;

23 Dec 2025
[11.01.1996, గురువారము. రాత్రి 07.30 సమయము] శ్రీదత్తభక్తులు స్వామి సన్నిధిలో ఈ కీర్తన ఆలపిస్తున్నారు. “కనిపించు దత్తా, కనిపించు దత్తా, కనిపించు దత్తా నా కండ్లకు” అని. వెంటనే శ్రీదత్తప్రభువులు ఇలా వచించారు. “కనిపించుచున్నాను గదరా! ఇంకా కనిపించు, కనిపించు అని పాడతావెందుకు” అన్నారు. అప్పుడు దత్తభక్తులు స్వామితో, “స్వామీ మీరు నాకు కనిపిస్తున్నారు. కాని, నేను పాడినది నా కోసము కాదు అని మనవి చేసారు.” స్వామి పకపకా నవ్వుతూ, “చిలుకూరు భవానీ సహిత బాలకృష్ణమూర్తయే సాక్షాత్ కురు కురు స్వాహా” అంటూ అదృశ్యమయ్యారట. మరి మాకు ఆ అదృష్టం ఏనాటికో! స్వామి హృదయంలో మేము, మా హృదయంలో స్వామి ఉంటే మాత్రం చాలు అని స్వామికి విన్నవించుకున్నాము. స్వామి ఈనాడు భిక్షాసమయంలో ముగ్గురు యతీశ్వరుల రూపములో భిక్ష స్వీకరించి మమ్ము ధన్యుల చేసారు. ఆనాడు శ్రీదత్తస్వామి దత్తభక్తులని, వారికి శ్రీదత్త భగవానుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నారనే భావనలో మేము ఉండేవారము. కాని ఇప్పటికి సత్యం గ్రహించగలిగాము. అదేమంటే, శ్రీదత్తస్వామియే సాక్షాత్ అష్టమ దత్తావతారులు, మరి ఆయన మాకు కనిపిస్తూనే ఉన్నారు గదా!
[08.02.1996 రాత్రి 08.30 గంటలకు]
శ్రీదత్తభక్తులు శ్రీదత్తభగవానుని నిలువెత్తు పటము తెచ్చారు. శ్రీదత్త భగవానుల ఆజ్ఞానుసారము శ్రీదత్తాత్రేయ స్వామి వారి చిత్రపటము తెచ్చాను అంటూ త్రోవలో స్వామి ఇలా పాడారు. “నిను పాలింప నడచి వచ్చితిని, నా ప్రాణపుత్ర నా విష్ణుదత్తా” అని. తరువాత, శ్రీదత్త భగవానుని చిత్రపటాన్ని పై మేడ మీద గదిలో స్వామి ప్రతిష్ఠించారు. మా దంపతులము అపుడు స్వామికి నమస్కరించాము. “దత్తుని పట్టితిరి భయమేల? నిశ్చింతగ మీరిక బ్రతుకుమా” అని స్వామి అనుగ్రహించారు. శ్రీదత్తస్వామి వారు మాకు నూతన వస్త్రములను పెట్టాలని అనుకొన్నారట. కాని అపుడు శ్రీదత్తప్రభువు ఇలా అన్నారట “వాళ్ళకు నూతన వస్త్రాలెందుకురా! వాళ్ళకు నేనే కావాలి, నేను వస్తాను. నన్ను తీసుకువెళ్ళి వాళ్ళకివ్వు చాలు”. “వాసాంసి జీర్ణాని” అనే గీతాశ్లోకంలో స్వామి చెప్పినట్లు, పాతవస్త్రము విడచి కొత్తవస్త్రము ధరించినట్లు జీవుడు ఈ దేహాన్ని విడచి నూతన దేహాన్ని ధరిస్తాడు. కనుక ఇప్పుడు వాళ్ళకు నూతనవస్త్రాలు ఇస్తే మరల వాళ్ళు జన్మనెత్తాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ జన్మలోనే కృతార్థులు కావాలని ఆశిస్తుంటే వాళ్ళకు మరొక జన్మ ఎందుకు కలిగించటం అని శ్రీదత్త ప్రభువుల సంభాషణ సారాంశము అన్నారు శ్రీదత్తభక్తులు. నిజంగా మమ్ము ధన్యుల చేయటానికే మమ్ము పాలించటానికే స్వామి మావద్దకు ఏతెంచినారు.
స్వామి మాచేత 08-02-1996 నుండి ఏకధాటిగా అర్చనలు జరిపించినారు. శ్రీదత్తుని ప్రీత్యర్థం అర్చనలు, పవళింపు సేవలు, యజ్ఞాలు చేయించినారు, శ్రీదత్తజయంతులు, హోమాలు చేయించారు. శ్రీదత్తగురు భగవద్గీత, దత్తోపనిషత్తులు మొదలగు గ్రంథాలు సాధకులందరికీ అందించారు. ఇప్పుడు మాకు వృద్ధాప్యము వల్ల మేడపైకి వెళ్ళలేక పోవటముచేత శ్రీదత్తస్వామి వారు పైనుండి శ్రీదత్తస్వామి పటాన్ని క్రిందకి దింపించి నిత్యపూజను చేయిస్తున్నారు. శ్రీదత్తభక్తులుగా యున్న శ్రీదత్తస్వామి వారు ప్రస్తుతము సత్యనారాయణపురములో శ్రీఅజయ్ గారింట్లో, మరల శ్రీఫణి వాళ్ళ ఇళ్ళల్లో వుంటూ శ్రీజ్ఞానసరస్వతిని ప్రవచిస్తున్నారు. మా దంపతులము సత్యనారాయణపురము వెళ్ళి స్వామిని సేవిస్తున్నాము.
అప్పటి స్వామి దివ్యవాణి ఇది. “నాయనా, వారంలో ఏదో ఒక రోజు పూర్తిగా దైవధ్యానములో ఉండడానికి ప్రయత్నము చేయండి. ఆరోజు ఇతర లౌకిక విషయాలు మనస్సు లోనికి రానీయకండి, ప్రయత్నం చేయండి. దేవతలు, ఋషులు ఎవని పాదధూళి మాత్రమునైననూ దర్శనం చేయాలని తహతహలాడుతున్నారో అట్టి నేను మీ ఇంట, మీ జంట, మీ వెంట ఉన్నాను. మిమ్ములను తరింపచేయటానికి, మీ కంటి పొరలను తొలగించుకోండి. అపుడు మీకు నా పూర్ణదర్శనమౌతుంది. ఈ రెండు కంటిపొరలు రెండు గోడలలాంటివి. ‘నేను,’ ‘నాది’ అనే ఈ రెండు గోడలను తొలగించుకోండి. మీకు నా దర్శనభాగ్యము తప్పక కలుగుతుంది” అని మమ్ములననుగ్రహించారు. ఒకసారి స్వామితో ఇలా అన్నాము. స్వామీ! ఉగాదికి శ్రీశైలం వెళ్ళివద్దామా? అని. అపుడు స్వామి అన్నారు – “ఇది పోస్టుగ్యాడ్యుయెట్ డిగ్రీ ఉన్నవారు ఒకసారి ఎలిమెంటరీ స్కూలుకు వెళదామా అన్నట్టు ఉన్నది. ఐతే లోగడ మాతో శ్రీశైలం వచ్చారు గదా అని మీరడగవచ్చు. అయితే, అది స్వామి ఆదేశానుసారంగా మీకోసమే శ్రీశైలం వచ్చాను, అంతే” అన్నారు శ్రీదత్తభక్తులు. స్వామీ! మీ అజ్ఞానుసారము అంతా జరుగుతుంది. మేము మీ సేవకులము అని ప్రణమిల్లుదుము.
★ ★ ★ ★ ★