
Posted on 05 Dec 2024. Share
Updated with Part-2 on 06 Dec 2024
[భగవాన్ శ్రీసత్యసాయినాథుని జన్మదినోత్సవ సందర్భంగా, శ్రీ దత్తస్వామి ఇచ్చిన సందేశము] “ఇహ చే దవేదీ దథ సత్యమస్తి, న చే దిహావేదీ న్మహతీ వినష్టిః” అని శ్రుతి చెప్పుచున్నది. దీని అర్థమేమి? ప్రత్యక్షముగా లభించినదే సత్యము. ప్రత్యక్షమును వదలినచో అంతయును నష్టమే. ప్రత్యక్షమే సత్యము. పరోక్షమంతయును భ్రమయే. చార్వాకుడు ప్రత్యక్షప్రమాణమునే విశ్వసించినాడు. చార్వాకుడు ఒక మహర్షి. అతడు నాస్తికుడని అందరును ఖండించిరి. కాని షడ్దర్శనములలో చార్వాకదర్శనమును చివరి దర్శనముగా విద్యారణ్యులు గ్రహించినారు. నాస్తికుడైనను, బాలుడైనను, శతృవైనను అతడు చెప్పు మాటలలో సత్యమున్నచో దానిని గ్రహించవలెను. ఆ సత్యము వరకే గ్రహించి మిగిలిన అసత్యమును త్యజించవలెను. కావున చార్వాకదర్శనములో ఉన్న సత్యమేమి? ఈ మతములో సత్యము ఏమనగా, ఏ జ్ఞానమునకైనను ప్రత్యక్షప్రమాణము మూలాధారముగా ఉండవలెను. అది లేనిచో ఆ జ్ఞానమంతయు కల్పనయే అగును. మిగిలిన ప్రమాణములగు అనుమానము, ఉపమానము, శబ్దము ప్రత్యక్షము పైనే ఆధారపడియున్నవి. నిప్పునుండి పొగ వచ్చుట చూచి పొగ ఉన్నచోట నిప్పు ఉండునను జ్ఞానము ప్రత్యక్షప్రమాణము. దూరముగా పొగ మాత్రమే కనిపించినప్పుడు దానిని చూచి అక్కడ నిప్పు ఉన్నది అని తెలియుట అనుమాన ప్రమాణము. ఈ అనుమానమునకు ఆధారము ప్రత్యక్షమే కదా!

ప్రత్యక్షముగా చూడనిచో పొగ నిప్పుల సంబంధము తెలియదు గదా. ఇక గోవును చూచి అరణ్యములో ఉన్న గవయ మృగమును ఈ గోవు వలె ఉండును అని చెప్పుట ఉపమానప్రమాణము. ఇచ్చట కూడ ప్రత్యక్షప్రమాణమే ఆధారము. గోవును చూడనిదే గవయమృగమును ఊహించలేడు గదా. ఇక గంగాతీరమున కాశీ ఉన్నదని ఆప్తుడు చెప్పు వాక్యమును విని కాశీనగరము ఉన్నదని తెలియుట శబ్దప్రమాణము. దీనికి ప్రత్యక్షమే ఆధారము. కాశీనగరమును ప్రత్యక్షముగా చూచినవాడే చెప్పినాడు గదా! కావున సర్వప్రమాణములకు ప్రత్యక్షమే పునాది. వేదమును శబ్దప్రమాణముగా చెప్పుదురు. అనగా పరమాత్మను చూచిన ఋషులు చెప్పిన మాటలే వేదము. కావున పరమాత్మ విషయమున కూడా ప్రత్యక్షప్రమాణమే ఆధారము.
“పరిపశ్యంతి”, “ఐక్షత్” అను శ్రుతులు ఋషులు ప్రత్యక్షముగా పరమాత్మను చూచిరని చెప్పుచున్నవి. అంతే కాదు పరమాత్మ ప్రత్యక్షముగా చూడబడును, పరోక్షముగా లేడు అని శ్రుతి “యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ” అని నొక్కి వక్కాణించుచున్నది. “ఇహ చేత్” అను శ్రుతి ఈ లోకమున చూచినవాడే సత్యముగ చూచినవాడు. ఈ లోకమున ప్రత్యక్షముగా చూడనివాడు ఎప్పుడును, ఎక్కడను చూడజాలడు అని చెప్పుచున్నది. కావున మోక్షమును, కైవల్యమును ఈ లోకముననే మరణించక ముందే పొందవలయును. అట్లు పొందనిచో ఎప్పటికిని, ఎక్కడను పొందడు. జీవన్ముక్తియే నిజమైన ముక్తి. మరి పరమాత్మ ఈ లోకమున ఎచ్చట కనపడుచున్నాడు? ప్రత్యక్షముగా కనిపించు సూర్యాదులా? లేక దేవాలయములలో కనిపించు విగ్రహములా? సూర్యాదులు కాదని “నేదం తత్ యదిదముపాసతే” అను శ్రుతి, సూర్యుడు బ్రహ్మము కాదనియు “న తత్ర సూర్యో భాతి” అను శ్రుతి, సూర్యుడు పరబ్రహ్మము ముందు ప్రకాశింపజాలడనియు ఆదిత్యోపాసన ప్రకరణమునందు చెప్పుచున్నది.
ఇక “న తస్య ప్రతిమా అస్తి” అను శ్రుతి, “న చాహం...”, “న త్వహం తేషు…” అను గీతలు పంచభూతములు పరమాత్మ కాదని “నేతి నేతి” అను శ్రుతులు పంచభూతములతో తయారు చేయబడిన విగ్రహములు పరమాత్మ కావని స్పష్టముగా చెప్పుచున్నవి. చిత్రపటములు కూడా విగ్రహముల వంటివే. మరి పరమాత్మ ప్రత్యక్షముగా ఎట్లు లభించును? దీనికి గీతలో ‘మానుషీం తను మాశ్రితమ్”, “సంభవామి”, “వాసుదేవ స్సర్వమిదమ్” అను గీతలలో మనుష్యశరీరమును ఆశ్రయించి పరమాత్మయే స్వయముగా దిగి వచ్చునని చెప్పుచున్నది. 'అవ'-దిగి, 'తార'-వచ్చుట అని అర్థము.
పరమాత్మ జీవునిగా వచ్చినాడనియే మహావాక్యములకు అర్థము
అనగా జీవులలోనికి పరమాత్మ జీవునిగా చేరును అని అర్థము. పరమాత్మ జీవునిగా వచ్చినాడనియే “ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్త్వమసి, అహం బ్రహ్మ” అను మహావాక్యములకు అర్థము. అనగా పరమాత్మ జీవస్వరూపునిగా వచ్చియున్నాడని అర్థము. మానవులు మహామేధావులు కదా! ఈ శ్రుతి అర్థమును తీసుకొని జీవులందరు పరమాత్మయే అని గంతులు వేసినారు. “జీవ భూతస్సనాతనః” అను గీత సనాతనుడైన పరమాత్మ జీవుడిగా మారినాడని చెప్పుచున్నది. జీవులు పరమాత్మ అవతరించక ముందే జగత్తులో ఒక భాగముగా సృష్టించబడి ఉన్నారు. జగత్తు ప్రకృతి అనబడుచున్నది. ప్రకృతియనగా శ్రేష్ఠమైన కార్యము అని అర్థము. అనగా పరమాత్మ నిర్మించిన సృష్టి అని అర్థము. ఇందులో జడములైన పంచభూతములు మనస్సు, బుద్ధి, అహంకారములు కలసి అపరాప్రకృతి యను భాగముగా ఉన్నది.
ఇక 'చిత్', 'చిత్త', 'క్షేత్రజ్ఞ', 'ఆత్మ', 'దేహి', 'శారీరక' మొదలగు శబ్దములచే చెప్పబడు జీవుడు పరాప్రకృతి భాగముగ ఉన్నది. పరమాత్మ ఒక్కడే అయినందున లీలావినోదము కొరకు సృష్టి చేసెనని “ఏకాకీ న రమతే” అను శ్రుతి చెప్పుచున్నది. ఆ సృష్టిని టి.వి.ని చూచి వినోదించినట్లు పరమాత్మ వినోదించునని, “సాక్షీ చేతా” అను శ్రుతి చెప్పుచున్నది. ఆ తరువాత సృష్టిలో ఉన్న జీవులలో తానొక జీవిగా ప్రవేశించెనని “తదేవానుప్రావిశత్” అను శ్రుతి చెప్పుచున్నది. అట్టి జీవుడు బ్రహ్మమేనని మహావాక్యములు చెప్పుచున్నవి.
ఈ మహావాక్యముల అర్థమునే శంకరులు “జీవో బ్రహ్మైవ నాపరః” అని చెప్పినారు. అట్లు అవతరించిన జీవుడు మాత్రమే బ్రహ్మమనియును ఇతర జీవులు బ్రహ్మము కారనియు నిరూపించుటకు తాను కరిగిన సీసము తాగి ఇతర జీవులైన శిష్యులను దానిని తాగమన్నారు. పరమాత్మలో, జీవునిలో చైతన్యము సమానముగా ఉన్నదని, జీవుడు పరమాత్మ యగునా? రాజు మనిషియే. నేనూ మనిషినే. కావున నేను రాజును అనుట ఎంత హాస్యాస్పదము. గ్రామపాలుడు అగు ఒక కరణము, రాష్ట్రపాలుడగు రాజుని చూచి మన ఇరువురిలో ‘పాలక’ శబ్దము సమానముగా యున్నందున నేను రాజునే అన్నచో ఎంత వెర్రితనము. బిల్ కలెక్టరు, మరియు జిల్లా కలెక్టరు అను శబ్దములలో కలెక్టరు అను శబ్దము సమానముగా ఉన్నందున, బిల్ కలెక్టరు తాను జిల్లా కలెక్టరు అని అన్నచో వానిని మానసిక రోగచికిత్సాలయమునకు చేర్చుదురు. వడదెబ్బకు పడిపోయి వాడిపోవు జీవుడెక్కడ, “భీషోదేతి సూర్యః” అను శ్రుతి చేత సూర్యుని శాసించు పరమాత్మ ఎక్కడ. ఆంజనేయునితో సమానమైన అష్టసిద్ధులు కలవాడు కాని, జ్ఞాని కాని, యోగి కాని, శక్తిమంతుడు కాని సృష్టిలో లేడు. ఆయనయే “దాసోఽహం కోసలేంద్రస్య” అని నరాకారములో యున్న పరమాత్మయగు రామునికి దాసుడననుచున్నాడు. పిడికెడు విభూతిని సృష్టించిన తండు మహాముని “అహం బ్రహ్మాస్మి” అనుకుని గంతులేసి, విభూతికొండను సృష్టించిన శివదత్తుని పాదముల పైబడి దాసోహమ్మని తాను జీవుడనేనని తెలుసుకున్నాడు. ఇక పిడికెడు విభూతి నుదుట రాచుకొనిన పండితుడు “అహం బ్రహ్మాస్మి” అన్నచో ఎంత పిచ్చి మాటయగును.
ఆంజనేయుడు నరరూపమునకే శరణాగతి చేసినాడు
ఆంజనేయుడు శరణాగతి పొందిన శ్రీరాముడు నరరూపమున ఉన్నాడు. శ్రీరాముడు “అహం బ్రహ్మాస్మి” యని అహంకరించిన పరశురాముని గర్వభంగము చేసినాడు. ఆయన ఎట్టి సిద్ధులను ప్రదర్శించ లేదు. సముద్రము దాటుటకు వారధిని కట్టించుకొనెను గాని హనుమంతునివలె ఒక్క గంతులో ఎగిరి దూకలేదు. లక్ష్మణుడు మూర్ఛపోవగా విలపించుచున్నాడే తప్ప హనుమంతుడివలె ఎగిరిపోయి, సంజీవిపర్వతమును తీసుకొని రాలేదు. సీతాదేవికి హనుమంతుడు తన శరీరమును పెంచి తన శక్తిని ప్రదర్శించినట్లు, ఎన్నడునూ ప్రదర్శించలేదు. మరి హనుమంతుడు తన కన్న ఏ సిద్ధులు ఎక్కువ ప్రదర్శించినాడని రామునకు దాసుడయ్యెను? రాముడెప్పుడు ఒక మట్టి పరమాణువు కూడా సృష్టించలేదు. కాని స్వర్గలోకమునే సృష్టించిన విశ్వామిత్రుడు, రాముని పరమాత్మగా ఉపాసించెను. అష్టసిద్ధులను అవలీలగా ప్రదర్శించగలిగిన దండకారణ్య ఋషులందరును పాదచారియై నారచీరెలతో యున్న రాముని మోక్షార్థులై శరణము జొచ్చిరి. దీని తాత్పర్యమేమి? వీరందరును జ్ఞానులు. ఏ అలంకారములు లేని రాజును ధర్మపత్నియగు రాణి గుర్తించినట్లు వీరు పరమాత్మను గుర్తించినారు.

పరమాత్మ మనుష్యశరీరమును ఆశ్రయించి వచ్చుట చేత ఆ మనుష్యశరీరము ఇతర మనుష్యశరీరములవలె ప్రకృతిధర్మములు కలిగి యుండుట చేత అజ్ఞానులు పరమాత్మను గుర్తించుట లేదు. ఎన్నడూ రాజును చూడనివాడు కిరీటాదులు లేక, మామూలు మనిషిగా వచ్చినప్పుడు ఆయనను రాజు అని గుర్తించలేడు కదా. కావున వెనుక జన్మలలో పరమాత్మను గుర్తించనివారు ఈ జన్మలోనూ పరమాత్మను గుర్తించలేరు. ఇంతకు ముందు ఎన్నోసార్లు రాజును చూచిన రాణి మరియు సభాసదులు రాజు కిరీటాదులు లేకుండా వచ్చినను రాజును గుర్తించెదరు. మరియును రాజును చూడనివాడు కిరీటాది అలంకారములు గల పగటివేషధారిని చూచి రాజు అనుకొనును. ఇట్లే అజ్ఞానులు సిద్ధులను, క్షుద్రమాంత్రికులను, అసురులను పరమాత్మగా భావింతురు. సిద్ధులు పరమాత్మ యొక్క స్వరూపలక్షణములైనచో అవి రాక్షసుల యందు ఎట్లు గోచరించును? స్వరూపమును వ్యక్తి నుండి వేరు చేయలేము. గంగడోలు ఆవు యొక్క స్వరూపలక్షణము. ఇది ఏ ఇతర జంతువుకూ రాదు. ఆవుకు ఆభరణముగా ఉన్న మువ్వలదండ గాడిదకును, పందికిని వేయవచ్చును. అంత మాత్రమున గాడిద, పంది ఆవు అగునా?
కావున సిద్ధులు ఆభరణముల వలె తటస్థలక్షణమని నిరూపించబడుచున్నది. పరమాత్మ యొక్క స్వరూపలక్షణము జ్ఞానము, ప్రేమ మొదలగు కల్యాణగుణములు అని “రసో వై సః” “సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ” ఇత్యాది శ్రుతులు చెప్పుచున్నవి. శ్రీరాముని కల్యాణగుణముల చేతనే ఆయనను పరమాత్మగా ఋషులు, దేవతలు సైతము గుర్తించినారు. ఇట్టి కల్యాణగుణములు కలిగి మరియు సిద్ధులు ప్రదర్శించిన కృష్ణుని సైతము పరమాత్మగా గుర్తించినారు. అలంకారములు లేని రాజు రాముడు. అలంకారములు ఉన్న రాజు కృష్ణుడు. అలంకారములున్నా పగటి వేషగాడు రాజు కాదు. కావున అలంకారముల చేతనే గుర్తించరాదని తాత్పర్యము. అలంకారములున్నవి కాన రాజును రాజు కాదనరాదు. కావున సిద్ధులు ప్రదర్శించిన కారణమున వారు రాక్షసులు కాదు. సిద్ధులను అవతారము ప్రదర్శించును, అసురుడూ ప్రదర్శించును. సిద్ధులచేత వారిరువురుని వేరు చేయలేరు. కావున నరావతారములో వచ్చిన పరమాత్మ యొక్క స్వరూపము అగు జ్ఞాన, ప్రేమలు పలచని మేలిముసుగు గుండా కనపడు మనిషిరూపము వలె బయటకు స్పష్టమగును. వాటి చేత పరమాత్మను గుర్తించవలెను కాని మేలిముసుగులో ఉన్న వ్యక్తి యొక్క ఆభరణములను చూచి కాదు. మేలిముసుగులో ఉన్న వ్యక్తి యొక్క రూపము బయటకు కనపడుచున్ననూ పూర్వపరిచయములేని అజ్ఞానులు రాజును గుర్తించలేరు.
అట్లే నరాకారమున ఉన్న పరమాత్మను పూర్వజన్మలలో మహాభక్తులుగా ఉన్నవారే గుర్తింతురు. ఐతే ఈ మేలిముసుగును తీసివేసి స్పష్టముగా ఏల కనిపించరాదు? గొర్రెలమందలో సింహము దూరినచో గొర్రెలన్నియు పరుగెత్తి పోవును. సింహము తన కంఠస్వరమున ఆప్యాయతతో పిలచిననూ అవి గుండెలు పగిలి చచ్చును. అట్లే కోటానుకోట్ల సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సుగల మహాశక్తిస్వరూపుడగు పరమాత్మ ప్రత్యక్షమైనచో సూర్యుని ఎండకు మంచు వలె ఈ జగత్తు కరిగి, లయించిపోవును. అర్జునుడు సర్వసృష్టిలో మహావీరుడు. మహా ధైర్యశాలి. అటువంటి వాడే పరమాత్మ దివ్యనేత్రముల నిచ్చినను, ఆయన నిజస్వరూపమును చూడలేక గడగడ వణకుచూ, మరల మేలిముసుగు వేసుకొమ్మని ప్రార్థించినాడు. పార్థుని ధైర్యములో పరమాణువు భాగమైన ధైర్యము కూడ ఏ జీవునకూ లేదు. కావున పరమాత్మ దట్టమైన ముసుగు కప్పుకొని అవతరించక తప్పదు. తన శక్తి యొక్క కిరణములలో ఒక పరమాణుభాగమును అప్పుడప్పుడు బయట పెట్టుచుండును. దానికే జీవుడు తట్టుకొనలేడు. ఆయన జ్ఞానశక్తికి, ప్రేమశక్తికి కూడా జీవుడు తట్టుకొనలేడు. ఆయన తన జ్ఞానమును పరిపూర్ణముగా ప్రకటించినచో బుర్ర బ్రద్దలగును. ఆయన ప్రేమను నీవు పూర్తిగా తెలుసుకొన్నచో ఆనందముతో నీ హృదయము ముక్కలగును. వస్తుస్థితి అట్లున్నది. మనమేమి చేయగలము.
★ ★ ★ ★ ★