
23 Oct 2025
Updated with Part-2 on 24 Oct 2025
Part-1
[07.02.2003 శుక్రవారము] ఒక బిందెలో బురద నీరు ఉన్నది. మరియొక బిందెలో సుగంధ జలమున్నది. మరియును సుగంధ జల సముద్రము కూడ యున్నది. బురద నీరు ఉన్న బిందెలోను సుగంధ జలము ఉన్న బిందెలోను, సుగంధ జల సముద్రములోను శుద్ధమైన నీరు ఉన్నది. బురద నీటి బిందెయే జీవుడు. సుగంధ జలమున్న బిందెయే సాధన చేత జీవ గుణములు పోగొట్టుకొని కల్యాణ గుణములను పొందిన జీవుడు. అనగా బురద నీటి బిందెను, సుగంధ జల బిందెగా మార్చవచ్చును. బురద నీటి బిందెలో ఉన్న బురద మట్టి కణములను వడపోసినచో శుద్ధ జలమున్న బిందెగా మారును. అనగా జీవుడు సాధన చేత జీవ గుణములను పోగొట్టుకొని శుద్ధ చైతన్య స్వరూపుడగు నిర్గుణుడగు పరిశుద్ధాత్మగా మారవచ్చును. ఈ శుద్ధ జలమున్న బిందెలో సుగంధ పొడిని కలిపినచో అది సుగంధ జలమున్న బిందెగా మారును. బురద మట్టి కణములను వడపోసి శుద్ధ జలమున్న బిందెగా మారుటయే శంకరులు చెప్పిన శుద్ధ బ్రహ్మత్వమును పొందుట. ఈ శుద్ధ జలమే అనగా శుద్ధ చైతన్యమే బ్రహ్మము. శుద్ధ జలమున్న బిందెను సుగంధ జలమున్న బిందెగా మారుటయే లోక కల్యాణార్థము బ్రహ్మత్వమును పొందిన ముక్త జీవుడు. మరల లోకము నందు మహా భక్తునిగానో లేక స్వామి అవతరించునపుడు స్వామి యొక్క సేవకునిగానో వచ్చుట జరుగును. బురద నీటిలో నున్న బురద మట్టి కణములను వదిలి వేసి, శుద్ధ జలముగా మారుటయే మోక్షము. ఇచ్చట బురద కణముల నుండి శుద్ధ జలమునకు ముక్తి లభించుచున్నది. కావున శుద్ధ చైతన్య స్వరూపుడగు జీవునకు అహంకార, మాత్సర్యాది గుణముల నుండి విముక్తి లభించుటయే మోక్షము. దేహము పోయినంత మాత్రమున జీవునకు మోక్షము రాదు. బురద నీటిని వేరొక పాత్రలో పోసి కుండను పగిలకొట్టినంత మాత్రమున ఆ వేరొక పాత్రలో యున్న బురద నీరు శుద్ధ జలముగా మారునా? అట్టి బురద నీరు వంటి జీవుడు కుండయను దేహము నుండి బయటకు పోయి వేరొక పాత్రయను యాతనా శరీరమనబడు ప్రేత శరీరము లోనికి పోయినంత మాత్రమున జీవుని నుండి జీవ గుణములు వెడలిపోవుట లేదు.
కావున దేహము నశించిన తర్వాత మోక్షము లభించుట పచ్చి అబద్ధము. జీవ గుణములు పోగొట్టుకొను సాధన ఈ దేహము ఉండగనే జరుగవలెను. ఏలననగా సాధన కర్మ స్వరూపము. ఈ దేహము కర్మ శరీరము. ఈ లోకము కర్మ లోకము. కావున కర్మ లోకమగు ఈ మర్త్యలోకములోనే కర్మ శరీరమగు ఈ దేహము ఉండగనే సాధన కర్మతో జీవ గుణములను పోగొట్టుకొని మోక్షమును సాధించుకొనుటకు అవకాశమున్నది. ఈ కర్మ శరీరము వదలి జీవుడు యాతనా శరీరమును ధరించగనే మర్త్యలోకమునకు పై నున్న ప్రేత లోకమునకు పోవుచున్నాడు. యాతనా శరీరము భోగ శరీరము. ఆ శరీరముతో కర్మ చేయుట కుదరదు కావున ఈ శరీరము పోగానే మోక్షము లభించు అవకాశము కల్ల. ప్రేతలోకములో జీవుడు పది దినములుండును. ఆ లోకములో జీవుని యొక్క కర్మల మీద విచారణ ఆ పది దినములలో జరుగుచున్నవి. విచారణ పూర్తికాగానే అధములు ప్రేతలోకమునకు పైనున్న నరకలోకమునకు పోవుచున్నారు. మధ్యములు నరకలోకమునకు పైనున్న పితృలోకమునకు పోవుచున్నారు. మర్త్యలోకము, ప్రేతలోకము, నరకలోకము, పితృలోకము ఈ నాలుగు కలిపి భూలోకమనబడు చున్నది. ఈ నాల్గింటిలోను మనము ప్రస్తుతమున ఉన్న ఈ మర్త్యలోకము ఒక్కటియే కర్మలోకము. ఉత్తములు భూలోకమునకు పైనున్న భువర్లోకమునకు పోయి తేజోరూపమున అక్కడ ప్రకాశించుచుందురు. ఈ భూవర్లోకమునే "ద్యు” లోకమనియు లేక ‘జ్యోతిర్లోక’మనియు అందురు. ఇక అత్యుత్తములు భువర్లోకమునకు పైనున్న సువర్లోకముకు పోవుదురు. ఈ సువర్లోకమే స్వర్గలోకము. ఈ స్వర్గలోకము ధృవ నక్షత్రము మొదలు ఆదిత్య మండలము వరకు యుండును. ఈ లోకములన్నియును సామాన్య జీవులకు గోచరించవు. భగవదనుగ్రహము కలిగిన జీవులకు మరియు అవతార పురుషులకు గోచరించుచుండును. ఇప్పటి వరకు చెప్పినదంతయును కర్మ మార్గము లేక దక్షిణాయనము లేక కృష్ణపక్షము లేక పితృయానము అనబడును. ఈ మార్గములో మోక్షము అసంభవము.

Part-2
మర్త్యలోకము దాటిన తరువాత ఉన్న లోకములన్నియు భోగలోకములే కావున వీటిలో సాధన చేయుట కుదరదు. కావున మర్త్యలోకము దాటక ముందే ముక్తులు కాని జీవులందరును ఈ పితృయాన మార్గమునకే వచ్చుదురు కాన వీరికి ముక్తి లేదు. వీరు పై లోకములలో వారి వారి గుణకర్మ ఫలముల వలన బలహీనమైన ఆ పూర్వగుణములతోనే మరల మర్త్యలోకమునందు నర, పశు, పక్షి కీటకాది రూపములలో జన్మించుచున్నారు. కావున విదేహ ముక్తియనునది లేదు. కావున ఈ మానవ జన్మ జారిపోయినచో సర్వము జారిపోయినట్లే. ఇదే మహావినాశమని "మహతీ వినష్టిః" అని శ్రుతి చెప్పుచున్నది. కావున ఈ మర్త్యలోకమున ఈ శరీరమున్న సమయములోనే అసూయ అహంకారాది గుణములను సాధన చేత పోగొట్టుకొని జీవన్ముక్తిని పొందిన వాడే నిజమైన ముక్తుడై ఈ దేహము నశించిన తర్వాత కూడ ముక్తుని గానే ఉండుచున్నాడు.
కావున జీవన్ముక్తుడే విదేహముక్తుడగుచున్నాడు. జీవన్ముక్తి రానిదే విదేహ ముక్తి రాదు. కావున కుండ పగలక ముందే కుండలోని బురద నీటిలో యున్న మట్టి కణములను వడపోసి పారవేయవలెను. ఇప్పుడు కుండలో శుద్ధజలమున్నది. అనగా బ్రతికి యుండగనే జీవగుణములను పోగొట్టుకొని జీవన్ముక్తిని సాధించిన అవధూత స్వరూపుడు ఇతడే. ‘అవ’- క్రిందకు, ‘ధూత’- విసరివేయుట. కావున సాధన చేత జీవ గుణములను వడపోసి విసరివేసిన వాడే అవధూత కాని దేహము నుండి వస్త్రములను విడచివేసిన వాడు అవధూత కాడు. కావున అవధూతయే జీవన్ముక్తుడు. ఇతడే స్థిత ప్రజ్ఞుడనబడును. ఇతడు కేవలము శుద్ధ చైతన్య స్వరూపుడై జీవ గుణము కాని, కల్యాణ గుణములు కాని లేకుండ యుండును. ఇతడు నిర్వికారుడై నిశ్చలుడై సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతుడై జీవించుచుండును. ఇట్టి వాడు మరణించిన తర్వాత ఏమగును? నిజము నిష్ఠూరముగా యుండును. ఇట్టి జీవన్ముక్తుడు చాలా గొప్పవాడని అనుకొనుచున్నారు. ఇట్టి వాడు నిర్వికారమైన, నిశ్చలమైన, నిర్గుణమైన వృక్ష పాషాణాది జన్మలు పొందును. ఏలననగా వృక్షములు కేవలము శుద్ధ చైతన్యము గల ప్రాణులు. కావున మోక్షము ప్రధానము కాదు. సాధన మోక్షముతో ఆగరాదు. అట్లు ఆగినచో సాధన వ్యర్థము. బురద నీటి నుండి బురద కణములను కష్టపడి వడపోసి శుద్ధ జలముగా మార్చుటతో లక్ష్యము సంపూర్ణము కాదు. ఈ అవస్థను మేము నిందించుట లేదు. ఈ స్థితిలో ఆగినచో అతడు బ్రతికి యున్నప్పుడు వృక్ష పాషాణముల వలె స్థాణువై పడియున్నచో ఫలమేమి? అతడి వలన లోకమునకు ఎట్టి ఉపకారము లేదు. ఆ శుద్ధ జలములో గంధపు పొడి కలిపి ఈ కుండ పగలకమునుపే సుగంధ జలముగా మార్చవలెను. అనగా బ్రతికి ఉన్నప్పుడే సాధన చేత జీవ గుణములను పోగొట్టుకొని జీవన్ముక్తుడై, స్థితప్రజ్ఞుడై జ్ఞాన, ప్రేమ, దాన, శాంత్యాది కల్యాణగుణములను పొందవలెను.అట్లు బ్రతియుండగనే కల్యాణగుణములను పొంది లోకోపకారమును చేయువాడు ఈశ్వరావస్ధను పొందినవాడగును. బురద జలము జీవతత్త్వము. శుద్ధ జలము బ్రహ్మత్వము. సుగంధ జలము ఈశ్వరత్వము. ఇట్టి వాడు మరణించిన తర్వాత ఈశ్వరునకు సామీప్యమున ఉండి మరల మరల ఈశ్వరునితో పాటు ఈశ్వర సేవకునిగా జన్మించును. ఇట్టి వాడు పైలోకమునకు పోనక్కరలేదు. ఏలననగా ఈశ్వరుడు ఎప్పుడును మర్త్యలోకములోనే నరాకారముతోనే ఉన్నాడు. కావున ఇట్టి కల్యాణ గుణములు గల జీవుడు ఈశ్వర సాన్నిధ్యమున ఇక్కడనే ఉండును. ఇట్టివాడు వేరొక లోకమునకు పోడని శ్రుతి "ఇహైవ ప్రాణాః సమీవ వీయంతే" అని చెప్పుచున్నది. ఈశ్వరుడు కాలాతీతుడు. మరియును ఆకాశమునకును అతీతుడు. కావున ఈశ్వరుడు ఈ సృష్టిలో ఈ లోకములో ఉన్నాడు ఆ లోకములో లేడు అని చెప్పుట హాస్యాస్పదము. ఆయన ఆకాశమునకే కారణ స్వరూపుడు. కావున ఎచ్చటనైనను ఉండును. ఇందు గలడు అందు లేడని సందేహము వలదు. కాలాతీతుడు కావున వెనుకటి తరములో ఉన్నాడు. ఈ తరములో లేడు అని చెప్పుట హాస్యాస్పదమే. సర్వ కాలములందును, సర్వ ప్రదేశములందును ఈశ్వరుడున్నాడు. కావున ఇట్టి కల్యాణ గుణుడగు జీవుడు స్ధూల శరీరమును విడచిన తర్వాత అచ్చటనే ఉండును. మరియొక లోకమునకు పోనవసరము లేదు. కావున వానికి విచారణయే లేదు. వానికి భోగలోకముల ప్రసక్తియే లేదు. ఇదే జ్ఞాన మార్గము లేక ఉత్తరాయణము లేక శుక్ల పక్షము లేక దేవయానము అనబడుచున్నది.
కావున ఈ మర్త్యలోకము స్వర్గలోకము కన్ననూ మిన్నయైనది. స్వర్గలోకమున నీవు ఏ సాధనను చేయలేవు. ఈ మానవ జన్మ స్వర్గలోకమున ఉన్న దేవతల కన్నను పుణ్యమైనది. ఏలననగా అచ్చట పుణ్యఫల భోగమే తప్ప ఈశ్వర సాన్నిధ్యమును పొందు సాధన చేయుట కుదరదు. సంపాదించిన పుణ్యము పూర్తి కాగానే మరల మర్త్యలోకమున నానాయోనుల యందు పడవలెను. కావున స్వర్గలోకమున దేవతలు సహితము మర్త్యలోకమున మనుష్య జన్మలను ఎత్తవలయునని ఈశ్వరుని ప్రార్ధించుచుండురు. ఈ మర్త్యలోకమున సర్వ కాలములందును ఈశ్వరుడగు దత్తాత్రేయుడు నర రూపములలో యుండుటయే దీనికి కారణము.
★ ★ ★ ★ ★