
19 Nov 2025
[07-04-2005] ఈనాడు సాయంత్రం 4.30 గంటలకు నేను నా శ్రీమతి, మా మనుమరాలు రాధ సత్యనారాయణపురం వెళ్ళి భీమశంకరం గారి ఇంట్లో మా గురుదేవులు శ్రీదత్తస్వామి వారిని దర్శించుకొన్నాము. ఈ సంధర్భములో స్వామి అనుగ్రహించిన దత్తవాణి ఇలా ఉన్నది.
నాయనలార! పరబ్రహ్మము మనుష్య శరీరమును ఆవహించి నరావతారములో జీవకోటిని ఉద్ధరించుటకు అవతరిస్తారు. పూర్వము గ్రీక్ దేశంలో పరమాత్మ మానవ శరీరం లోనే అవతరించి తోటిమానవులతో కలసి నివసించుటకును తనవారిని రక్షించుటకును అవతరించును అని దానినే "ఇమాన్యుయల్" వచ్చుచున్నాడు అని గ్రీక్ భాషలో తెలుపుతున్నారు. ఇస్లామ్ మతములో కూడా పరమాత్మ మానవరూపం లోనే వస్తాడని చెప్పియున్నారు. అట్టి పరమాత్మను గుర్తించుటకు మూడువందల గుర్తులు చెప్పియున్నారు.
మన మతములో "ఇహ చేత్" అనగా సర్వము ఇక్కడే ఈ లోకములోనే ఉన్నదనియు అయిన ఈ ఖగోళమేతప్ప ఏమియులేదనియు భగవంతుడు ఇక్కడే ఉన్నాడనియును, ఆయనని పొందుటయే మోక్షమనియు, అన్ని లోకాలు ఇక్కడే ఉన్నాయనియును, మనుష్య శరీరమును ఆశ్రయించిన పరమాత్మ ఎక్కడ ఉన్నాడో అదే సత్యలోకమనియు, ఈ లోకములో కుటుంబ బంధములందు విముక్తియే మోక్షమనియు తెలుపబడినది. త్రేతాయుగమున హనుమంతుడు ద్వాపర యుగమున గోపికలు పరమాత్మను నరావతారమున గుర్తించి సేవించి తరించినారు గదా! హనుమంతుడు చిరంజీవి. భవిష్యత్ బ్రహ్మ గదా! ఐతే ఈ చిరంజీవత్వము, బ్రహ్మ స్వరూపమునకు అంతరార్ధమేమి? పరిపూర్ణ జ్ఞానస్వరూపముతో యున్న జ్ఞానబోధకుడే బ్రహ్మస్వరూపము చిరంజీవాత్మకమునకు అంతరార్ధము అని గ్రహించవలయును. పరబ్రహ్మమును సేవించినవారికి సాలోక్య, సారూప్య, సాయుజ్యములు ప్రసాదించబడతాయి. సాలోక్యం అంటే ఆ నరాకారుడు ఉన్న ఊరు. శ్రీరాముడు ఉన్న ఊరు అయోధ్య. ద్వాపరయుగములో శ్రీ కృష్ణుడు ఉన్న ఊరు ద్వారక. ఇప్పటి నరావతారుడైన దత్తస్వామి ప్రస్తుతం ఉన్నది సత్యనారాయణపురం. కనుక ఆ నరావతారుడున్న చోటికు పోవటమే సాలోక్యము అని గ్రహించవలయును.

ఇక సారూప్యం అంటే ఏమిటి?
భగవంతుని లక్షణమే - సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆయన రూపం జ్ఞానం, కనుక జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని జీర్ణించుకున్నప్పుడు వచ్చే స్థితియే సారూప్యం. ఆ సారూప్యమే - సాధర్మం. తేడాలేదు.
ఇక సాయుజ్యం అంటే ఏమిటి? స్వామిని గుర్తించిన తరువాత ఆయనను వదలక వెంటబడి ఆయనను సేవించటమే సాయుజ్యం అని తెలుసుకోవాలి.
నాయనలారా! శ్రద్ధగా వినండి. చెప్పిన మాటే మరల మరల చెప్పుచున్నాను. ఇది సత్యం. ఈ సంతానం ఆత్మను ఉద్ధరించలేరు. ఉద్ధరించేవాడు శ్రీ నారాయణుడే. సాక్షాత్తు నారాయణుడు నర రూపంలో వచ్చినప్పుడు ఆయనను గుర్తించాలి. ఆయనను చేరాలి. జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని జీర్ణించుకోవాలి. అప్పుడే జీవన్ముక్తి లభిస్తుంది. ఆ జ్ఞానం ఆచరణలోకి రావాలి. అదే సాయుజ్యం. ఆదిశేషుడు నిరంతరం స్వామితో చేరియుండటము అదే.
ఇక కైవల్యం అంటే ఏమిటి? ఇది భౌతిక కైవల్యం అని అర్ధం కాదు. స్వామి మాటే నా మాట అని గ్రహించి ఆచరించాలి. అదే కైవల్యం. జీవన్ముక్తి. బ్రతికి ఉండగనే మోక్షం సాధించటం అన్న మాట.
పరబ్రహ్మ ఇక్కడే ఉన్నాడు. పరోక్షం కాదు. అపరోక్షమే. ఇక్కడే, ఈ లోకంలోనే ఉన్నాడు పరమాత్మ. నరాకారంలో అవతార పురుషునిగా ఉన్నాడు అని గ్రహించాలి. హంస నీటిని పాలను విడదీసినట్లుగా, మానవులలో ఆ నరావతారుని గుర్తించి విడదీయటమే పరమహంసలు చేస్తున్నారు అని గ్రహించాలి. గోపాలురలలో గోవిందుని విడదీసి గుర్తించారు, సేవించారు గోపికలు. ఆ నరాకారునికై తపించారు. అదే తపస్సు. శ్రీకృష్ణుడే పరమాత్మ అని గుర్తించి ఆ దైవమును పొంది తరించారు. శ్రీ కృష్ణుడు శరీరమును వదలి నప్పుడు గోపికలు తమ శరీరములను అగ్నికు ఆహుతి చేశారు.
★ ★ ★ ★ ★