home
Shri Datta Swami

 18 Oct 2025

 

బహూనాం జన్మనామన్తే - గీతా శ్లోక వివరణ

[27-01-2003] "బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః" అని గీత. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ నరాకారము పరబ్రహ్మమని విశ్వసించు నిశ్చల జ్ఞానము, అనేక జన్మల తపస్సాధన వలన అసూయను పోగొట్టు కొని అనసూయా తత్త్వమును పొందిన ఒకానొక అతిదుర్లభ జీవునకే లభించునని అర్థము. "నాహం ప్రకాశః సర్వస్య యోగ మాయా సమావృతః" అని గీత. నేను మాయచే కప్పబడి యున్నందున అందరు గ్రహించలేరని అర్థము. ఒక సింహము గొర్రెలలో కలసి పోయి ఆత్మీయుడుగా ఆ గొర్రెలతో మెలుగుచు కొన్ని గొర్రెలకు తండ్రిగాను, కొన్ని గొర్రెలకు పుత్రునిగాను, మరి కొన్నింటికి సోదరునిగాను, కొన్నింటికి భర్తగను, మరి కొన్నింటికి ప్రియునిగాను ఆయా గొర్రెల అభీష్టముననుసరించి ప్రవర్తించి దగ్గరకు తీసుకొని జ్ఞాన, భక్తులను గురించి బోధించవలసిన అవసరము వచ్చినది. ఇది సింహము అని ఏ మాత్రము బయటపడినను తనతో గల ఆత్మీయ బంధము చెదరిపోవును. ఏలననగా తండ్రి కొడుకు మొదలగు బంధములు జీవుల మధ్య నుండు బంధములు. ఆ బంధములలో స్వామిని ఆరాధించవలయునన్నచో స్వామి ఒక జీవుని వేషములో జీవుని ప్రవర్తననే అనుసరించి యుండవలయును. అందువలన ఆ సింహము పూర్తిగా గొర్రె తోలు కప్పుకొని గొర్రె ఆకారమున, గొర్రె కంఠస్వరముతో గొర్రెల మధ్యకు రావలయును. అప్పుడే గొర్రెలు స్వామితో లౌకిక బంధముతో ఆనందించగలవు. కావున గొర్రెలకు తాను సింహమన్న సత్యజ్ఞానము తెలియకుండా వేషములో స్వామివలె నటించుటయే మాయ. ఈ మాయతోనే స్వామి అవతరించవలెను. “సంభవామి ఆత్మమాయయా” అని గీత. అనగా నా మాయను ఆధారము చేసుకొని నేను అవతరించెదను అని అర్థము. ఈ నటన రూపమగు మాయ వలన గొర్రెలు తాము కూడా గొర్రెలని భావించి పరిహాసముతో, సరసోక్తులతో లౌకిక బంధములతో స్వామితో క్రీడించగలవు. అవి క్రీడించిన మాత్రమే స్వామి వానితో క్రీడించగలడు. కావున స్వామి ఈ ప్రయోజనము కొరకే స్వామి తన మాయా నటనముతో వాటికి తాను సింహము కాదన్న అజ్ఞానమును కలిగించుచున్నాడు. కాని ఈ అజ్ఞానము వాటికి దీర్ఘకాలమున్నచో తన మీద నిర్లక్ష్యము కలగి తనను అవమానించుచు తాను చేయు బోధలను శ్రద్ధతో వినరు. అంతే తప్ప మానావమానములకు అతీతుడగు స్వామి వారు చేయు అవమానమునకు ఏ మాత్రము బాధపడడు.

అంతే కాక పైలోకమున స్వామికి అవమానము దుర్లభము కావున మానము కన్నను అవమానమునకు ఎక్కువ ఆనందించును. కావున భగవత్‌ అవమానమునకు ఎప్పుడును ఆగ్రహించడు. ఇచ్చట మానావమానముల ప్రశ్న కాదు. నిర్లక్ష్యముతో తాను చెప్పునది వినకపోవుట వలన వారు ఉద్ధరింపబడరు. తాను వచ్చిన ప్రధాన కార్యము వారిని ఉద్ధరించుటయే. కావున అట్టి సమయములలో చిన్నచిన్న సిద్ధులను చూపి అనగా తన కంఠ స్వరమును తన సహజమగు సింహ కంఠమును కొంత చేర్చి తాను సింహమన్న జ్ఞానము ఒక్క క్షణకాలము కల్గించును. పూర్తిగా వేషము తీసి తాను సింహమని చూపినచో గొర్రెలు కనుచూపు మేరలో ఉండవు. మరల ఆ సింహము గొర్రెగా నటించిననూ దగ్గరకు రావు. వచ్చిననూ భయముతో బెదురు చుండునే తప్ప వాటికి ఇష్టమైన లౌకిక బంధములో సహజ స్థితిలో రమించ జాలవు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch