07 Oct 2025
Updated with Part-2 on 08 Oct 2025
Part-1
[మహాశివరాత్రి సందేశము] జ్ఞానము బ్రహ్మ, ప్రేమ విష్ణువు, ఆనందము శివుడు. ఇదే త్రిమూర్తితత్త్వమైన వైదిక కళ్యాణగుణ సంపద. ఈ మూడు గుణములచేత త్రిమూర్తిస్వరూపుడైన గురుదత్తుని సులభముగా గుర్తించవచ్చును. కాని పామరులు, అష్టసిద్ధులగు మహిమల ప్రదర్శనము ద్వారా గురువుగా, దైవముగా గుర్తించుచున్నారు. ఈ పామరజనులు శిశువుల వంటివారు. ఎవడు కిరీటము ధరించి రాజువేషములో వచ్చునో, వాడినే రాజుగా తలచు అజ్ఞానులు. ఈ సిద్ధులు కొన్ని యంత్ర, తంత్ర, మంత్రసాధనల ద్వారా ఎవరైనను సాధించుకొన వచ్చును. అనగా ఎవడైనను రాజు వేషమును వేయవచ్చును. కావున ఇట్టి పామరులు అట్టి క్షుద్రమాంత్రికుల, రాక్షసులశిష్యులుగా మారి, గుడ్డివానిని గుడ్డివారు పట్టుకొని వానితో సహా నిత్య నరకమను కూపములో పడుచున్నారు. వాడు కొన్ని సిద్ధులను సంపాదించినవాడే కాని జ్ఞానాంధుడు. ఇట్టి గురువులే "బాధక గురువులు" ఈ బాధిత గురువులు అంతరార్థమును వివరించి జ్ఞానమార్గములో నడిపించలేనివారు. వీరు కేవలము బాహ్యదృష్టితో భౌతికార్థముతో ద్రవ్యతత్త్వమైన అజ్ఞానాంధకార మార్గములో శిష్యులను నడిపింతురు. వీరు యజ్ఞములను చేయించుటకు, చందాలు వసూలు చేసి ఆ ధనములో 90 శాతము వారు సంగ్రహించి, మిగిలిన 10 శాతమును నేయిగా మార్చి అగ్నిలో దగ్ధము చేయుదురు. ఈ యజ్ఞముల వలన నేటి విజ్ఞానశాస్త్రము ప్రకారముగా వాతావరణ కాలుష్యము పెరిగి అతివృష్టికి, అనావృష్టికి దారి చేయుచున్నది. ఈ గురువులు యజ్ఞములోని అంతరార్థమును వివరించలేరు. ఈ శిష్యులు కూడ వారి వారి లౌకిక కార్యములు నెరవేరుటకు చందాలనిచ్చుచున్నారే గాని విశ్వకళ్యాణమునకు కాదు. ఆ చందాలను వాడు కాజేసి పారిపోవగా ఈ శిష్యులు వానిని పోలీసులకు పట్టించుచున్నారు. వాడు చేసినది అధర్మమే. కానీ వీరు చేసినది అధర్మము కాదా! నాకు కాంట్రాక్టు రావలయునని, పదివేలరూపాయలు చందాగా యిచ్చుచున్నాడు. ఆ వచ్చిన కాంట్రాక్టులో పదిలక్షల ప్రజాధనమును అపహరించుచున్నాడు. వీడు కూడ ప్రజలనుండి చందాలు వసూలు చేసి ధనమును దొంగిలించిన వాడు కాదా! వీరి దొంగతనము నిర్విఘ్నముగా నెరవేరుటకు దైవమునకు పదివేలరూపాయలు లంచము నిచ్చినాడు. వానిని పోలీసులు పట్టుకొన్న వీరికి పోలీసులకన్న కఠినులగు యమభటులు పట్టుకొందురు. నారాయణుని పాలనలో ఎవరును దేనిని తప్పించుకొనజాలరు. మనుష్యజన్మ కడు దుర్లభము. మనుష్యజన్మ వచ్చినను భగవంతుని చేరయలయునని శ్రద్ధ ఉండుట ఇంకనూ దుర్లభము. ఈ రెండు ఉన్ననూ, మూడవది మరీ మరీ దుర్లభము. అది ఏమనగా నారాయణుడే నరరూపములో వచ్చి గురువుగా లభించుట. అట్టి పురుషునే ‘అవతారపురుషుడు’, ‘మహాపురుషుడు’ లేక ‘పురుషోత్తముడు’ అందురు.
"మనుష్యత్వం ముముక్షత్వం, మహాపురుష సంశ్రయః" అనగా మనుష్యజన్మ దుర్లభము. మోక్షాసక్తి మరీ దుర్లభము. మహాపురుషుడు లభించుట మరీ మరీ దుర్లభము అని అర్థము. ఇట్టి బాధక గురువులు జ్ఞానతత్త్వము లేని వారైనందున జ్ఞానయజ్ఞమును చేయలేక కేవలము ద్రవ్యయజ్ఞములతో గురువులుగా కీర్తి పొందుటకు ప్రయత్నించెదరు. వీరికి అంతర్ముఖదృష్టి లేక కేవలము బాహ్యదృష్టితో ఆడంబరముగా యజ్ఞములు చేయుట, గుడులు ఆశ్రమములు కట్టించుట విచక్షణారహితముగా అన్నదానము చేయుట మొదలగునవి చేయుచుందురు. ఏ విధమైన పనియు చేసి సంపాదించుకొనుటకు చేతగాని, పసి బాలుడు, వృద్ధుడు, వికలాంగుడు మరియు రోగగ్రస్తుడు ఈ నలుగురు మాత్రమే అన్నదానమునకు అర్హులు. కాని ఈనాడు జరుగు అన్నదానములను చూచినచో, కోటీశ్వరులు కూడా వచ్చి, ప్రసాదము తినినగాని వారి పనులు నెరవేరవని తలచి నాలుగు మెతుకులు నంజుకొని మిగిలినది పారవేయగా, ఆ విస్తళ్ళను మురికి కుండీలలో పడవేయగా ఆ ఆహారము వలన రోగకారకములైన అనేక క్రిములు వర్ధిల్లుచున్నవి. చివరకు అన్నదానము రోగములను కలుగచేసి ప్రాణులను హింసించు సూక్ష్మక్రిములగు రాక్షసులకు చేరును. ఈ విధముగా ఈ అంధగురువులు చేయు స్వకీర్తి కామముతో కూడిన ఆడంబరములతో కూడిన బాహ్య భౌతిక దైవకార్యములతో గురువులకు గాని, శిష్యులకు కాని విశ్లేషణ, విచక్షణ లేవు. దీనికి కారణము బ్రహ్మతత్త్వ గుణమగు జ్ఞానము లేకపోవుటయే. ఈ అజ్ఞానము చేత చేయు పనులన్నియు మహాపాపమునకు దారి తీయుచున్నవి. కాన వీరందరును, శాశ్వతనరకమున పడుదురు. "సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి" అని గీత. అనగా ఈ మహా పాపమను సాగరమును దాటదలచినచో, జ్ఞానము అను పడవను ఆశ్రయించుము.
Part-2
గోటిచుట్టుపై రోకటి పోటు అన్నట్లు కొందరు పరమమూర్ఖులు ఒకసారి గురువును ఎన్నుకున్నచో మరల మార్చరాదని వాదించుచున్నారు. దుష్టుడైనచో, భర్తనైనను విడాకులిమ్మని చట్టము ఘోషించుచున్నది. అట్లే ఎదురు మాట్లాడు భార్యను త్యజించమని మనుస్మృతి చెప్పుచున్నది. "సద్య స్త్వప్రియవాదినీమ్" అని మనుస్మృతి. అనగా ప్రేమతో నుండక ద్వేషముతో హింసించుచున్నచో అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తనైనను భార్య, భార్యనైనను భర్త త్యజించమని ధర్మశాస్త్రములు చెప్పుచుండగా నిత్యనరక శాశ్వతహింసకు దారితీయు గురువును ఏల త్యజించరాదు? స్కూలులో ఒక విద్యార్థి చేరినపుడు ఆ స్కూలు టీచరును గురువుగా భావించినాడు. ఆ తరువాత ఆ విద్యార్థి కాలేజిలో చేరినపుడు కాలేజి లెక్చరరును గురువుగా భావించుచున్నాడు. ఆ తర్వాత యూనివర్సిటిలో చేరినపుడు అచ్చటి ప్రొఫెసరును గురువుగా భావించుచున్నాడు. గురువును త్యజించరాదని, నేను గురువుగా స్వీకరించిన స్కూలు టీచరును వదిలిపెట్టనని, కాలేజి లెక్చరరు అగు మరియొక గురువును స్వీకరించనని కాలేజీలో చేరనివాడు ఎంత మూర్ఖుడో తన సాధన యొక్క దశ వృద్ధి అగుచున్నకొలది గురువులకు గురువైన గురుదత్తుని గురువుగా స్వీకరించక మొదట ఓనమాలు దిద్దిపెట్టిన గురువునే పట్టుకొని వేళ్ళాడు మూర్ఖులను గురించి ఏమందుము? గురు శబ్దము కేవలము పరబ్రహ్మమునందే వర్తించును. ఏలయనగా జ్ఞానము చేత అజ్ఞానాంధకారమును పోగొట్టువాడే గురువు శబ్దమునకు అర్థము. జ్ఞానము స్వరూపముగా కలవాడు పరబ్రహ్మమని "సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ" అని శ్రుతి చెప్పుచున్నది. కావున గురుశబ్దము పరబ్రహ్మమునకే వర్తించును. సృష్టి, స్థితి, లయ కారకుడగు దత్తుడే పరబ్రహ్మము కావున దత్తుడు ఒక్కడే గురుశబ్దముతో పిలువబడవలసిన వాడు. “గురువే బ్రహ్మము”, “బ్రహ్మమే గురువు”. ఈ రెండు వాక్యములకు తేడా కలదు. “కఠినముగ ఉన్నది వజ్రము”. “వజ్రము కఠినముగా ఉన్నది” అని రెండు వాక్యములలో ఉన్న భేదము గ్రహించిన చాలును! మొదటివాక్యము ప్రకారము కఠినముగా ఉన్న రాయి కూడా వజ్రము కావలసివచ్చును. రెండవవాక్యము ప్రకారము వజ్రము కూడ కఠినముగా ఉండును. అనగా ప్రతిగురువు దత్తుడు కాడు. కాని దత్తుడు మాత్రము గురువే. అనగా నరరూపములో ఉన్న కృష్ణుడు నారాయణుడే. కాని నరరూపములో ఉన్న ప్రతి గోపాలుడు మాధవుడు కాదు. కావున గురువును ఎన్నుకొనునప్పుడే ఎంతో వివేకముతో ఎన్నుకొనవలెను. అనగా నారాయణ లక్షణములను తెలిసి నరరూపములో వున్న నారాయణుని గురువుగా ఎన్నుకొనవలెను. అంతే కాని కంటికి కనిపించిన ప్రతి శుంఠను కూడా గురువు, స్వామీ అని పిలచుట పరిపాటి అయినది.
ఈనాడు రిక్షావాడు కూడా గురువు గారు బండి ఎక్కుతారా? అని అడుగుచున్నాడు. అట్లే నల్లవస్త్రములను ధరించి నలుబది రోజులు కూడా సిగిరెట్లు, సారాయి వదలలేనివానిని అయ్యప్పగా, స్వామిగా పిలుచుచున్నారు. కావున నరరూపమున ఉన్న గురుదత్తుని మాత్రమే గురువుగా ఎన్నుకొనవలెను. నీవు ఆయనను వెతుకనక్కరలేదు. ఆయనపై విశ్వాసముతో ఆరాధించుచుండుము. ఆయన ఒకే సమయమున ఎన్నో రూపముల నెత్తగలడు. ఆయనయే స్వయముగా మీ ఇంటికి వచ్చును. ఆయనను గుర్తించి గురువుగా స్వీకరించిన తరువాత వదలిపెట్టకుము అనియే ఆ మాటకు అర్థము. ఏలననగా ఆయన బహుమాయా ప్రదర్శకుడు. ఆయన మాయలో పడి విడిచివేయుదువేమో అని ఆ వాక్యము నిన్ను హెచ్చరించుచున్నది. గురువును వదలకుము అన్న వాక్యమును విచారించుము. “గురుస్సాక్షాత్ పరబ్రహ్మ”. గురువు అనగా శ్రీదత్తుడే. కావున ఈ వాక్యమునకు, చివరకు ఏమి అర్థము సిద్ధించినది? "శ్రీ దత్తుని వదలకుము" అని అర్థము సిద్ధించినది. ఈ మాట చెప్పుటకు కారణమేమనగా, ఆయన మాయను చూపి జారిపోవును. కావున ఈ విధముగా శబ్దములను, వాక్యములను, క్షుణ్ణముగా చర్చించి సత్యమును తెలుసుకొనుటయే "సదసద్వివేకము" అనబడును.
సాధకులకు కావలసిన నాలుగు గుణములలో అనగా సాధన చతుష్టయ సంపత్తిలో సదసద్వివేకము ఒక గుణమని శంకరులు చెప్పియున్నారు. 1) నిత్యానిత్య వస్తువివేకము; 2) ఇహ అముత్ర ఫలభోగ విరాగము; 3) శమాది షట్క సంపత్తిలో శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షుత్వము ఇవియే సాధన చతుష్టయ సంపత్తి. మహాశివరాత్రి (1.3.2003) శ్రీ దత్తభగవానులు నిద్ర మేల్కొని ఈ పర్వదినాన సత్యనిష్ఠతో నాకు అభిషేకము ఎవరు చేస్తున్నాడని చూచారట. అప్పుడు ఆ దివ్యదృష్టిలో లక్ష్మణ్ కనిపించాడు. వెంటనే స్వామి నోట వెలువడిన గీతము ఇది
Be a stone, oh Lakshmana!
In Devagadh when I go there
I grant the desires of devotees
You are the gem of devotees
Be a stone, yes in that devagadh
But not the inert stone, you think
Only sinners are born as stones
You are the crystal of devotion
Devoid of any trace of sin
Yet, your disere is not refused
Be a devotee with stony faith
Be a pious stone of sahya hill
With firm knowledge and devotion
Adisesha is firm with earth on head
He grants firmness, yoga says so,
You are born with a radition of him
Your desire is quite obvious
★ ★ ★ ★ ★