
11 Dec 2025
[14.04.1992] శ్రీశైలములో శ్రీదత్తభగవానులు శ్రీదత్తస్వామి వారి ద్వారా ఈ క్రింది విధముగా వచించారు – “వాయవ్యకోణే సర్పదోష నివృత్తిః”. క్రిందటి రాత్రి వాయవ్యదిశలో సర్పం వచ్చినది. శ్రీదత్తభగవానులు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని రూపములో దర్శనమిచ్చి సర్పదోష నివారణ చేసినట్లు వివరించారు. నాకు, నా శ్రీమతికి అపమృత్యు దోషమును నివారించారు. అపుడు స్వామి చాలా ప్రసన్నులైనారు. వీరిద్దరు నా పుత్ర, పుత్రికలే కనుక వీరి ముందు జీవితం భగవదారాధనలో చక్కగా గడవటానికి వీరికి అపమృత్యు దోషనివారణ చేసి మరల పునర్జన్మ నిచ్చాను అని వచించారు. స్వామీ మేము ధన్యులము.
[హైదరాబాద్‌లో 11.03.1993 సా. 4.00]
శ్రీదత్తభక్తులు నాతో ఇలా వచించారు. “మీ ఇల్లాలికి తన అంత్యకాలములో నేను ప్రక్కన ఉన్నానట. స్వామీ! మీరు ముందు జన్మలో కూడ నాకు సాధనలో తోడ్పడండి అని అన్నదట. అప్పుడు నేను (అనగా దత్తభక్తులు) తప్పకుండా అన్నానట. ఎన్నిజన్మలు నాకున్నవో అన్ని జన్మలకు నీ కడుపుననే పుడతాను అని చెప్పానట.” అప్పుడు స్వామితో నేను ఇలా అన్నాను. స్వామీ! మీరు మా ఇద్దరి గురించి స్వామికి నివేదించండి. ఇప్పుడిప్పుడే మేము ఇరువురము సాధనలో పురోగమిస్తున్నాము గదా. నాభార్యకు కనీసం ఇంకో పది సంవత్సరములన్నా జీవితం పొడిగించి మేము ఇరువురము సాధనలో కృతకృత్యులమగుటకు అనుగ్రహించమని మా మనవిగా శ్రీగురునకు మాతరఫున నివేదించండి, అని కోరాను. దత్తభక్తులు బయలుదేరి వెళ్తూ సరే, అలాగే అన్నారు. మేము శ్రీగురునకు ఏకాంతములో మనస్స్ఫూర్తిగా నమస్కరించి మా మనస్సులోని ఆవేదనను విన్నవించుకున్నాము. సాయంత్రము 06.30 గం||లకు శ్రీదత్తభక్తులు వచ్చారు. వస్తూనే “మీ విన్నపము శ్రీస్వామి వారికి నివేదించాను. వారు ఏమన్నారో తెలుసా? “నేను రక్షిస్తాను. ఏమీ భయము లేదు. కాని లౌకికములో కాలము వ్యర్థము చేయకుండా కాయేన, వాచా, మనసా నన్నారాధించమని చెప్పు. నిత్యకృత్యములకు అవసరమైన పనులు చేసుకోవలసినదే. కానీ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. వృథాచేసే కాలాన్ని, శక్తిని నాకు వినియోగించమను. తప్పక సాక్షాత్కారం కలుగుతుంది వాళ్ళకి అని ఉత్సాహపరిచారు” అని దత్తభక్తులు చెప్పారు.
[27.03.1993]
“అత్రి మహర్షి నా తండ్రి. అనసూయ నా తల్లి. వారికి నా మీద ఎంతో ప్రేమాభిమానాలు. అట్టి తల్లి, తండ్రులను వదలుకొని వివాహం లేకుండా మీరందరిని ఉద్ధరించటానికే గదా నేను మీ చుట్టూ తిరుగుచున్నాను. మరి మీరో, సంసార సుఖాలన్నీ అనుభవించారు గదా, అయినా ఇప్పటికీ మీరు కోరికలతో సతమతమౌతూ నావంకకు పూర్తిగా తిరగటం లేదు. ఇది భావ్యమేనా?” అన్నారు స్వామి. ఇంకా ఇలా అన్నారు. “మీ కోరికలు నాకు చెప్పుకోవాలా? నాకు అన్నీ తెలుసు సర్వఙ్ఞుడనైన నాకు తెలియనిది ఏమున్నది? నేను చెవిటివాడనా? గ్రుడ్డివాడనా? నాకు వినిపించదు, కననిపించదు అని అనుకోవటానికి. ఇప్పటికైనా నీమనస్సులో కోరికలు తీసిపారవేసుకోండి. నా వైపుకు పూర్తిగా తిరగండి” అన్నారు స్వామి. స్వామీ! మీ ఆజ్ఞను శిరసావహిస్తాము.

[31.03.2003]
స్వామి అద్భుతమైన దేవరహస్యాన్ని వెల్లడించారు. నా రాబోవు అవతారము మహారాష్ట్రలో దేవగడ్‌లో జరుగనున్నది. శ్రుతి, జ్ఞానేశ్వరులు ఆ అవతారమునకు మాతా-పితరులు. ఈనాటి భవానీ, బాలకృష్ణులే ఆనాటి శ్రుతి, జ్ఞానేశ్వరులు. వీరు ద్వాపరయుగములో దేవకీ-వసుదేవులు. ఆనాడు ద్వాపరయుగములో దేవకితో స్వామి “నీ గర్భవాసమున జన్మిస్తాను” అని చెప్పినపుడు, ఆమె, స్వామీ! నాకు అంతటి అదృష్టమా అని అనవలసినది. కాని కంసుని చెల్లెలు గదా. ఆ రాజసము ఎక్కడికి పోతుంది. ఆమె ఇలా వచించినది – ‘మీ ఇష్టమైతే అలాగే కానీయండి.’ ఇందు రాజస (రజో) గుణము ఎంత ప్రస్ఫుటముగా గోచరించుచున్నది. మరియొక దేవరహస్యము. త్రేతాయుగములోని దశరథుడు, కౌసల్యలే, ఈనాడు శేషాద్రి, లలితలుగా జన్మించినారు. స్వామి మరుసటి అవతారము కేరళలో కాలడి యందు జరుగుతుంది. అప్పుడు శేషాద్రి, లలితలు స్వామి మాతాపితరులుగా వస్తారు. ఆ తర్వాత స్వామి కాశీలో దత్తాత్రేయుడు అను నామధేయంతో అజయ్, నాగలక్ష్మిలకు జన్మిస్తారు. వారే ద్వాపరయుగములో నందుడు, యశోద అని స్వామి సెలవిచ్చారు. ఇది దేవరహస్యము.
ఆనాడు 12.03.1993 ఈనాడు 01.03.2007 మధ్యలో 14 సం||లు గడిచాయి. స్వామి మా దంపతులను మాకుటుంబ సభ్యులను కంటికి రెప్పవలె కాపాడుతున్నారు. మమ్ములను శ్రీదత్త సేవకులను చేసారు. మాచేత దత్తసేవ చేయిస్తున్నారు. ఇది ఎంతటి సత్యం!!! ఆనాడు 1992, ఈనాడు 2008. మధ్యలో 16 సం||లు గడిచాయి. ఆహా! స్వామీ మా దంపతులను ఎంతో అనుగ్రహించావయ్యా!
★ ★ ★ ★ ★