలననుసరించియే ఏర్పడినవి అనుగీతా ప్రమాణము ప్రకారముగా కులము అనగా ప్రాచీన కాలములో ఒకానొక నిర్దిష్టమైన గుణకర్మయే. గుణమనగా కర్మలోని తీవ్రమైన శ్రద్ధయే. కర్మయనగా సమర్థవంతముగా చేయబడిన కర్తవ్యమే. కులము జన్మచేత కానేకాదు. గీతావచనము ప్రకారముగా సర్వజీవులను సృష్టించిన భగవంతుడే అందరికి తండ్రి వేదములో కూడ భగవంతుని అవయవములుగ వివిధ జీవులు లోకములో నిలచినారు అని చెప్పబడినది. ఒకే తండ్రి సంతానమైన జీవులకు వివిధ కులములు ఎట్లువచ్చును? తండ్రికి కూడా వివిధ కులములున్నచో సంతానమునకును అట్లే రావచ్చును. కానీ, ఆ తండ్రికి ఒక్కకులముకూడా లేదు. ఏలననగా ఆయన జన్మరహితుడు. కులములేని తండ్రియొక్క సంతానము కూడా కులరహితమే కావలయును. ఈ జీవులలో వివిధ కులములున్నవి అనునవుడు కుల శబ్దమును ప్రస్తుతము ఉవయోగించు జన్మచేత అను అర్థములో తీనుకొనరాదు. ఏలననగా ఒకే తండ్రి యొక్క సంతానములో జన్మచేత వచ్చు కులము ఒకటియేకదా! కులముయొక్క అర్థమును జీవులయొక్క ఒకానొక ప్రత్యేకమైన గుణకర్మగా తీసుకొనవలెను. సంతానములోగల వివిధ గుణకర్మల భేదములే కులములుగా తీసుకొనవలెను.
వివిధ గుణకర్మలైన కులములు వివిధములైన దేవుని దివ్యశరీర అవయవములుగా కనపడినవి. దీని అర్థము అవయవముల నుండి కులములు పుట్టినవి అని కాదు. అట్లు అవయవముల నుండి పుట్టుట ఎచ్చటను కనిపించుటలేదు. బ్రాహ్మణులు ముఖముగాను (బ్రాహ్మణోఽ స్య ముఖమాసీత్), క్షత్రియులు బాహువులుగాను (బాహురాజన్యః కృతః), వైశ్యులు తొడలుగాను (ఊరూ తదస్య యద్వైశ్యః) మరియు శూద్రులు పాదములుగాను (పద్భ్యాం శూద్రోఽ జాయత) కనిపించి, సంఘము దేవుని ప్రతిఫలించిన దివ్యశరీరముగా భావించబడినది. ముఖము జ్ఞాన ప్రచారమును, బాహువులు యుద్ధము ద్వారా రక్షణమును, పాదములకు ఆధారమైన తొడలు పాదములు (శూద్రులు) చేయు సేవలకు ఆధారమైన ధనమును మరియు పాదములు ప్రజాహిత సేవలను సూచించును. వారివారి శ్రద్ధలను అనుసరించి గ్రహించిన కర్తవ్యములు అను కులముల ప్రకారముగా ఏర్పడిన మానవలోకము, ఆయా కులముల ద్వారా ప్రతిఫలించిన అవయవములు గల విశ్వరూపుడైన తండ్రి ప్రతిబింబమును సూచించుచున్నది. పుత్రులలో తండ్రి ప్రతిఫలించుట వేదోక్తము (ఆత్మావై పుత్రనామాసి). పై వేదవాక్యములలో వివిధ కులముల జీవులు తండ్రియొక్క అవయవములుగా కనపడుటయే సారాంశము. అయితే జీవులకు ఆయా కులములు ఏర్పడుట వారివారి గుణకర్మల అనుసారముగా అని గీతా వివరణము. వేదములో మొదటి మూడు కులములు అవయవములుగా నిలచుట, నాల్గవ కులము వారు మాత్రము అవయవము నుండి పుట్టుట చెప్పబడినది. ఇచ్చట అధికసంఖ్యా వాక్యములనే ప్రమాణముగా తీసుకొనవలెను. కావున నాల్గవ కులము కూడా అవయవముగనే నిలచినది అనియే తాత్పర్యము. అవయవముగా నిలచుట, అవయవము నుండి పుట్టుటవలె కనపడుటను ఆలంకారికముగా గ్రహించవలెను. ఎక్కువగా మాటలాడు ఒక తండ్రియొక్క కుమారుడు కూడ ఎక్కువగనే మాటలాడునప్పుడు “వీడు అచ్చముగా వీని తండ్రి ముఖమునుండియే ఊడిపడినాడు” అని పలుకుట వినుచున్నాము కదా! అదే విధముగా తండ్రివలె త్వరగా నడచువానిని వాని తండ్రియొక్క పాదములనుండి ఊడిపడినాడు అని చెప్పవచ్చును కదా! అవయవ శక్తి ఒక సంతానములో కనపడినపుడు అవయవముగా నిలచుట లేక అవయవము నుండి ఊడిపడుట ఆలంకారికముగా సమ్మతములే. ఈ అర్థమును గీతాప్రమాణముతో సమర్థించవచ్చును.

సృష్టించబడిన జీవులు ఎన్నికచేసుకొనిన గుణకర్మల విభాగమే కులవ్యవస్థ అనియే గీతా శ్లోక తాత్పర్యము. మొదట జీవులు సృష్టింపబడిరనియు, తరువాత వారివారి శ్రద్ధలను అనుసరించి కులములని పేరుగల గుణకర్తవ్య కర్మలను వారే ఏర్పరుచుకొన్నారు అనియే ఇచ్చట అర్థము. “ఒకానొక జీవుడు ఒకానొక గుణకర్మను కలిగి ఆ కులీనుడుగా మొదటనే జన్మచేతనే సృష్టించబడినాడు” అని నీవు వాదించరాదు. గీతలో అట్లు చెప్పబడలేదు. ఒకానొక కులీనుడుగా జీవుడు సృష్టించబడినాడు అని ఇచ్చట చెప్పబడలేదు. సృష్టించబడిన జీవులయొక్క గుణకర్మలను అనుసరించి ఆయా కులముల పేర్లు భగవంతునిచే సృష్టించబడినవి అనియే అర్థము. ఆయన తాను సృష్టించిన గుణకర్మలను విభజించి వాటికి కులనామములను పెట్టినాడు అనియే అర్థము. గుణములు, వాటి కర్మలు మరియు జీవులు దేవునిచే సృష్టించబడినారు ఏలననగా సర్వ పదార్థముల సృష్టిని దేవుడే చేసినాడు. కానీ ఏజీవుడు, ఏ గుణమును గ్రహించవలెనో దానికి సంబంధించిన కర్మను చేయవలయునా? లేదా? అను దానిని మాత్రము జీవుల స్వేచ్ఛకే వదిలివేయబడినది. దానిని కూడా భగవంతుడే చేసినచో సర్వజీవుల కర్మఫలములు భగవంతునికే చెందును. ఒకానొక గుణకర్మకు ఒకానొక నామమును ఏర్పాటు చేయుటయే భగవంతుడు చేసిన పని అని గీతాశ్లోక సారాంశము. “ఈ స్వేచ్ఛ నేడునూ కనపడదేమి? బ్రాహ్మణ కులములో జన్మించినవాడే పురోహిత వృత్తిని చేయుట ఎట్లు ఏర్పడినది?” అని నీవు వాదించరాదు. ఈనాడు కూడా ఎవరినీ ఒకానొక వృత్తిని స్వీకరించరాదని ప్రభుత్వశాసనము లేదుకదా! కావున నీ వాదమూలము అసత్యము. ప్రాచీన కాలములో పురోహితవృత్తిని స్వీకరించిన మరియు యజ్ఞములో బ్రహ్మస్థానమునకు ఋషులచే ఎన్నుకొనబడిన కుమ్మరియగు భూరిశ్రవుని దృష్టాంతము నీ వాదమును ఆకాలములోగూడ నివారించుచున్నది. భూరిశ్రవుని నిరోధించుట కాదుగదా, చివరికి ప్రోత్సహించుటయే జరిగినది. “ఏదో ఒక్క ఉదాహరణము సమగ్రము కాదుగదా” అని వాదించకుము. ప్రోత్సహించుట, నిషేధించక పోవుటను స్పష్టముగా నిరూపించుచున్నది. ఎక్కువమంది ఈ జ్ఞానప్రచార వైదికవృత్తికి రాకపోవుట, ఆనాడు ఈ వృత్తిలో ఏమాత్రము ధనాదాయము లేకపోవుటయే కారణముగా చూడవలయును. ఈ వృత్తిలో ధనగర్వము నిషిద్ధము కావున దీనిలో బ్రతుకుట కేవలము భిక్షాటనము లేదా ఉంఛవృత్తి (పొలములో రాలిన గింజలను ఏరుకొనుట). అట్టి పరమదరిద్ర పరిస్థితిలో కూడా తన పూర్వజన్మ సంస్కారము వలన వచ్చిన శ్రద్ధచేత భూరిశ్రవునికి ఈ వృత్తిలో ఆకర్షణమేర్పడినది. ఇది ఏ ఒక్కరికో కలుగును కావున ఎక్కువమంది దృష్టాంతముగా కనపడకపోవుట సహజమేగదా! ఎక్కువమంది ధనము మరియు భోగములలో ఆసక్తులు కావున ఈ వృత్తివైపుకు రాలేదు. నీవు తిట్టదలుచుకున్నచో అట్లు రానివారిని తిట్టుము. మమ్మేల దూషించెదవు?
To be continued...
★ ★ ★ ★ ★