
Posted on 07 Dec 2024. Share
Updated with Part-3 on 09 Dec 2024
[30.11.2002] సృష్టిలో చైతన్యము (awareness) ఊహకు అందకయున్నది. ఇది శక్తిస్వరూపము అయినప్పటికి ఒక జడపదార్థము నందు చైతన్యమును మనము తీసుకొనిరాలేకున్నాము. కాంతి లేని చీకటి ఉన్న ప్రదేశమున కాంతిని తీసుకురాగలుగుచున్నాము. చల్లని ప్రదేశమున ఉష్ణమును తీసుకురాగలుగుచున్నాము. మరణానంతరము శరీరములో చైతన్యమును తీసుకురాలేకున్నాము. ఈ చైతన్యము నేటి విజ్ఞానవేత్తలకు (scientists) సైతము ఊహకు అందకయున్నది. చైతన్యము ఉన్న చోట పాతగుణములను మార్చి కొత్తగుణములు తెచ్చుట వీలగునని నేటి వైజ్ఞానికులు నిరూపించుచున్నారు. ఖొరానా అను శాస్త్రవేత్త DNA మరియు RNA అను అణువుల ఉత్పాదనము ద్వారా ఒక జీవిలోని గుణములను మార్చవచ్చునని ప్రతిపాదించుచున్నాడు. కాని ఈ పరిశోధన వలన నిర్జీవమైన శరీరములో మరల చైతన్యమును రప్పించుట వీలుపడదు. కావున ఈ వైజ్ఞానికులకు చైతన్యమును ఒక పదార్థము నుండి సృష్టించుట కాని, చేతనమైన ప్రాణి నుండి అచేతనమైన మరియొక ప్రాణిలోనికి చైతన్యమును మార్చుటకాని వీలుపడలేదు. కావున సృష్టిలోగల అన్ని పదార్థములలో అత్యంత సూక్ష్మమై దాదాపు అనూహ్యమైన శక్తియే చైతన్యము.
ఈ చైతన్యము కూడా సృష్టియైన ప్రకృతిలోని ఒక భాగమే. ఇది ‘పరాప్రకృతి’ అనబడుచున్నది. 'పరా' అనగా శ్రేష్ఠమైన, 'ప్రకృతి' అనగా సృష్టించబడిన పదార్థము. ఇట్టి చైతన్యమును బ్రహ్మముగా ఆచార్యులు తీసుకున్నారు. కాని ఈ చైతన్యము సృష్టియందు అంతటను వ్యాపించిలేదు మరియు ఈ చైతన్యము గల శరీరమునందు జడమైన అపరాప్రకృతి యొక్క ప్రభావమునకు చైతన్యము లొంగిపోయి పారిపోవుచున్నది. జడమైన వడగాలి దెబ్బకు మానవుని శరీరములోని చైతన్యము పారిపోవగా, ఆ మానవుడు మరణించుచున్నాడు. ఇంత దుర్బలమైన ఈ చైతన్యము బ్రహ్మమగునా?
బ్రహ్మము యొక్క భయము చేత సూర్యుడు నడచుచున్నాడని "భీషోదేతి సూర్యః" అని శ్రుతి చెప్పుచున్నది. అయితే సూర్యతేజస్సునే బ్రహ్మమందుమా? ఒక దీపమును వెలిగించి మనము తేజస్సును పుట్టించుచున్నాము. ఆ దీపమును ఆర్పి తేజస్సును అంతమొందించుచున్నాము. ఇట్లు మానవునకు వశమైన జడమైన తేజస్సు బ్రహ్మమగునా? ఈ విధముగా లోపములను చూచుచున్నచో సృష్టిలోని ఏ పదార్థమూ బ్రహ్మము కాదు. కావుననే శ్రుతి "నేతి నేతి" అని చెప్పుచున్నది.

అసలు సృష్టి, సృష్టికర్త ఎట్లగును? సృష్టియే సృష్టి కర్తయైనచో, సృష్టికర్త కన్న రెండవది లేదు గదా. అదే నిజమైనచో, సృష్టికర్త సృష్టిని సృష్టించుట అసత్యమగునా? సృష్టించుట అసత్యమైనచో "స ఇదం సర్వ మసృజత" అనగా, ఆయన ఈ జగత్తును సృష్టించెను అను శ్రుతి అసత్యము కావలసివచ్చును. కావున సృష్టికర్త కన్న భిన్నమైనది అత్యల్పమైననూ ఉండియే తీరవలయును. ఆయన కన్న భిన్నమైనది సృష్టి అనబడుచున్నది. ఆయన కన్న భిన్నమైనది ఆయన కాదు. మన ఊహ ఈ సృష్టిని దాటిపోలేదు. సృష్టిలో ఉన్న ద్రవ్యము అంతయు శక్తిగా మారినది అనుకొందుము. అనగా ప్రళయమున ద్వాదశాదిత్యుల తేజస్సు చేత సృష్టిలోని ద్రవ్యపదార్థములన్నియు దగ్ధములై తేజస్సుగా మారినవి. అప్పుడు ఈ జగత్తులోని ఆకాశమనబడు శూన్యమంతయును తేజస్సుతో నిండియున్నది. ఇది మన ఊహకు అందును. ఈ తేజస్సు కూడా ద్వాదశాదిత్యులతో సహా అంతరించినది. ఇప్పుడు సృష్టియంతయు శూన్యమైన ఆకాశముగా మిగిలియున్నది. అనగా పంచభూతములలో (five elements) నాలుగు భూతములగు భూమి, జలము, అగ్ని, వాయువు లయించినవి. మొదటి భూతమగు ఆకాశమే మిగిలినది.
ఆకాశము పరమాత్మ నుండి పుట్టినదని శ్రుతి చెప్పుచున్నది
ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి వృక్షములు, వృక్షముల నుండి అన్నము, అన్నము నుండి ప్రాణి వరుసగా పుట్టినారని "ఆకాశాద్ వాయుః" అను శ్రుతి చెప్పుచున్నది. మరి ఈ శూన్యమైన ఆకాశము దేని నుండి పుట్టినది? ఆకాశము పరమాత్మ నుండి పుట్టినదని "ఆత్మనః ఆకాశః సంభూతః" అను శ్రుతి చెప్పుచున్నది. కార్యము నశించినచో కారణము గోచరమగును. కారణము-మట్టి, కార్యము-కుండ. కుండను పగులగొట్టి చూర్ణము చేసినచో దానికి కారణమగు మట్టి స్వస్వరూపము గోచరమగుచున్నది. పరమాత్మ కారణము, ఆకాశము కార్యము. కావున పరమాత్మ గోచరించవలెనన్నచో ఆకాశము అనగా శూన్యము లయించవలెను. ద్రవ్యము, శక్తి లయించగా మిగిలిన శూన్యము ఊహకు అందుచున్నది. ఈ శూన్యము అదృశ్యమైనచో ఏమి గోచరించుచున్నది? కనులు మూసుకొనుడు. మీ ఆయుర్దాయకాలమంతయు ఆలోచించుడు. శూన్యము లయమైన తర్వాత స్థితి నీ ఊహకు అందదు. ఈ ఊహాతీతమైన స్థితిని అవ్యక్తము అందురు. ఈ స్థితిని దాటిన గాని అవ్యక్తమునకు అతీతుడైన పరమాత్మ గోచరింపడు. "అవ్యక్తాత్ పురుష పరః" అని శ్రుతి. ఈ అవ్యక్తమును ఏ ప్రాణియు దాటలేడు. దీనినే "మహామాయ" అందురు. శుకమహర్షి సైతము ఇంకనూ శూన్యములోనే ప్రయాణించుచున్నాడని రామకృష్ణ పరమహంస ఒకసారి చెప్పెను. అనగా శూన్యము లయించిన తర్వాత స్థితికి శుకుడు సహితము ఊహించలేకున్నాడని అర్థము. కావున పరమాత్మ స్వస్వరూపము బ్రహ్మర్షులకును, దేవతలకును, ఊహలకు అందకున్నది. ఆయన స్వస్వరూపము ఎవ్వరికిని, ఎప్పటికిని గోచరించదు. ఇటువంటి బ్రహ్మము యొక్క అసలు స్వరూపమును నేను మాత్రము ఎట్లు తెలియగలను అని నచికేతునితో యమధర్మరాజు "కథమేతత్ విజానీయమ్" అని చెప్పినాడు. మరియును "యస్యా మతం తస్య మతమ్" అని ఆయన ఎప్పటికిని, ఎవ్వరికిని బ్రహ్మము తెలియదు అని తెలుసుకున్నవాడే, బ్రహ్మమును గురించి తెలిసినవాడు అని చెప్పినాడు.
బ్రహ్మబోధ కొరకు చైతన్యమునుండియే ఆరంభించవలయును
ఒకనికి అరుంధతీ నక్షత్రము కనపడుటలేదు. అట్టివానికి వశిష్ఠనక్షత్రమును చూపి దాని ప్రక్కనే అరుంధతీ నక్షత్రము అని చెప్పుదురు. దీనినే "అరుంధతీ వశిష్ఠ న్యాయ" మందురు. అట్లే ఊహకు అందని ఆ పరమాత్మను అతి సూక్ష్మమైన చైతన్యమును చూపి దాని వంటిదే పరమాత్మ అని చెప్పినారు. చైతన్యము మన అనుభవమునకు ఊహకు అందుచున్నది. కాని చైతన్యమును పుట్టించుట మన ఊహకు అందుటలేదు. ఇట్లు చైతన్యము కొంత ఊహకు అంది, కొంత ఊహకు అందకున్నది. సృష్టిలోని మిగిలిన పదార్థములన్నియును మన ఊహకు అందుచు, వాటిని పుట్టించగలుగు చున్నాము. కావుననే సృష్టిపదార్థములగు ప్రకృతిలో చైతన్యము అతి శ్రేష్ఠమైయున్నది. మన ఊహలకు ఏ విధముగను అందని అవ్యక్త పరమాత్మను గురించి ఒక్క మాటయును మనము చెప్పలేము, మనస్సుతో చింతించలేము, బుద్ధిచేత నిర్ణయించలేము. పది మంది పండితులతో కలసి తర్కించలేము అని "యతో వాచః", "అప్రాప్య మనసా సః", "న మేధయా", "న తర్కః" మొదలగు శ్రుతులు పలుకుచున్నవి.
కావున బ్రహ్మమును గురించి బోధించవలయునన్నచో, చైతన్యము నుండి ఆరంభించవలయును. చైతన్యమునకు ఉన్న లోపములను మనము మరచిపోవలెను. ఏలననగా చైతన్యము వంటిది బ్రహ్మము అని చెప్పుచున్నాము గాని చైతన్యమే బ్రహ్మమని చెప్పుటలేదు. పంచకోశములకు పంచభూతములను దాటుచూ చివరకు అయిదవ కోశమగు ఆనందమయ కోశమైన ఆకాశమునకు అతీతమైన పరమాత్మను గురించి చెప్పలేక వరుణపుత్రుడగు భృగువు మౌనము వహించెను. మౌనము అనగా ఊహించలేని, చెప్పలేని స్థితి. "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వమ్" అన్నారు శంకరులు. అనగా పరబ్రహ్మతత్త్వమును దక్షిణామూర్తి మౌనముతో బోధించుచున్నాడు అని అర్థము. దక్షిణామూర్తియే చెప్పలేక పరబ్రహ్మతత్త్వబోధ విషయమున మౌనము వహించగా, దక్షిణలను తీసుకొని వేదాంతమును బోధించు పండితులు పరబ్రహ్మమును గురించి బోధించగలరా? కావున బ్రహ్మసూత్రములు కూడా చైతన్యమే బ్రహ్మమని "ఈక్షతే ర్నా శబ్దమ్" అను శ్రుతి ద్వారా, "తదైక్షత" అను శ్రుతి ద్వారానూ చెప్పినవి. ఇంత కన్న వేరు మార్గము లేదు. దీనిని గుర్తించక చైతన్యమే బ్రహ్మమనియు, చైతన్య స్వరూపుడగు జీవుడు బ్రహ్మమనియు పండితులు భ్రమించినారు.
సృష్టిపదార్థముల యొక్క శ్రేష్ఠమైన గుణముతోనే బ్రహ్మమునకు పోలిక.
"చంద్రముఖి" అన్నప్పుడు చంద్రుని వంటి ముఖము అని తీసుకొనవలయును కాని, ముఖమే చంద్రుడు అని కాని, చంద్రుడే ముఖమని కాని తీసుకొనరాదు. చంద్రుని వలె ముఖము ఆహ్లాదమును కలుగచేయుచున్నది అని అర్థము. కేవలము ఆహ్లాదగుణముననే ఆ రెండింటికి సామ్యము తీసుకొనవలెను. మిగిలిన గుణములలో కాదు. సూర్యోదయమున చంద్రుడు అదృశ్యమగును. కాని ముఖము అదృశ్యమగుటలేదు. చైతన్యమును పుట్టించలేము అన్న గుణము వలన, ఈ అనూహ్యగుణమే బ్రహ్మమును చైతన్యముతో పోల్చునట్లు చేసినది. ఈ ఒక్క అనూహ్యగుణము నందు మాత్రమే చైతన్యమునకు బ్రహ్మమునకు పోలిక. అనగా బ్రహ్మము అనూహ్యమని చెప్పుటయే సారాంశము. ఇక వడదెబ్బకు బెదిరి శరీరము వదిలి పారిపోవు చైతన్యము యొక్క దౌర్బల్యగుణమునకు బ్రహ్మముతో పోలిక లేదు. బ్రహ్మము దెబ్బకు మృత్యుదేవత కూడా హడలి పరిగెత్తుచున్నది. "మృత్యుర్ధావతి" అని శ్రుతి కదా. ఈ విధముగా ఒక్కొక్క సృష్టిపదార్థము దాని యొక్క శ్రేష్ఠమైన గుణమునందే బ్రహ్మముతో పోల్చబడుచున్నది. అట్లే తీవ్రమైన తేజోగుణము నందే ఆదిత్యుడు బ్రహ్మముతో పోల్చబడుచున్నాడు. అట్లే బలములో వాయువు బ్రహ్మముతో పోల్చబడుచున్నాడు. "నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి" అని శ్రుతి. అట్లే ప్రాణికోటిలో అతి శ్రేష్ఠుడైన నరుడు"జీవో బ్రహ్మైవ" అని బ్రహ్మముతో పోల్చబడినాడు. బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్థము. ఇతడు గణితశాస్త్ర బ్రహ్మ అనగా గణితశాస్త్రజ్ఞులలో చాలా గొప్పవాడు అని అర్థము. పక్షులలో వైనతేయుడు బ్రహ్మము అనగా పక్షులలో వైనతేయుడు గొప్పవాడు అని అర్థము.
ఒకడిని ఇతడు కవిరాజు అని అందురు. అనగా కవులలో రాజు వంటివాడు అని అర్థము. రాజశబ్దము చెప్పినంత మాత్రమున ఇతడు ఈ దేశమును ఏలు రాజు అగునా? సృష్టి పదార్థములలో చాలా గొప్ప సృష్టి పదార్థము జీవుడు. కాన సృష్టిలో జీవుడు బ్రహ్మము అన్నంత మాత్రమున జీవుడు నిజమైన పరబ్రహ్మమగునా? కవిరాజు అన్నప్పుడు కవిత్వము వ్రాయుటలో శ్రేష్ఠుడు అని అర్థము. అంతేకాని రాజువలె యుద్ధము చేయుటలో శ్రేష్ఠుడగునా? అన్ని సృష్టి పదార్థములను మానవుడు నిర్మించగలుగుచున్నాడు. కాని జీవుని సృష్టించలేకున్నాడు. ఈ ఒక్క గుణములో అనగా మానవుని చేత జీవుడు సృష్టింపబడలేడు అన్న విషయములో జీవుడు శ్రేష్ఠుడు. కావున సృష్టిలో ఏ పదార్థమైనను దాని యొక్క శ్రేష్ఠగుణములో బ్రహ్మముతో పోల్చబడినదే తప్ప అది నిజముగా బ్రహ్మము కానే కాదు. దీనినే "నేతి నేతి" అను శ్రుతులు చెప్పుచున్నవి. ఇంతేకాదు, సృష్టిలో ఏ పదార్థమునందును బ్రహ్మము లేదు. "న చాహం తేష్వవస్థితః" అను గీత నేను (బ్రహ్మము) ఈ సృష్టి పదార్థములలో లేను అని చెప్పుచున్నది. “న త్వహం తేషు తే మయి" నేను ఈ సృష్టి పదార్థములలో లేను, అవి కేవలము నా మీద ఆధారపడి యున్నవి అని గీతార్థము. కావున జీవుడు బ్రహ్మము కాదు. జీవునిలో బ్రహ్మము లేదు. కావున సర్వజీవులును బ్రహ్మమే అనువారును, సర్వజీవుల యందు పరమాత్మ ఉన్నాడనువారును జ్ఞానవిచారము చేయనివారు. వీరి వాక్యములు "సదసద్విచారము" చేయనంత వరకు మనోహరములుగా యుండును. అందుకే సాధకునకు ఉండవలసిన నాలుగు గుణములలో "సదసద్వివేకము" ఒకటియని శంకరులు వచించినారు.
జీవులందరూ పరమాత్మ కాదు
జీవులందరూ పరమాత్మయే అయిన ఎడల గోపికలు ఏల తమ పతి, పుత్ర, బంధు, పశువులను వదలి వాసుదేవుని వద్దకే పరిగెత్తినారు? దారా, పుత్ర, జీవులు పరమాత్మయే అయినచో దారేషణ, పుత్రేషణ ఎట్లు బంధములగును? భార్యాపుత్ర వ్యామోహమను సంసార వ్యామోహము, పరమాత్మ ప్రేమయనెడి భక్తియే అగును కదా. అప్పుడు సంసార వ్యామోహము, పరమాత్మ ప్రాప్తికి సాధనము కావలెనే గాని ప్రతిబంధకము ఎట్లుగును? మీరా పతిని ఏల త్యజించవలెను? శంకరులు తల్లిని ఏల వదలవలెను? బుద్ధుడు భార్యపుత్రులనేల వదలవలయును? ప్రహ్లాదుడు పరమాత్మయగు హిరణ్యకశిపుని ఏల వదలవలయును. సర్వజీవులు బ్రహ్మమైనచో శంకరుడు త్రాగిన సీసపుద్రవమును ఆయన శిష్యులు ఎందుకు త్రాగలేక పోయినారు? "శంకర శ్శంకర స్సాక్షాత్". శంకరులు నిస్సందేహముగా బ్రహ్మమే.
అయితే సృష్టిలోని ఏ పదార్థము ఎప్పటికిని బ్రహ్మము కాదా? దీనికి సమాధానమే ఈశావాస్యము యొక్క ప్రథమమంత్రము. "జగత్యాం = ఈ జగత్తులో; యత్కించ జగత్ = ఏ చిన్న సృష్టిపదార్థమైనను; ఈశా = పరమాత్మ చేత; వాస్యం = వ్యాపించబడినపుడు; ఇదం సర్వమ్ = ఆ పదార్థము మొదలు నుండి చివర వరకు పరమాత్మయే అగును. కావున ఏ సృష్టిపదార్థమైనను పరమాత్మ కావచ్చునే తప్ప సహజముగ పరమాత్మ స్వరూపమై యుండలేదు. ఈ జగత్తుకు పరమాత్మ ఆధారముగా యున్నాడు అన్నప్పుడు కూడా పరమాత్మకు జగత్తుకు స్పర్శ సంబంధము లేదు. కావున జగత్తులోని వికారములేవియు (changes) పరమాత్మను అంటజాలవు. ఈ జగత్తుకు కేవలము పరమాత్మ యొక్క సంకల్పమే అధారముగ యున్నది. ఈ జగత్తు పరమాత్మ యొక్క ఊహ మాత్రమే. ఊహించిన నగరము మంటలలో మండుచున్నప్పుడు ఈ శరీరమునకు వేడి తగులుట లేదు. ఊహ ఎంత అత్యల్పమన్న దానికి నీవు ఆధారముగా ఉండవలసిన అవసరము లేదు. అల్పమైన నీ సంకల్పము చాలును, ఊహారూపమైన యీ జగత్తులో అన్ని సృష్టిపదార్థములును ఊహారూపములే. అట్టి సృష్టిపదార్థములలో, ఒకానొక సృష్టిపదార్థములోనికి పరమాత్మ సంకల్పశక్తి ప్రవేశించగనే, ఆ సృష్టిపదార్థము పరమాత్మయే అగుచున్నది. ఆ సృష్టిపదార్థములోనికి పరమాత్మ సంకల్పము ఏ రూపమున ప్రవేశించినది? "ఈ సృష్టి పదార్థమే నేను" అను తాదాత్మ్యమే సంకల్పశక్తి. ఈ సంకల్పశక్తియను విద్యుత్తు, సృష్టిపదార్థమను తీగెలోనికి ప్రవేశించగనే ఆ తీగె విద్యుత్తీగె యగుచున్నది. అట్టి తీగె సాక్షాత్తూ విద్యుత్తే అగును. అనగా ఆ సృష్టిపదార్థము పరమాత్మయే అగును. ఉపదేశాదులను చేయవలసి వచ్చినపుడు ఆ సృష్టిపదార్థము ఒకానొక జీవుడగును. అతడే నరావతారము. అతడే సాక్షాత్తుగ అందివచ్చిన, దిగివచ్చిన అవతారమగు పరబ్రహ్మమైన దత్తుడు.
★ ★ ★ ★ ★