home
Shri Datta Swami

 Posted on 30 Dec 2025. Share

హిందూమత వివరణము (Part-7)

7. బ్రాహ్మణ వృత్తికి అత్యధిక గౌరవము:

లోకములో ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారముచేయు వృత్తిని స్వీకరించిన ఈ బ్రాహ్మణులకు అత్యధిక గౌరవము దక్కినది. ఇది వారి వృత్తికిగల ప్రాధాన్యతను గౌరవించుటయే. జనులలో ఆధ్యాత్మికజ్ఞానము బాగుగ నాటుకున్నచో దైవభక్తితో పాటు దైవభీతియు ఏర్పడును. మరణానంతరము పై లోకములలో పాపకర్మలను శిక్షించు దైవము పట్ల భీతియు సహజమే. దీనివలన పాపభీతి ఏర్పడి పాపములను చేయుటలో ఎక్కువ భయమువలన పాపనిరోధక శక్తి ఎక్కవగును. అట్టి పరిస్థితిలో పాపములను నిగ్రహించుట చాల తేలికయగును. ఈనాడు సంఘములో ఆధ్యాత్మిక జ్ఞానము లేకపోవుట వలన, పాపనిరోధకశక్తి క్షీణించినందున, పాపములను నిగ్రహించు యంత్రాంగములగు రక్షకదళ విభాగము, న్యాయస్థానము మొదలగునవి నిర్వీర్యములగుచున్నవి. ఇచ్చట శిక్ష పడకుండా తప్పించుకొనగలిగినచో అది చాలును. పై లోకములుగానీ, దైవముగానీ లేవుకావున మరణించిన తరువాత అవి తప్పవు అని భయపడ పనిలేదు. పాపములను నియంత్రించు యంత్రాంగములో పనిచేయు వ్యక్తులుకూడా ఈ భావములతోనే ఉందురు కావున లంచములద్వారా వారిని నియంత్రించి శిక్షలను తప్పించుకొనుట సులభతరమగుచున్నది. సృష్టి ఆరంభములో మానవుడు ఒకానొక గుణముపట్ల దాని సంబంధిత కర్మ చేయుటకును ఆసక్తిని ప్రదర్శించుట వాని స్వేచ్ఛా, చిత్తవృత్తిపై మాత్రమే ఆధారపడియుండును. ఆ తరువాత వారిపిల్లలు తల్లిదండ్రుల శ్రద్ధాక్రియలలో సహజముగ ఆసక్తులై వారు చిన్నతనము నుండియు అందించిన తీవ్ర శిక్షణతో నిష్ణాతులగుటయు సహజమే. ఇట్టి తీవ్రశిక్షణకు ఆధారము తల్లిదండ్రులకు తమ బిడ్డలపై గల తీవ్ర మమకారమే.

ఉదాహరణకు: బ్రాహ్మణ కులములో జన్మించిన ప్రతి వానికిని బ్రాహ్మణవృత్తి పై శ్రద్ధాభక్తులు ఏర్పడుట, తల్లిదండ్రుల శిక్షణతో వృత్తి నైపుణ్యమును సాధించుట వలన ఆ కులములో జన్మించిన ప్రతివానిని సత్యమైన బ్రాహ్మణునిగా పిలువక తప్పదు. ఇట్టి వారి మూలముగా ఆ కులమంతయునూ సత్యమైన బ్రాహ్మణకులముగా పిలువబడుచున్నది. ఇచ్చట ఆ కులములో జన్మచేతకాక గుణకర్మలచేతనే బ్రాహ్మణ శబ్దము ఉపయోగింపబడుచున్నది.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via