
07 Dec 2025
[26.02.2002 రాత్రి]
నాయనా శ్రద్ధగా విను. పూర్వజన్మలో నీవు విష్ణుదత్తుడవు. ఈమె నీ సతీమణి సుశీలమ్మ సోమిదమ్మ. మీకు సాక్షాత్కారము లభించిన సమయములో శ్రీదత్తుడనై నేను –“విష్ణుదత్తా! నీ తపోశక్తి వృథా పోరాదు. నీవు నా కార్యములో పాల్గోని నాసేవ చేయవలెనని ఆజ్ఞ ఇచ్చియుంటిని. మీదంపతులు ఇరువురు ఈ జన్మలో నా కార్యము చేయుటకు నిర్ణయింపబడినారు. కనుక నేను ఉద్యోగము సహితము మానుకొని మొదటిసారి శివరాత్రి నాడు మీ ఇంటికి వచ్చి, మీ వెంటబడి ఎన్నో సద్విషయములను బోధించి మిమ్ము నావైపునకు త్రిప్పుకొనుటకు ఎంతో శ్రమ చేయవలసివచ్చినది. మనకున్న జపాలు, పూజలు చాలవా? ఎందుకు ఇంత శ్రమ తపన పడతారని, నిన్ను, నీ శ్రీమతిని తడవ, తడవకు హెచ్చరించుచునే యుంటిని గదా. ఇప్పుడు ఈ అవతారములో నీకు కనబడుచున్న మిగిలిన భక్తులకు నేను చేయుచున్న బోధలు మీకు నేను చేసిన బోధలతో పోల్చితే నేను మీ బోధలకోసం తీసుకున్న శ్రమలో కోటివంతు కూడా లేదు. మీ దంపతులు ఇరువురు శాంతితో నా కార్యక్రమములో సంపూర్ణముగా పాల్గొని నా సేవలో తరించండి. ఇదే దేవరహస్యము అన్నారు స్వామి.
[27.02.2002 బుధవారం]
ఒకానొక సమయములో గరుత్మంతుడు, హనుమంతుడు, ఆదిశేషుడు వైకుఠంలో విరజానదిలో స్నానం చేయబోతూ గట్టు మీద నిలబడి ఇలా అనుకున్నారట. “నారదుడంతటి వాడే విష్ణుమాయలో పడిపోయాడు మనం ముగ్గురమే విష్ణుమాయలో పడనివారము” అనుకుంటూ విరజానదిలో స్నానము చేసారట. ఆ అహంకారము వలననే వారు మువ్వురును ఈ జన్మలో హనుమంతుడు-బాలకృష్ణుడుగను, గరుత్మంతుడు అజయ్ గాను, శేషుడు ఫణిగాను జన్మించి నా సేవలో యున్నారు అన్నారు స్వామి.
[07.10.2004]
భక్తులారా! మీ ఇద్దరూ పెద్దవాళ్లైనారు. ఇప్పుడు పూర్వమున్న శక్తి మీకు లేదు. శక్తి ఉన్నంతవరకు భగవత్సేవ చేసారు. కనుక దిగులు పడవద్దు. భగవంతునిపై మనస్సు పెట్టుకొని తరించండి. ఇకనుండి ఈ నాలుగు భజనలు రోజూ చేసుకోండి –
i) శ్రీదత్తగణపతి స్తుతి
ii) శ్రీ మహాలక్ష్మీస్తుతి
iii) గోవింద గోవింద నామమే చాలు
iv) ఓంకార హృదయస్థ గ్రహపతి భానుం.
అని తను వ్రాసిన భక్తిగంగ నుండి నిత్యపారాయణ భజనల పేర్లను చెప్పి స్వామి మా ఇద్దరిని అనుగ్రహించినారు.
[13.10.2004 ఉదయం 06.30]
స్వామికి మేమిద్దరము నమస్కరించాము. అప్పుడు స్వామి, “ఏమిటి మీరు నాకు నమస్కరిస్తున్నారు, అసలు మీ నిజస్వరూపము ఏమిటో మీకు తెలుసా? మీరు సాక్షాత్తూ శివుడు. మీకు వైష్ణవమాయ ఆవహించినది. అందుకే మీరు మీ స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వైష్ణవమాయ అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఈ మూడు తెగితే వైష్ణవమాయ తొలగినట్లు. అప్పుడు మీకు స్వస్వరూప సంధానము కలుగుతుంది” అని దివ్యజ్ఞానమును ఉపదేశించారు.
[18.11.2004]
[గురువారం కార్తీకశుద్ధ షష్టి దివ్యవాణి] “దారేషణ, ధనేషణ, పుత్రేషణ అను బంధముల నుండి విముక్తులు కానిచో మోక్షము రాదు. మోక్షము వస్తేగాని కైవల్యము రాదు. కనుక సంసార లంపటముల నుండి బయట పడండి. ఈ వయస్సులో ఆ లంపటములో కాలము వ్యర్థము చేయరాదు. సంసార విషయముల గురించి, రోగముల గురించి, ఒక క్షణకాలము గాని, ఒక బిందుమాత్రమైన శక్తిగాని దుర్వినియోగము చేయకుము. అట్లు చేసినచో అవి నిన్ను ఏడిపించును. నీ సమస్త కాలమును నీ సమస్తశక్తిని పరమాత్మ కొరకే వెచ్చించుము. అప్పుడు అవి నీ వెంట కుక్కలవలె అనుసరించి, కుక్కలవలె లొంగిపోవును. స్వామి సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమీలేదు. ఆయనకు మనము ఏమియు గుర్తిచేయవలసిన పనిలేదు. పరిపూర్ణ విశ్వాసముతో స్వామిని సేవించండి అంతే,” అన్నారు స్వామి.
[20.08.2005]
[దివ్యవాణి-రాత్రి 10:30] భవానీ-బాలకృష్ణులారా! ఏమిటి? మిమ్ములను నేను పై మెట్టులో కూర్చోపెట్టి జ్ఞానసాగరమును అందిస్తూ ఉంటే ఇంకా మీరు ఈ అష్టసిద్ధుల ప్రదర్శన కోసం తాపత్రయ పడతున్నారేమి? కోట్ల విలువగల జ్ఞానమును అందిస్తుంటే పదిపైసలవంటి అష్టసిద్ధులకు తాపత్రయ పడతారేమి? అందుకే మీరు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు కోరినా మీకు ఈ పదిపైసలు విలువ చేసే అష్టసిద్ధుల ప్రదర్శనము చేయుట లేదు. కనుక జ్ఞానాన్నే ఆశ్రయించి తరించండి అని మమ్ములను హెచ్చరించారు స్వామి.
★ ★ ★ ★ ★