
27 Oct 2025
గమనిక: ఈ భగవత్ సందేశం పండితులు మరియు మేధావుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.
Updated with Part-2 on 28 Oct 2025
Part-1
[21-12-2002] శ్రీ దత్త భగవానుడు శంకరులుగా అవతరించినపుడు ఈ దేశమంతయును నాస్తికులతో నిండియుండెను. ఈ నాస్తికులు రెండు విధములుగా యుండిరి. మొదటి విధము వారు పూర్వమీమాంసకులు. వీరు యజ్ఞయాగాదులను మాత్రమే చేయుచు భగవంతుడులేడని వాదించుచుండిరి. వీరి మతము ప్రకారముగా "దేవో న కశ్చిత్ భువనస్య కర్తా" "కర్మానురూపాణి పురఃఫలాని" అనగా ఈ జగత్తు లేక ఈ శంకరుడును లేడు లేడు. వేదములో చెప్పబడిన యజ్ఞములను చేసినచో మనము ఇహలోకములోను పరలోకములోను సుఖములను పొందవచ్చును. దీనినే కర్మమార్గము లేక పూర్వ మీమాంసామతము అందురు. ఈ మతమునకు అప్పుడు మూల ప్రవక్తగా మండనమిశ్రుడను పండితుడు కాశ్మీరమున ఉండెడివాడు. ఈ యజ్ఞములలో అగ్నికుండములో నేతి పదార్థములు ధారలు ధారలుగా పోసి హుతము చేయుచు సాధు ప్రాణులైన మేకలను చంపుచు వేదాధ్యయనము, యజ్ఞాచరణము వలన అహంకారము నెత్తికెక్కి ఉండెడివారు. అప్పుడు శ్రీ దత్తుడు బుద్ధ రూపమున వచ్చి యజ్ఞములను మాన్పించెను. ప్రాణి హింస నిషేధించెను. ఆకలి గొన్న ప్రాణుల యొక్క జఠరాగ్ని కుండములందు హుతము చేయవలసిన శ్రేష్ఠమైన ఘృతాహారమును అగ్నియందు దగ్ధము చేయు దురాచారమును ఖండించెను.
కరుణ తత్త్వమును బోధించి ఆకలితో మాడు సాధు ప్రాణులకు ఆహారమును అందించు కర్మయే యజ్ఞమని బోధించెను. జ్ఞానమను అగ్నిలో కోరికలు అను నేతిని హుతము చేసి మూర్ఖత్వము అను పశువును వధించమని "కామ ఆజ్యం మన్యుః పశుః" అను శ్రుతి తత్త్వమును భోధించెను. వేదములన్నియు యజ్ఞములను గురించియే చెప్పుచున్నవి కావున యజ్ఞములను చేయుట అవసరమని పూర్వ మీమాంసకులు వాదించగా, వేదములను మనుష్యులగు పురుషులు చెప్పినారనియు, అవి పౌరుషేయములనియు బుద్ధుడు వాని యొక్క ప్రామాణ్యము ఖండించెననియు బౌద్ధులు చెప్పుచున్నారు. కాని ఇది నిజము కానే కాదు. బుద్ధుడు యజ్ఞములను, పశువధలను వేద ప్రమాణము చేతనే ఖండించినాడు. ఇది ఈనాడు వరకును ఎవరికి తెలియని సత్యము. వేద వాదులగు పూర్వ మీమాంసకులను ఖండించుటకు వారికి ప్రమాణమగు వేదమునే ఆధారముగా తీసుకొనవలయును. ఆహారమైన ఘృతమును దగ్ధము చేసి వ్యర్థము చేయరాదనుటకు "అన్నం న పరిచక్షీత" అను శ్రుతిని ప్రమాణముగా తీసుకొనినాడు. దీని అర్థము మనము ఆహారమును వ్యర్థము చేయరాదనియే. అట్లే పశువధను మాన్పించుటకు బ్రహ్మయజ్ఞ ప్రకరణములోని "మన్యుః పశుః" అను శ్రుతిని తీసుకొన్నాడు. అనగా అజ్ఞానముతో కూడిన మూర్ఖత్వమను పశువును వధించవలయునని అర్థము. బుద్ధుడు ఆనాడు బోధించిన సిద్ధాంతమును బౌద్ధులు పూర్తిగా విడచి పెట్టగా అది అదృశ్యమైనది. బుద్ధుడు వేదములను పౌరుషేయములు అన్నాడు. అనగా పురుష విరచితములు. కాని పురుషుడనగా ఎవరు? జీవుడు కాదు.

పురుషుడనగా పురుషసూక్త ప్రకారముగా పరమాత్మయని అర్థము. కావున పౌరుషేయము అనగా పరమాత్మ రచించినది అని అర్థము. పూర్వ మీమాంసకులు వేదములను "అపౌరుషేయములు" అన్నారు. అనగా పురుషరచితములు కావు అని అర్థము. అనగా పరమాత్మ రచించలేదనియే అర్థము తీసుకొనవలెను. ఏలననగా వారి మతము ప్రకారముగా పరమాత్మ లేడు గదా! "దేవో న కశ్చిత్" అని చెప్పుచున్నారు గదా! కాని దురదృష్టవశాత్తు ఈనాడు మన పండితులు అర్థము చేసుకొన్నది మరియొకటి అయినది. పురుషుడు అను శబ్దమునకు జీవుడు అను అర్థము కూడా కలదు. "అన్నాత్ పురుషః" అని శ్రుతి కదా! కావున మన పండితులు ఇప్పుడు చెప్పునది ఏమనగా వేదములు పౌరుషేయములు అని బుద్ధుడు చెప్పినప్పుడు వేదములను మానవులు వ్రాసినారనియే బుద్ధుడు చెప్పినాడని చెప్పుచున్నారు. ఇదియే నిజమైనచో వేదములు అపౌరుషేయములు అని వేదవాదులు చెప్పినారు గదా! అనగా వేదములు మానవులు రచించలేదని వేదవాదులు చెప్పినట్లు అర్థము వచ్చును. అనగా వేదములను పరమాత్మ వ్రాసినాడని పూర్వ మీమాంసకులు చెప్పినట్లును కాదు మానవులు వ్రాసినారని బుద్ధుడు ఖండించినట్లు అర్ధము వచ్చుచున్నది. ఇదే నిజమైనచో పూర్వ మీమాంసకులు పరమాత్మను అంగీకరించినట్లు అర్థమగుచున్నది. కాని పూర్వ మీమాంసకులు పరమాత్మను నిరాకరించినారు కదా! కావున జరిగినది ఒకటి, మన పండితులు తీసిన అర్థము మరియొకటి. కావున అసలు జరిగినది ఏమి? అక్కడ ‘పురుష’ శబ్దమునకు పరమాత్మ అని అర్థము తీసుకొనవలయును. ఇప్పుడు అర్థము సరిపోవును. వేదములు అపౌరుషేయములు అని పూర్వ మీమాంసకులు అన్నారు. అనగా పురుషుడైన పరమాత్మ వ్రాసినది కావు అని అర్థము. వారు నాస్తికులు కావున ఈ అర్థము సరిపోవును.
Part-2
శ్రీ విష్ణుదత్తుని నరావతరమైన బుద్ధుడు పురుషుడు అనగా భగవంతుడు ఉన్నాడని వాదించినాడు. కావుననే వేదములను పౌరుషేయములు అన్నాడు. అనగా పురుషుడైన భగవంతుడే వ్రాసినవి అని బుద్ధుడు వాదించినాడు. ఇందుకు పూర్తిగా భిన్నముగా ఈనాటి పండితులు తలచుచున్నారు. మన పండితుల సమన్వయము ప్రకారము వేదములు పరమాత్మ రచితములని పూర్వమీమాంసకులు చెప్పినట్లును, కాదు మానవ రచితములని బుద్ధుడు చెప్పినట్లును తలచుచున్నారు. పగలును రాత్రిగను, రాత్రిని పగలుగను తలచుచున్నారు. పూర్వ మీమాంసకులను ఆస్తికులుగాను, బుద్ధుని నాస్తికునిగాను మార్చినారు. ఇట్లు ప్రతి విషయమును విపరీతార్థముగా, వ్యతిరేకార్థముగా సమన్వయించి మిడిమిడి జ్ఞానముగల పండిత మన్యులు సత్యమైన సత్సంప్రదాయములను దురాచారములుగా మార్చినారు. వీరు ప్రాచీన ఋషులు కారు. మధ్యకాలపు అజ్ఞాన దురహంకార మిశ్రమములగు పండిత మన్యులు కావున నాస్తికులైన పూర్వ మీమాంసకులను ఖండించి, ఆస్తికుడైన బుద్ధుడు, యజ్ఞములోని అంతరార్థమును వివరించినాడు. బుద్ధుని అవతార సమాప్తి అనంతరము బౌద్ధులుగా మారిన ఈ పూర్వ మీమాంసకులే బుద్ధుని మతమును వక్రీకరించినారు. ఊహాతీతుడైన పరమాత్మ వాక్కులకు అందడు. పరమాత్మ విషయములో మౌనమును దాల్చిన బుద్ధుని యొక్క మౌనమునకు అర్థము బుద్ధుడు దేవుడు లేడని చెప్పినాడు అని వక్రీకరించి పురుష శబ్దమునకు జీవుడని అర్ధమము చెప్పి, వేదములు పౌరుషేయములని బుద్ధుడు చెప్పిన దానికి వేదములు మానవ రచితములని బుద్ధుడన్నాడని అనగా బుద్ధుడు మాధవుని అంగీకరించలేదని బౌద్ధులు ప్రచారము చేసినారు. కాని విచిత్రమేమనగా ఆ బుద్ధుడే మాధవుని యొక్క అవతారము.
బుద్ధుని తదనంతరము బౌద్ధులుగా మారిన పూర్వ మీమాంసకులతోను, బౌద్ధమతము స్వీకరించగా మిగిలిపోయిన పూర్వ మీమాంసకులతోను భారతదేశము నిండింది. అనగా బౌద్ధమతము స్వీకరించినను, మరల వారి ముందున్న పూర్వ మీమాంసా తత్త్వములోకే వచ్చినారు. అట్లు ఉభయులు నాస్తికులైనారు. ఈ సమయమున సాత్త్వికమైన విష్ణుదత్త తత్త్వమునకు బదులు తీవ్రమైన శివదత్త తత్త్వము శంకరులుగా అవతరించినది. శంకరులే ఒకవైపు బౌద్ధులను, మరియొక వైపు పూర్వ మీమాంసకులను ఖండించినారు. వాదమును ఖండించినపుడు ఎంతో పరిపక్వమైన సత్త్వగుణము కలవాడు కాని తన ఓటమిని అంగీకరించి, ఎదుటి వాని మతమును అంగీకరించడు. మండనమిశ్రుడు పరమ సాత్త్వికుడు. కావున తన ఓటమిని అంగీకరించి శంకరులకు శిష్యుడైయ్యెను. ఇటువంటి తత్త్వము మానవులలో కోటాను కోట్లలో ఏ ఒక్కనికే ఉండును.
ఏ జీవుడు తన ఓటమిని అంగీకరించుటకు ఇష్టపడడు. దానికి కారణము 'అహంకారము'. పరమతమును స్వీకరించి ఎదుటి వాని గొప్పతనమును అంగీకరించడు. దానికి కారణము 'అసూయ'. ఈ అహంకారము, అసూయ లేనివారే 'అత్రి అనసూయలు'. అత్రి అనగా త్రిగుణములకు సంబంధించిన మూడు అహంకారములు లేని వాడని అర్థము. అనసూయ అనగా అసూయ లేనిది. అహంకారమును అసూయను పూర్తిగా నిర్మూలించుకున్న జీవులే అత్రి అనసూయలు అనబడుదురు. అట్టి వారికే దత్తుడు చిక్కును. మండన మిశ్రుడు మారిననూ, అసూయ అహంకారములుగల మిగిలినవారు అహంకారముతో తమ ఓటమిని అంగీకరించక అసూయతో శంకరుల గొప్పతనమును సహించలేక శంకరుల శిష్యులగుటకు అంగీకరించలేదు. తన మతము సత్యము కానిచో ఓటమిని అంగీకరించ వలయుననియు, పరమతము సమ్మతమైనచో అసూయను విడచి స్వీకరించ వలయుననియు వారికి బోధించుటకు శ్రీ దత్తుడు ద్విపాత్రభినయముచేయుచు ఒక నాటకమును ఆడినాడు. శివదత్తుడుగు శంకరుడు కూడా శ్రీ దత్తుడే కదా! శంకరుల వేషములో యున్న శ్రీ దత్తుడు తనకు కులబేధమను అజ్ఞానము ఉన్నట్లు నటించినాడు. ఈ దత్తుడే చండాల వేషమున ఎదురుగ వచ్చినాడు. అప్పుడు శంకరుల పాత్రలో యున్న దత్తుడు ఒక అజ్ఞానిగా నటించుచూ "ఓ చండాలా! పక్కకు పో" అని వచించినాడు. అప్పుడు చండాల వేషములో ఉన్న శ్రీ దత్తుడు "సర్వ జీవులకు ఒకే తత్త్వముగా యున్న చైతన్యమైన ఆత్మనా? లేక సర్వ జీవ దేహములందు ఒకే పంచభూతములుగా కలిగిన దేహమునా? పొమ్మనుచున్నారు?” అని ప్రశ్నించినాడు. ఎదుటివాడు చండాలుడైనను వాని మతము సరియైనచో అసూయను వదలి, వాని మతమును స్వీకరించి తాను బ్రాహ్మణుడైనను, తన మతము సరిగానిచో తెలుసుకొని తన అహంకారమును అణగ త్రొక్కి చండాలుని పాదములపై పడినట్లు నటించినాడు శంకరుడు. శంకరులకు ఆ మాత్రపు చిన్న విషయము తెలియదా? ఈ నాటకములో బోధించినది ఏమి? తన మతము బ్రాహ్మణుని వలె పరిశుద్ధముగా కనపడినను, అది తప్పుగా వాదములో నిరూపించబడినచో ఎదుటివాని మతము చండాలునివలె నీచముగా తోచినప్పటికి, అట్టి స్వపర భావములను వదలి ఇష్టమైనను స్వమతమును వదలి ఇష్టము కాకున్నను, సత్యమైనచో పరమతమును స్వీకరించవలయునని వాదములోబడినను పరమతమైన శంకరమతమును స్వీకరించుటకు ఇష్టపడని మొండివారికి బోధించుటయే.
★ ★ ★ ★ ★