home
Shri Datta Swami

 01 Oct 2025

 

హనుమంతుడు - కృష్ణుడు (జీవేశ్వరుల భేదము)


Part-1


Part-1

హనుమంతుడు సంజీవి పర్వతమును ఎత్తినపుడును కృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తినపుడును, ఈ రెండు సన్నివేశములలో గల తేడాను మనము గుర్తించినచో, జీవేశ్వరుల తేడాను మనము తెలుసుకొనగలము. బ్రహ్మ సూత్రములలో "అనుపపత్తేస్తు న శారీరః" ఇత్యాది సూత్రములలో శంకరులు కూడ జీవేశ్వరులకు గల బేధమును స్థాపించినారు. హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు తన శరీరమును పర్వతము కన్న ఎక్కువ ప్రమాణములో పెంచి యున్నాడు. అంత పెద్ద పరిమాణము గల శరీరములో ఇమిడియున్న శక్తి కూడ చాలా పెద్దది. కావున స్వల్ప శక్తి గల పర్వతమును ఎత్తుట మన బుద్ధికి అర్థమై తర్కమునకు అందుచున్నది. ఒక పెద్దరాయి చిన్నరాయిని మోసినట్లు తర్క బద్ధమైన విషయమై యున్నది. కాని చాలా చిన్న శరీరముగల బాలకృష్ణుడు తన శరీర పరిమాణమును పెంచకయే పర్వతమును ఎత్తుట బుద్ధికి అందక తర్కాతీతమైన విషయముగా యున్నది. మానవునిలో శక్తి లలితములైన డెబ్బది రెండువేల నాడుల యందు ప్రవేశించుచున్నది. ఒక బాలుని శరీరములో ఈ శక్తినంతయు కలిపి చూచినచో ఆ బాలుడు చిన్న బండను మాత్రమే ఎత్తగల శక్తి కలిగి యున్నాడు. ఇంత కన్న ఎక్కువ శక్తి లలితములైన ఆ నరముల యందు ప్రవహించినచో ఆ నరములన్నియు మాడిపోయి శరీరము భస్మమగును. ఒక కొండ ఎత్తుటకు ఒక పెద్ద క్రేన్‌ యంత్రము ఉపయోగించినపుడు ఎంత విద్యుచ్ఛక్తి కావలయునో ఆలోచించుడు. ఇప్పుడు మన బాలకృష్ణుడు ఆ కొండ నెత్తినాడన్నచో అంత శక్తి ఆ బాలుని నరములందు ప్రవహించుచున్నదని అంగీకరించక తప్పదు. కాని ఆ విద్యుచ్ఛక్తిలో కోటి వంతు ఒక మనిషికి తగిలినను ఆ మనిషి మాడిపోవుచున్నాడు. కాని హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినపుడు శరీరము యొక్క పరిమాణము పెరుగుట వలన ఆ శరీరము యొక్క శక్తి పెరిగినది కావున శక్తి చేత శరీరము ఏ మాత్రము బాధించబడదు. ఒక చెంబు పెద్ద బిందెగా మారినపుడు, చెంబు నీటి కన్నను ఎక్కువ పరిమాణములో పది చెంబుల నీరు బిందెలో పట్టుచున్నది. కావున జీవునిగా ప్రవర్తించుచున్న హనుమంతుడు కొండ నెత్తుట తర్కమునకు అందుచున్నది. కాని గోవర్ధన పర్వతమును ఎత్తినపుడు కృష్ణుడు శరీరమును పెంచలేదు. కొండ నెత్తు శక్తి మాత్రము పెరిగినది. ఆ అధిక శక్తికి బాలుని శరీరము బాధపడలేదు. బిందెడు నీరు చెంబులో పట్టినవి. ఇది తర్కమునకు అందదు.

Swami

శ్రుతులు అన్నియును పరమాత్మ తత్వము తర్కాతీతమని ఘోషించుచున్నవి. "అతర్క్యః", "నైషా తర్కేణ", "న మేధయా", "యో బుద్ధేః పరతః", "యస్యామతమ్‌ తస్య మతమ్‌" అను శ్రుతులు ఎన్నటికిని ఎవరికిని అర్థము కాని వాడు పరమాత్మ అని చెప్పుచున్నవి. గీతలో కూడా "మాం తు వేద న కశ్చన" అనగా నన్ను ఎవ్వడును అర్థము చేసుకొనజాలడు అని చెప్పుచున్నది. కావున జీవుడు ఎన్ని అష్ట సిద్ధులను సంపాదించినను ఈశ్వరత్వము రాదు. అష్ట సిద్ధులు మానవుని తర్కమునకు అందకున్నను ఋషులు దేవతల యొక్క మేధాశక్తి యగు తర్కమునకు అందుచున్నవి. కావుననే ఋషులు దేవతలు అష్ట సిద్ధులను వింతగా చూడరు. మనము నిత్యము చేయు కర్మలకు ఎట్లు ఆశ్చర్యపడమో, దేవతలు ఋషులు అష్ట సిద్ధులకు ఆశ్చర్యపడరు. కావున పరమాత్మ తత్త్వము తర్కాతీతము అనుటకు పరిమితమై నరాకారములోనే పరమాత్మ ఉన్నప్పుడు అది సాధ్యమగును. విశ్వరూపమును సందర్శించినపుడే అనాది అనంతమైన అకారమున స్వామి గోచరించినాడు. అంత పెద్ద ఆకారముతో ఈ అనాది అనంతమైన విశ్వమును భరించుటలో ఆశ్చర్యమేమున్నది? ఒక పెద్దకొండ ఏనుగును మోయునపుడు ఎట్లు ఆశ్చర్యము లేదు. అది తర్కమునకు అందుచున్నది. మరి శ్రుతులు పరమాత్మ తర్కాతీతుడనుచున్నవి. కావున ఈ విశ్వరూపము పరమాత్మ ఎట్లుగును? కాని పుత్రుడైన చిన్నబాలుడైన కృష్ణునిలో అనాది అనంత విశ్వమును యశోద దర్శించినది. అనంతమైన విశ్వరూపములో ఈ పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్థమై తర్కమునకు అందుచున్నది. కాని బాలకృష్ణుని చిన్ననోటిలో ఇంత పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్థము కాక తర్కాతీతమై యున్నది. కావున శ్రుతులు చెప్పిన దాని ప్రకారము పరమాత్మ విశ్వ రూపమా? లేక బాలకృష్ణుడా? యుక్తి ద్వారా కూడా ఇదే సిద్ధించును. ఏలననగా, బ్రహ్మము అను శబ్దమునకు అర్థము ఏమి? గొప్పది అని అర్థము. తర్కబద్ధమైన విశ్వరూపము గొప్పదా? తర్కాతీతుడైన బాలకృష్ణుడు గొప్పవాడా? ఇక అనుభూతిని తీసుకున్ననూ, "ఆశ్చర్యవత్‌ పశ్యతి కశ్చిదేనమ్‌" అని శ్రుతి. అనగా పరమాత్మ దర్శనము ఆశ్చర్యమును కలిగించును అని అర్థము. విశ్వరూపము భయమును కలిగించినది. "భీత భీతః ప్రణమ్య" అని గీత. "అధ తస్య భయం" అను శ్రుతి అజ్ఞానము భయమును కలిగించునని చెప్పచున్నది. విశ్వరూపము తర్కబద్ధము కావున అజ్ఞానమే. ఇది యొక సిద్ధియే. కాని కృష్ణుని నోటిలో విశ్వము చూచినపుడు ఆశ్చర్యము చెందుటకు తర్కాతీత స్థితియే కారణము. విచిత్రమే ఆశ్చర్యకారణము. ఈ విచిత్రమే మాయ. "మయ - వైచిత్ర్యే" కదా. ఈ విచిత్రము అనగా మాయ కలవాడే ఈశ్వరుడు. "మాయినం తు మాహేశ్వరమ్‌" అని గీత. కావున చర్మ చక్షువులకు గోచరించిన వసుదేవుని పుత్రుని స్వరూపమే పరబ్రహ్మము అని తెలియువాడు అసలు దొరకడని "వాసుదేవ స్సర్వమితి" అను శ్లోకము చెప్పుచున్నది. "యత్సాక్షాదపరోక్షాత్‌" అను శ్రుతి పరబ్రహ్మము ప్రత్యక్షమగుచున్నది. "ఇహ చేదవేదీత్‌" అను శ్రుతి ఈ లోకమున నున్న సత్యరూపమును కనుగొన్న వాడే సత్యముగా బ్రహ్మమును పొందినవాడనియు లేకున్నచో శాశ్వతముగ నష్టపోవునని చెప్పుచున్నది.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch