
Posted on 31 Dec 2025. Share
8. శబ్దార్థము - సందర్భము:
యోగము, యౌగికము మరియు యోగరూఢము: శబ్దార్థమును విచారించుట యోగము అనబడును. అట్లు విచారించబడిన అర్థము దానిచే పిలువబడు వస్తువులో కనిపించినచో అట్టి వస్తువు యౌగికము అనబడును. యౌగిక వస్తువు ఒకటియే ఉండవచ్చును లేదా ఎక్కువగా ఉండవచ్చును. ఉదా.: పంకజము అనగా బురదనుండి పుట్టినది అను అర్థమును తెలియుట యోగము.
i) బురదనుండి పుట్టిన యౌగికమైన వస్తువు ఒకటియే ఉండవచ్చును. జ్ఞానప్రచారము చేయు ఏ మానవుడైననూ బ్రాహ్మణుడే. వారిలో కులలింగాది బేధములులేవు కావున అట్టి సత్యబ్రాహ్మణులైన మానవులందరునూ ఒకే వస్తువు కావున ఈ వస్తువు యౌగికము. అట్టి ఈ వస్తువులో బ్రాహ్మణశబ్దార్థము సమన్వయించుటయేకాక, ఈ వస్తువు అర్థము సమన్వయించిన బ్రాహ్మణ శబ్దముచేతనే పిలువబడుచున్నందున ఇది యోగరూఢము కూడా అయినది. ఇచ్చట యౌగికము, మరియు యోగరూఢము ఒకే వస్తువు. అనగా ముందు యౌగికమై తరువాత యౌగికముగనే ఉండవచ్చును లేదా యోగరూఢము కావచ్చును. యౌగికము కాకుండా యోగరూఢము కాదు.
ii) యౌగికములైన వస్తువులు అనేకము లుండవచ్చును. బురదనుండి పద్మము, శంఖము, నాచు, అను భిన్నవస్తువులు పుట్టినవి. ఈ వస్తువులన్నియు యౌగికములే, సందర్భముననుసరించి ఏ యౌగిక వస్తువునైననూ శబ్దార్థముగా తీసుకొనవచ్చును. అయితే పంకజము అనగా పద్మము అను అర్థమే ముందుకు వచ్చును. కావున పద్మమే యోగరూఢము. సందర్భమునుబట్టి శబ్దముయొక్క అర్థము యౌగికమా లేక యోగరూఢమా? అని నిర్ణయించవలెను. ఉదా: గాయత్రీమన్త్రములో సవిత శబ్దము సూర్యుడా? పరమాత్మయా? అన్నపుడు సవిత శబ్దార్థము ప్రాణులను సచేతనులుగా చేయుట లేక సృష్టించుట అను అర్థము (యోగము) వలన సూర్యుడు మరియు పరమాత్మయు యౌగికములుగా సిద్ధించుచున్నారు. ఈ ఇరువురిలో సవిత శబ్దము సూర్యునిలోనే నిర్ణయించబడినది కావున సూర్యుడు యోగరూఢము. పరమాత్మ కేవలము యౌగికము మాత్రమే. అయిననూ సందర్భముననుసరించి దానిలోని “తత్” శబ్దము ఆ సవిత - ఈ సవిత కాదు అని వచ్చుటచేత సవిత శబ్దార్థములో యౌగికమైన పరమాత్మనే తీసుకొనవలెను తప్ప యోగరూఢమైన సూర్యుని కాదు.
యోగరూఢము: శబ్దార్థమును విచారించి ఆ అర్థము సమన్వయము జరుగు ఒకానొక పదార్థమునే ఆ శబ్దముతో పిలచుట.
i) సత్యహరిశ్చంద్ర: ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకునపుడు గమనించి అతనిని సత్యహరిశ్చంద్రుడని పిలచుట.
ii) ఉపనయనము: దీని అర్థము స్తుతిసేవల ద్వారా భగవంతునికి దగ్గర అగుట. మాతృభాషలో స్తుతి గానమును చేసి వంటను వడ్డించి సేవించి సద్గురుదేవుని నుండి బ్రహ్మజ్ఞానమును గ్రహించు క్రియ.
iii) గాయత్రి: మాతృభాషలో భక్తితో సద్గురుదేవుని స్తుతిని పాడుట.
iv) సవిత: సృష్టికర్తయైన పరమాత్మ జ్ఞానబోధ చేయుటకు అవతరించిన సద్గురువు జీవులను సృష్టించుట అను అర్థము (యోగము) కలిగినందున ఒక యౌగికము, జీవులను నిద్రనుండి సచేతనులుగా చేయుట అను అర్థము (యోగము) కలిగినందున సూర్యుడు మరియొక యౌగికము. ఈ రెండు యౌగికములలో సూర్యుడే యోగరూఢము.
v) అగ్ని: మొట్టమొదట (అగ్రి) అర్చించవలసిన, జ్ఞానాగ్నితో ప్రకాశించు సద్గురుదేవుడు (సద్గురువు యొక్క కుక్షిలో ఆకలిమంటగా మండు వైశ్వానరుడనబడు దేవతాగ్నిని సందర్భానుసారముగా తీసుకొనవలెను).
vi) యజ్ఞ: అనగా పూజించుట. ద్రవ్యయజ్ఞములో సద్గురువుకు దక్షిణనిచ్చుట. తపోయజ్ఞములో (భక్తియోగ) ఆవేశముతో గురుస్తుతిగానము చేయుట. యోగ (కర్మయోగ) యజ్ఞములో వంటచేసి గురువుకు అర్చించుట మొదలగు సేవలు. స్వాధ్యాయజ్ఞాన (జ్ఞానయోగ) యజ్ఞములో సద్గురువునుండి వేదార్థపరమైన బ్రహ్మజ్ఞానమును పొందుట. ఇవి గీతలో చెప్పబడిన యజ్ఞములు. పంచయజ్ఞములు కూడా సద్గురువును (బ్రహ్మ), భక్తులను (దేవ), తల్లిదండ్రులను (పితృ), ఆకలిగొన్న వారిని (మనుష్య) మరియు సాధు పశుపక్ష్యాదులను (భూత) తృప్తిపరచుట.
vii) హోమ: ఆకలిగొన్న వారి జఠరాగ్నియగు వైశ్వానర దేవతాగ్నికి ఘృతముతో కలిపి వండిన వంటను అర్పించుట.
viii) బ్రాహ్మణ: ఏ కులములో పుట్టినవాడైనను సర్వజనులను బ్రహ్మజ్ఞానబోధ ద్వారా దైవము వద్దకు చేర్చువాడు.
ix) శూద్ర: ఏ కులములో పుట్టిన వాడైనను ఐహిక జీవనభృతి చింతను కలిగి సంఘసేవలను చేయువాడు.
x) మ్లేచ్ఛ: ఏ కులమువాడైనను నాస్తికుడై మతగ్రంథములను నిందించువాడు.
రూఢము: రూఢమనగా శబ్దము యొక్క అర్థమును ఏ మాత్రము విచారింపక కేవలము పిలుపుకోసము అర్థము తెలియని ఒక శబ్దమును పేరుగా పెట్టుకొనుట.
ఉదా : i) సత్యహరిశ్చంద్ర : ఒక బాలునకు పుట్టినప్పుడు సత్యహరిశ్చంద్రుడని పేరు పెట్టినారు. వాడు పెరిగిన తరవాత నిత్యము అసత్యములనే చెప్పెడివాడు. వానిని చివరివరకు సత్యహరిశ్చంద్రుడనియే జనులు పిలచిరి.
ii) ఉపనయనము: ఇది బాలురకు చేయబడుచున్న ఒక సంస్కార కర్మ. ఇందులో బోధించబడిన జ్ఞానము ఎవరికినీ తెలియదు. ఇది కేవలము వారి కులమునకే పరిమితమైన ఒక దైవ ఉపాసనా విధానము అని ప్రచారము చేసి, గాయత్రీచంధస్సులో నున్న ఒక మన్త్రమును గాయత్రిగా భావించి, ఏ గానము చేయక, మాటిమాటికీ జపింతురు. కావున ఉపనయన శబ్దము అర్థరహితమైన ఈ మొత్తము కర్మను పిలచుటకు పేరుమాత్రమే.
iii) గాయత్రి: దీని అర్థము తెలియనందున గానము లేదు. గాయత్రీ ఛందస్సులో ఉన్న ఒక మన్త్రమే గాయత్రి. దీనిని ఒక స్త్రీరూప దేవతగా భావించి ఈ పేరుతో పిలచుట.
iv) అగ్ని: అర్థవిచారము చేయక కట్టెలతో మండు లౌకికాగ్నిని ఈ పేరుతో పిలచుట.
v) యజ్ఞము: లౌకికాగ్నిలో నేతిని పోసి దగ్ధము చేసి దానిని దేవతలకిచ్చిన ఆహారముగా భావించుట.
vi) హోమము: లౌకికాగ్నిలో నేతిని పోసి దేవతలకు సమర్పించుట అని తలచుట.
vii) బ్రాహ్మణ: శబ్దార్థముతో పనిలేక కేవలము ఋషులవంశములో పుట్టినవారిని పిలచుట.
viii) శూద్ర: శబ్దార్థముతో పనిలేక కేవలము సంఘసేవా విధిని నిర్వహించు ఒక కులమును పిలచుట.
ix) మ్లేచ్ఛ: శబ్దార్థముతో పనిలేక ఆస్తికులైన కేవలము ముస్లీం జాతివారిని పిలచుట.
To be continued...
★ ★ ★ ★ ★