
10 Dec 2025
[18.08.2004, సా|| 05:30 లకు] నేను (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి), నా శ్రీమతి, శేషమ్మగారు, లలితగారు కలసి సత్సంగము కోసం శ్రీదత్తస్వామి దర్శనానికి సత్యనారాయణపురం వెళ్ళాము. స్వామి స్నానం చేసి వచ్చి భీమశంకరముగారి ఇంట్లో మధ్యగదిలో కుర్చీలో ఆసీనులైనారు. మేము కూడ కూర్చున్నాము. నేను, నాశ్రీమతి స్వామి పాదసేవ చేసుకున్నాము. స్వామికి అల్పాహారముగా దోసెలు సమర్పించినది నా శ్రీమతి. శ్రుతకీర్తి స్వామికై సమర్పించిన ధోవతి, టవలు, గురుదక్షిణలు స్వామికి సమర్పించాము. మాదంపతుల గురుదక్షిణ కూడ స్వామికి సమర్పించాము. తరువాత పాలుకాచి స్వామికి అందించినది నాశ్రీమతి. ఇది పూర్తి అయిన తరువాత స్వామి ప్రవచనం చేస్తూ, తమ దివ్యసందేశం ఇలా అందించారు. ఇవి ముఖ్యాంశములు:
1) నా అవతారము కృష్ణావతారము కనుక నేను చెప్పినట్లు చేయండి అంతే గాని నేను చేసినట్లు చేయరాదు. ఈ అవతారములో త్రిగుణాలు అనుక్షణం ఉంటాయి. కనక మీరు ఏక్షణంలో నైనా సందేహించి జారిపోవచ్చు. కనుక జాగ్రత్త.
2) నరావతారాన్ని గుర్తించటమే చాలా కష్టము. గుర్తించిన నరావతారాన్ని చేయిజార్చుకోవటం చాలా సులభము. అందివచ్చిన నిధిని పోగొట్టుకున్నవాడు ఎంతటి దురదృష్టవంతుడో చూడండి.
3) నా అవతార కార్యక్రమమును శివరాత్రి నాడు హైదరాబాదులో బాలకృష్ణమూర్తి గారి ఇంట్లో ప్రారంభించాను. వీళ్ళు ఆ కార్యక్రమమునకు సహకరించి సాధన చేసారు. ఈ నా కార్యములో సహకరించినవాడు ఈయన అంటూ నా భుజం మీద తట్టారు స్వామి.
4) బాలకృష్ణమూర్తి నరావతారాన్ని గుర్తించి సేవించాడు. అందుకే ఈయనను హనుమంతుడు అన్నాను.
5) హనుమంతుడికి ఒక చిన్న దోషము ఉన్నది. ఏమిటది? తాను శివావతారమని, నా అంతటి వాడనని మరచిపోవటం. ఆయనకు ఈ విషయం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మరి ఆయనకు ఋషుల శాపమున్నది గదా.
6) ఈయన, “నాకు బ్రహ్మలోకం ఇవ్వండి స్వామీ” అని ప్రార్థిస్తూ ఉంటాడు. ఈయనకు నాకు ఏ తేడా లేదు అని ఎన్నోసార్లు చెప్పాను. నాతో సమానంగా ఉన్నవాడికి, నేను బ్రహ్మలోకము ఇవ్వటమేమిటి? అని నవ్వారు స్వామి.
7) లౌకిక విషయాలను తగ్గించుకొని, సత్సంగములో ఉండండి అన్నారు.
8) స్వామికి కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము చేయండి అంతకుమించినదేదీ లేదు అన్నారు స్వామి. ధన్యులము మేము. లౌకికవిషయ సంగము ఎంత ప్రమాదకరమో, ఎంత విషతుల్యమో 2002వ సంవత్సరంలో విస్పష్టంగా స్వామి వివరించారు. మనము పఠించి, అనుసరించి, పాటించి ధన్యులము కావాలి. లౌకిక విషయమనే దుస్సంగాన్ని త్యజించాలి. సదా సత్సంగములోనే ఉండాలి.
[16.08.2004 రాత్రి 08:30]
స్వామి ఇలా వచించారు.
i) విశ్వాసం సడలించుకోకండి.
ii) పట్టిన పట్టు ఎట్లాగో పట్టారు జారవిడచుకోకండి.
iii) లౌకిక సంగము తగ్గించుకోండి.
iv) మీరే సత్యనారాయణపురం రండి అని అన్నారు స్వామి.
[11-10-2003]
వచ్చే జన్మలో ఈభక్తులు ఎక్కడ జన్మించేది స్వామి సెలవిచ్చారు. బాలకృష్ణమూర్తి - మహారాష్ట్ర దేవగడ్‌లో ‘జ్ఞానేశ్వరుడు’ అనే నామధేయముతో, భవాని - మహారాష్ట్ర దేవగడ్‌లో ‘శ్రుతి’ అనే నామధేయములతో పుడతారు. స్వామి మహారాష్ట్ర దేవగడ్‌లో ఈ దంపతులకు ‘కృష్ణదేవ్’ అనే నామధేయంతో పుత్రుడుగా జన్మించి, సంన్యసించి ‘శ్రీకృష్ణ సరస్వతి’ అని వ్యవహరించబడతారు. అజయ్ మహారాష్ట్రలో ఈ దంపతులకు ‘శివదేవ్’ అనే నామధేయముతో జన్మించగా, ఫణి మహారాష్ట్రలో ఈ దంపతులకు ‘బలరామదేవ్’ అనే నామధేయముతో జన్మిస్తారు. ఆ పైజన్మ వారణాశిలో అని భవిష్యదవతార విషయములు వెల్లడించారు స్వామి.
★ ★ ★ ★ ★