home
Shri Datta Swami

 Posted on 17 Oct 2024. Share

నరావతారము

[14.12.2002] "పరోక్షప్రియా ఇవ హి దేవాః ప్రత్యక్షద్విషః" అని శ్రుతి పలుకుచున్నది. దీని అర్థము దేవతలైనను ప్రత్యక్షముగనున్న దానిని ద్వేషింతురు. ఎదురుగా ఉండని దానిని ప్రేమింతురు. ఇది లోకానుభవ సత్యము. దేవతలకే ఇది తప్పనిచో మానవులకిక చెప్పనేల? కనపడిన దాని మీద ద్వేషము ఆరంభించును. అది ఎంతకాలము కనపడుచున్నదో అంతకాలము ద్వేషము పెరుగుచుండును. కావుననే పరమాత్మ కనపడక యున్నాడు. కనపడినను కొలది నిమిషములలోనే అదృశ్యమగుచున్నాడు.

బ్రహ్మము యొక్క లోకమునకు పోయినప్పుడు బ్రహ్మదేవుడు అచ్చట అదృశ్యరూపమున యుండును. ఋషులు చాలా కాలము స్తోత్రములు చేయగా అప్పుడు గోచరించును. శివలోకమునను ఇంతే. కాని వైకుంఠమునకు పోయినపుడు మహావిష్ణువు కనపడుచున్నాడు. దీనికి కారణము శ్రీదత్తపరబ్రహ్మము వర్తమానమున జగత్పాలనము కొరకు మహావిష్ణు స్వరూపమున ఉపస్థితుడై యున్నాడు. ఇది వర్తమానము కాన ప్రత్యక్ష స్వరూపము. ఈ కారణము చేతనే రామానుజ, మధ్వులు శ్రీమన్నారాయణ స్వరూపమునే పరబ్రహ్మముగా స్వీకరించినారు.

బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మదేవుని స్తుతించినపుడు ఈ మహావిష్ణువే బ్రహ్మదేవునిగా గోచరించి మరల అదృశ్యమగుచున్నాడు. తన యొక్క విచిత్రమాయాశక్తి చేత తాను వైకుంఠమున ఉండియు బ్రహ్మశివ లోకములందు అవసరమైనపుడు బ్రహ్మశివులుగా గోచరించుచున్నాడు. ఇదే "బ్రహ్మా చ నారాయణః, శివశ్చ నారాయణః" అను శ్రుతులకు అర్థము. ఇది ఇట్లు త్రేతాయుగము యొక్క ఆరంభము నుండి ఏర్పడినది.

కృతయుగము నందు శ్రీమహావిష్ణువు తన విచిత్ర మాయాశక్తిచేత బ్రహ్మలోకమున బ్రహ్మగా, శివలోకమున శివునిగా నిరంతరము ఉండుచూ వచ్చెను. దీని వలన సృష్టి, స్థితి, లయములను ఒకే పరమాత్మ కావించుచున్నాడను "యతో వా ఇమాని" అను శ్రుతి వాక్యమును సంశయించి తపస్సులను చేసిరి.

Swami

వర్తమానమున శ్రీ మహావిష్ణు స్వరూపమున ఉన్న శ్రీదత్తుడు ఋషులకు దర్శనమిచ్చిన తర్వాత తానే త్రిమూర్తి వేషములలో నున్న ఏకపరమాత్మయని బోధించిన తరువాత ఇట్టి సంశయము మరల రాకుండుటకై బ్రహ్మ శివ స్వరూపములను తనలోనే ఉపసంహరించుకున్నాడు. ఇదే చంద్రుని యొక్క బ్రహ్మత్వమును, దుర్వాసుని యొక్క రుద్రత్వమును మధ్యమ విష్ణుస్వరూపుడైన దత్తాత్రేయుడు ఆకర్షించుకున్నాడని చెప్పబడినదానికి అర్థము.

చంద్రుని యొక్క చల్లదనము, అంధకారమును పోగొట్టు కాంతిస్వభావమును, సుఖశాంతికరమగు జ్ఞానమును సూచించుచు జ్ఞానస్వరూపుడైన బ్రహ్మ దేవుని సూచించుచున్నది. దుర్వాసుని యొక్క కోపతీవ్రత, ప్రళయకాల సంహారక్రోధమును సూచించుచు రుద్రస్వరూపమును సూచించుచున్నది. ఈ మహావిష్ణుస్వరూపము దత్తుని యొక్క వర్తమానమైన ప్రధానతత్త్వమును సూచించుట వలన, దత్తుని విష్ణుస్వరూపముగానే పెద్దలు చెప్పుచున్నారు. ఉపనిషత్తులలో "దత్తోఽహం" అని నారాయణుడే చెప్పుట ఉన్నది. అనగా దత్తుడు వర్తమాన నారాయణ స్వరూపమున ఉన్నాడని అర్థము.

తమోగుణ, రజోగుణములు ఎక్కువ మాత్సర్యము కలిగియుండుట వలన జనులు ప్రత్యక్షమును వెంటనే ద్వేషింతురు. ఈ కారణము వల్లనే వర్తమాన ప్రత్యక్షుడగు శ్రీమన్నారాయణుని రాక్షసులందరు ద్వేషించిరి. దేవతలు సత్త్వగుణ ప్రధానులు కావున చాలా తక్కువ మాత్సర్యము కలిగి యుందురు. కావున వినయముతో వారు శ్రీమన్నారాయణుని ఆశ్రయించిరి. అందువల్లనే విష్ణువు వారి పక్షమున నిలబడి ఎల్లప్పుడు దేవతలకే విజయమును చేకూర్చెడివాడు. కాని వీరికి ఒక క్షణకాలము మాత్సర్యము వచ్చెను.

తమ విజయమునకు నారాయణుడే కారణమని గ్రహించక, నారాయణుడు కేవలము సాయము చేసి సంహరించెనని తలచి తామే తమ గెలుపు కారణమని అహంకరించగా పరబ్రహ్మము మహాతేజోరూపమైన యక్షస్వరూపమున సాక్షాత్కరించెను. వారలకు గర్వభంగము చేసి వారి శక్తులన్నియు తన శక్తులేననియు తీగెలో ప్రవహించు విద్యుత్‌, లైటును వెలిగించినదనియు, దానికి తీగె కారణము కాదనియు తెలియచేసెను.

ప్రహ్లాదుడు మాత్సర్యగుణము పరమాణువు కూడా లేని శుద్ధసత్త్వస్వరూపుడు. కావుననే రాక్షసులు వారి మాయాశక్తులతో ఎన్ని విధములుగా హింసించిను అవి పని చేయకపోవుటకు శ్రీమన్నారాయణ శక్తియే కారణమని చెప్పినాడు తప్ప, తన గొప్పతనమని పలుకలేదు. ఇదే హనుమంతుని మార్గము. "అహంకార విమూఢాత్మా కర్తా ఇతి మన్యతే" అని గీత. అనగా మూఢుడు తాను చేసితినని పలుకునని భావము.

హిరణ్యకశిపుడు నాస్తికుడు కాదు, అస్తికుడే. మంచిదే. తన కిష్టమైన బ్రహ్మ శివ స్వరూపములను ఆరాధించెను. అదియును మంచిదే. కాదనము. కాని రాక్షసత్వము వలన మాత్సర్యముతో వర్తమాన ప్రత్యక్ష విష్ణుస్వరూపమును ద్వేషించి దూషించెను. విష్ణుభక్తి మానమని ప్రహ్లాదుని బలవంతము చేసి హింసించెను. ప్రహ్లాదుడు బ్రహ్మశివులను ద్వేషించలేదు. బ్రహ్మశివభక్తిని మానమని హిరణ్యకశిపుని బాధించలేదు. ఈ కారణము వల్లనే ప్రహ్లాదుడు రక్షించబడి, హిరణ్యకశిపుడు శిక్షించబడెను.

ప్రహ్లాదుని భక్తి – గోపికల భక్తి

ప్రహ్లాదుని భక్తి కన్నను గోపికల భక్తి మరియొక మెట్టు పైకెక్కినది. దివ్యతేజోరూపుడైన పరోక్ష వైకుంఠమున ఉన్న నారాయణుని ప్రహ్లాదుడు ఆరాధించెను. ఇక సాక్షాత్తు మానవశరీరరూపుడై నిరంతరము ఎదురుగా కనపడు శ్రీకృష్ణుని పరమాత్మగా గోపికలు ఆరాధించిరి. భక్తి, జ్ఞానముల స్థాయి అత్యధిముగనున్న గాని వర్తమాన ప్రత్యక్షమైన నరావతారము మీద విశ్వాసము నిలువజాలదు. ఏలననగా నరావతారమున శరీరప్రకృతిధర్మములు మనకు వలె కనపడుచుండి విశ్వాసమును బాగుగా కుదిపివేయుచున్నవి. కావున రాక్షసస్వరూపులైన కంస, జరాసంధ, దుర్యోధనాదులు కృష్ణుని ద్వేషించి దూషించిరి.

పరిపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ భక్తుడు మాత్రమే నరావతారమును విశ్వసించగలడు. అట్టి నరావతారమున కూడా సిద్ధుల ప్రదర్శనము లేనప్పుడు విశ్వాసము మరింత సులభముగా సడలిపోవును. కావున ఎట్టి సిద్ధులను ప్రదర్శించక మనవలె కేవలము శరీరధర్మములను మాత్రము కలిగిన శ్రీరాముని గుర్తించుట ఎంత కష్టమో ఆలోచించుడు. ఎవ్వరికిని కనపడక పరమాత్మ చక్కగా దాగుకొన్న ప్రదేశమే రామావతారము. కాని హనుమంతుడు అచ్చటను పరమాత్మను గుర్తించెను. దీనిని బట్టి హనుమంతుని యొక్క జ్ఞానము, భక్తి ఎంత పరాకాష్ఠ స్థాయిలో ఉన్నవో తెలుసుకొనవచ్చును.

ఈ మాత్సర్యగుణము పూర్ణముగానున్నవారు అసలు ఆకారమునే అంగీకరించరు. నిరాకారమును సైతము అంగీకరించలేని పరిపూర్ణమాత్సర్యము కలవారే నాస్తికులు. కావున మాత్సర్యగుణము నశించనిదే నరాకారమును గుర్తించుట గాని, ఆరాధించుట గాని జరగదు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via