home
Shri Datta Swami

 02 Dec 2025

 

నాటకము

[03.05.2003] [ఈరోజు నా శ్రీమతి జన్మదినము. నేను (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి), నా శ్రీమతి కలసి అజయ్‌ గారి ఇంట్లో ఉన్న శ్రీదత్తస్వామిని దర్శించి సేవించుకున్నాము.] మేము స్వామిని దర్శించుకున్నపుడు స్వామి “పుట్టుటయు నిజము పోవుటయు నిజము, మధ్యన ఉన్నది నాటకము, కానగ కన్నది కైవల్యము” అని పాడి ఇలా వివరించారు. పుట్టుట అంటే నాటకము ప్రారంభము అని అర్థము. పోవుట అంటే నాటకము పూర్తి కాగానే నటులు ఇళ్ళకు వెళ్ళుట అని అర్థము. మధ్యన ఉన్నది నాటకము అంటే నాటకము మధ్యలో కూడ నాటకమే అని అర్థము. ఉదాహరణకు రామారావు, అంజలి ఒక నాటకము వేసారు. అందులో వారు భార్యభర్తలుగా నటించారు నిజమే, కాని విచారిస్తే వాళ్ళు నాటకానికి ముందు భార్యాభర్తలు కాదు. నాటకము పూర్తి అయిన తర్వాత కూడా భార్యభర్తలు కాదు గదా! ఇక నాటకము వేస్తున్నంత సేపు కూడా వాళ్ళు భార్యభర్తలుగా నటించారే తప్ప నిజంగా భార్యభర్తలా? ఆ కాసేపు కూడా వారు భార్యాభర్తలు కారు. ‘కానగ కన్నది కైవల్యము’ అంటే ‘కానగ’ = విచారిస్తే, ఈ కనిపించేది అంటే నరావతారమే కేవలము సత్యము అని అర్థము అన్నారు స్వామి.

జ్ఞానాన్ని కోరండి, సేవించండి, తరించండి.

[21.08.2006] స్వామి యొక్క సేవక భక్తుని నిర్యాణము గురించి స్వామి ఇలా వివరించారు. స్వామి యొక్క సేవకుడు దివ్యదేహముతో ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ జ్ఞానము పొందుతాడని, ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళి అక్కడ గానములో పాల్గొంటాడని, ఆ తరువాత శివలోకానికి వెళ్ళి అక్కడ ధ్యానములో నిమగ్నుడవుతాడని, అటు తర్వాత సత్యలోకానికి తీసుకోని పోబడతాడని అక్కడ నుంచి స్వామి సంకల్పమును అనుసరించి స్వామి సేవకుడిగా మరల మర్త్యలోకములో జన్మిస్తాడని సెలవిచ్చారు. కనుక స్వామీ! నన్ను రక్షించు అనవద్దన్నారు. స్వామి అన్నీ చూస్తునే ఉంటాడు కనుక ఏమియు చెప్పవద్దన్నారు. స్వామి కొండంత సాయం చేయతలచినపుడు అప్పుడు ఆ సహాయము ఏనుగు అంత పెద్దగా మారిపోతుంది. కాని, స్వామీ! ఇది నాకొచ్చిన కష్టం అని చెప్పాడు అనుకొనండి,  కోరిక విన్నవించాడు కాబట్టి స్వామి చేసే సాయం చీమంత చిన్నగా అయిపోతుంది. కనుక ఏకోరికనూ చెప్పరాదు అని స్వామి అన్నారు. జ్ఞానాన్ని కోరండి, సేవించండి, తరించండి అని స్వామి బోధించారు.

స్వామి రాబోయే అవతారములు

[11.09.2006, సోమవారం సా. 06:15 స్వామి దివ్యవాణి]

i) శ్రీదత్తస్వామిగా ఈ జన్మ మొదటి అవతారము, బ్రహ్మాంశ సంభూతులు

ii) మహారాష్ట్ర దేవగడ్‌లో రెండవ అవతారము. కృష్ణసరస్వతి నామధేయముతో విష్ణ్వంశ సంభూతులు. తల్లిదండ్రులుగా భవానీ-బాలకృష్ణులు అవగా, వారి భవిష్య నామధేయములు శ్రుతి-జ్ఞానేశ్వరులుగా ప్రసిద్ధమగును.

iii) ఇక కేరళలో శంకరసరస్వతి నామధేయముతో మూడవ అవతారము వచ్చును. తల్లిదండ్రులుగా లలిత- శేషాద్రులు వచ్చును. ఈ అవతారము శివ స్వరూపము.

iv) నాల్గవ అవతారము కాశీక్షేత్రములో దత్తాత్రేయులుగా, తల్లిదండ్రులుగా నాగలక్ష్మి-అజయ్‌లు వచ్చును. ఈ అవతారము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము.

[04.12.2006] హైదరాబాదు నుండి రాత్రి 8.30 గం||లకు శ్రుతకీర్తి స్వామికి ఫోను చేసిందట. స్వామీ ఒక మాట చెప్పండి చాలా సంతోషిస్తాను అన్నదట. స్వామి ఒక్క మాట చాలా, సంతోషిస్తావా అన్నారట. చాలు అన్నదిట. అయితే విను, నేను దత్తుణ్ణి అన్నారు స్వామి. తనలు అది విని చాలా సంతోషమైనది. ఒక రాత్రి వేళ, గదిలో విపరీతమైన కమల సుగంధము వచ్చిందట. రమేష్‌గారికి కూడా ఈ సుగంధము వచ్చిందట. శ్రుతకీర్తి స్వామికి ఫోను చేసి ఈ విషయం చెప్పిందట. నీవు స్వామిని ఆహ్వానించావు గదా! అందుకే స్వామి వచ్చారు అని స్వామి అన్నారట. మేము ఉదయం స్వామికి ఫోను చేసాము. స్వామి ఇలా అన్నారు – ‘శ్రుతకీర్తి అమాయక భక్తురాలు అందుకే స్వామి వెంటనే అనుగ్రహించారు’ అని.

దివ్య రహస్యము (స్వామి ఈ దేవరహస్యాన్ని 2002 డైరి అట్టపై వ్రాసి అందించారు)

“విరజానదిలో మునిగిన కతమున
భ్రమ ఇది పావన! పవన కుమారా!
అస్ఖలిత బ్రహ్మచారి వీవే
దారాపుత్రుల బంధములెచ్చట
దారా పుత్రులు కలరే నీకును!
లేలెమ్ము హనుమ! చాలా కాలమిలా
మునిగియున్నావు పైకి లెమ్మింక
లేచి కన్నులను తెరచి చూడు మిట
నీవూ నేనే ఇరువుర ముంటిమి
యయాతి రక్షణ కొరకై తల్లికి
ఇచ్చిన మాటకు నాతో తలపడి
తల్లిని మించిన స్వామిని విడచిన
దోష ఫలమిదియె మాయ పట్టె నిను
అందరి కన్నను ధర్మము కన్నను
నేనే ఎక్కువ యని భోధించితివి
అజ్ఞాన మాయ నీకు తొలగునిక
నా హనుమా! నన్నుఁ జేరుము లెమ్మిక ఇది హెచ్చరిక.

[19.09.2006] నాయనా, విశ్వాసాన్ని సడలించవద్దు. అప్పుడు నేను నీకు సర్వరక్షగా ఉందును. మార్జాలకిశోర న్యాయం గుర్తుంచుకోండి. ఏది ఏమైనా విశ్వాసం సడలించుకోరాదు.

సర్వ విశ్వన్యస్త పాద పద్మాయ తే
వామ హస్తాలోల వేద శాస్త్రాయ తే
జ్ఞాన సూర్యాయ తే దత్త రూపాయ తే
శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనమ్‌ || అని గుర్తుంచుకో అన్నారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch