home
Shri Datta Swami

 Posted on 27 May 2025. Share

ప్రవృత్తి మార్గము - నివృత్తిమార్గము

[19.01.2004]

ప్రవృత్తి మార్గము:- ఇందు ధర్మమే ప్రధానము. ఇది జీవునకి మరియొక జీవునికి మధ్య విషయము. దానము, కరుణ చూపుట, దయా గుణము కలిగియుండుట, అందరికి ఉపయోగపడుట ఇందలి ముఖ్య విషయములు. ప్రవృత్తిలో చిట్టచివరి కొన ధర్మము. దానము, కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము ఇవి అన్నియు ప్రవృత్తి మార్గములే. దీనిని పితృయానం అంటారు. అంతా ధర్మతత్త్వము కలిగి యుండుటయే లక్షణము. దీని వలన ఏమి ఫలము లభిస్తుంది అంటే స్వర్గ లోకభోగము అనంతరము మర్త్యలోకములో జన్మించుట. ప్రవృత్తి అనిత్యఫలాన్ని ఇస్తుంది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో "అశ్వత్థామా హతః" అని చెప్పమన్నాడు. ధర్మరాజు అట్లు చెప్పుటకు ఒప్పుకొనలేదు. అది అధర్మమన్నాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ గదా. అయినా వినలేదు. పరమాత్మ కంటే ధర్మానికే ఎక్కువ విలువనిచ్చాడు. ఇదే ప్రవృత్తి మార్గము. అధర్మానికి, ధర్మానికి పోటీ వచ్చినపుడు ధర్మానికే పెద్ద పీట వేయాలి. అదే ధర్మానికి పరమాత్మకు పోటీ వచ్చినపుడు పరమాత్మకే పెద్దపీట వేయాలి. కాని ధర్మరాజు ధర్మానికే పెద్దపీట వేసాడు. ఆ కారణము చేత స్వర్గలోకానికే వెళ్ళగలిగాడు. ఇదే ప్రవృత్తి మార్గము.

మరియొక ఉదాహరణ:- వారధి కట్టు సమయములో సముద్రములో బండరాళ్ళు వేస్తున్నారు వానరులు. కాని అవి మునిగిపోతున్నాయి. దానితో వాళ్ళు ఇది భగవంతుని కార్యము అని మరచిపోయి, పామరుల వలె ఆ పనిని ఆపివేసి వచ్చి కూర్చున్నారు. కాని ఒక ఉడుత మాత్రము ఇసుకలో పొర్లి ఆ ఇసుక రేణువులు నీటిలో మునిగిపోతున్నప్పటికి ఇది భగవంతుని కార్యము అనే పూర్తి విశ్వాసముతో తన పనిని ఆపకుండా చేస్తూనే ఉంది. అందుకే శ్రీ రాముడు ఉడుతను నిమిరాడు. కాని వానరులను కాదు గదా. ఇదో ఉదాహరణ. వానరులు ప్రవృత్తి మార్గములో, ఉడుత నివృత్తి మార్గములో ఉన్నట్లే గదా. ప్రవృత్తి మార్గము చాలా సులభమార్గము. జీవుడు ధర్మబద్ధుడు. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే" అని భగవద్గీత ప్రవృత్తి మార్గముతోనే ప్రారంభించినది.

Swami

నివృత్తి మార్గము:- నివృత్తి మార్గము పరమాత్మకు జీవునికి మధ్య సంబంధము. ఇక్కడ ధర్మము కంటే పరమాత్మ ఎక్కువ. నివృత్తి మార్గములో పరమాత్మ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నీ యొక్క ప్రేమ ఎంత అని పరీక్షించబడుతుంది. కావున ధర్మాన్ని అతిక్రమించినదే ప్రేమ. ప్రేమ చేతనే, శరణాగతి చేతనే, నివృత్తి సాధించాలి. నివృత్తి మార్గము చాలా కష్టమైనది. ఇరుకు మార్గము. ముళ్ళబాట. స్వామి మీద పరిపూర్ణమైన విశ్వాసము ఉండాలి. సర్వస్య శరణాగతి చేయాలి. నివృత్తిలో చిట్టచివరి కొస భగవంతుడే. ఇది శాశ్వతఫలాన్ని అందిస్తుంది. ప్రేమ, శరణాగతి, విశ్వాసము నివృత్తిలో లక్షణాలు. ఇదే దేవయానము. దీని ఫలము శాశ్వత బ్రహ్మలోకము. బ్రహ్మలోక ప్రధానము స్వామి చేతులలో ఉన్నది. ఉదాహరణకు ఉడుత విశ్వాసము ఎంతో గొప్పది. అందుకే శ్రీరాముడు నిమిరాడు. గోపికలు నివృత్తి మార్గములో తరించారు. మునిపత్నులు శ్రీకృష్ణునికి యజ్ఞము పూర్తికాక ముందే భోజనము సమర్పించి నివృత్తి మార్గములో తరించారు. భగవద్గీతలో చివర నివృత్తి బోధించారు శ్రీకృష్ణభగవానుడు "సర్వధర్మాన్‌ పరిత్యజ్య" అని. ఇది పరమాత్మను చేరే సత్యమైన మార్గము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via