home
Shri Datta Swami

 15 May 2025

 

త్రిమతాచార్యులు (శంకర - రామానుజ - మధ్వమతములు)

ఈ ముగ్గురు గురువులు త్రిమూర్తుల అవతారములు. మధ్వుడు బ్రహ్మ. రామానుజుడు విష్ణువు. శంకరుడు శివుడు. త్రిమూర్త్యాత్మకుడైన శ్రీగురుదత్తుడే ఈ గురుత్రయరూపములో అవతరించాడు. కానీ భారతదేశములోని పండితులందరు ఈ గురుత్రయము యొక్క భాష్యాలలోని అంతరార్థమును గ్రహించక, పరస్పరము కలహించుకొనుచున్నారు. త్రిమూర్తులలో భేదాలను చూపుకుంటూ, గురుత్రయ భాష్యాలలో భేదాలను చర్చించి కలహించుకొనుట కూడా భారతదేశానికి దరిద్రము చుట్టుకొనుటకు కారణమగుచున్నది. వేదము బ్రహ్మయే నారాయణుడు, శివుడే నారాయణుడు అని "బ్రహ్మా చ నారాయణః, శివశ్చ నారాయణః" అని ఘోషిస్తున్నను, వైష్ణవులు శివాలయము లోనికి పోవుటలేదు. మరియు శైవులు విష్ణ్వాలయముల లోనికి పోవుటలేదు. అట్టివారు శివ, విష్ణు నిందను చేయుచున్నారు.

గురువు గారి రెండు పాదములను ఇరువురు శిష్యులు సేవించుచున్నారు. "నీ కాలి మీద ఈగ నా కాలి మీద వాలినది" అని ఒక శిష్యుడు రెండవ కాలిని కొట్టినాడు. రెండవ శిష్యుడు మొదటి కాలిని కొట్టినాడు. ఇరువురి దెబ్బలు ఒకే గురువు గారికి తగిలి మొత్తుకున్నాడు. అలానే త్రిమూర్తులలో ఎవరిని నిందించినా, గురుత్రయములో ఎవరిని నిందించినా శ్రీగురుదత్తునికే నిందలు తగులుచున్నవి. ప్రపంచములో అన్ని మతముల దైవస్వరూపములును శ్రీగురుదత్తునివే కావున బుద్ధుడు, అల్లా, జీసస్‌లను కూడా నిందించరాదు. హిందూమతములోని దైవభేదములను దాటలేకపోయినచో ప్రపంచములోని దైవభేదములను దాటగలమా? ఒక ఇంటిలోని గదుల మధ్య నున్న గోడలను పడగొట్టి ఒకే హాలును చేయలేనిచో, ఇక ఇళ్ళ మధ్య నున్న గోడలను పడగొట్టి అన్ని ఇళ్ళను ఒకే ఇల్లుగా చేయగలమా? కావున ముందు హిందూమతములో ఏకత్వము వచ్చినగాని, ప్రపంచమతములలో ఏకత్వము రాదు.

Swami

ఆచార్యత్రయములో మొదట శంకరాచార్యులు వచ్చినారు. ఉపనిషత్తులలో మానవుడైన జీవుడు పరమాత్మయని చర్చించబడినది. ప్రతిజీవుడునూ పరమాత్మ అయితే ఇక సాధన ఎవరికి? అజ్ఞానము ఎవరికి? ముక్తి ఎవరికి? వాటిలో చర్చించబడిన మానవుడు, ప్రతి మానవుడూ కాడు. ఒకానొక అవతార పురుషుడైన మానవుని గురించియే అచట చర్చించబడినది. శ్రీకృష్ణునిగా స్వామి అవతరించాడు. అదెలాగంటే, "మానుషీం తను మాశ్రితమ్‌" అన్న గీత ప్రకారముగా పరమాత్మ ఒక మనుష్య శరీరాన్ని ఆశ్రయించి వస్తాడు. ఇక్కడ అవతార విషయములో చర్చలే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే మూడు మతాలు. ఈ శ్రీకృష్ణ శరీరములో ఉన్న జీవుడు సాక్షాత్తు బ్రహ్మమన్నది అద్వైతము. బ్రహ్మము యొక్క అంశయని విశిష్టాద్వైతము. అవతార శరీరము బ్రహ్మము కన్నా వేరు. అది బ్రహ్మము యొక్క కార్యము చేయుటకు వచ్చిన సేవకుడైన జీవుడే అన్నది ద్వైతము. ఉపనిషత్తులలో ఈ అవతార పురుషుని గురించి చర్చించినపుడు ఫలాన కృష్ణుడు, రాముడు అని పేర్లు పెట్టలేదు. ఏలననగా, ప్రతి మనుష్య తరములోను బ్రహ్మము మనుష్యరూపాలతో అవతరించుచున్నది. కావున ఒక పేరు పెట్టుట కుదరదు గదా. అవతార పురుషుని తత్త్వమును గురించిన చర్చ అది. పేరు లేదు కావున వెంటనే ప్రతిమానవుడు వక్రార్థము చేసుకొని ప్రతిమానవుడు బ్రహ్మమేనని అద్వైతులు, ప్రతి మానవుడు బ్రహ్మాంశయేనని విశిష్టాద్వైతులు, ప్రతి మానవుడు బ్రహ్మము యొక్క సేవకుడేనని ద్వైతులు తెగ మురిసిపోయి పరస్పరము కలహించుకొనుచు ఒకరినొకరు ఆక్షేపించుకొనుచున్నారు.

అసలు అవతారము గురించిన విషయము వీరి మధ్య జారిపోయినది. పండ్లు మురికి కాలువలో పడుట గమనించక కేవలము మిగిలిన ఖాళీ బుట్ట కోసము ఈ తగువులాట. పూర్తి మాత్సర్యముతో (jealousy) ఉండే కొందరు కృష్ణుని బ్రహ్మముగా అంగీకరించరు. వారి దృష్టిలో దేవుడు పైన ఉన్నాడు. కృష్ణుడు ఆ దేవుని దూత మాత్రమే. దైవకార్యము చేయుటకు వచ్చిన సేవకుడే. వీరికి ద్వైతమతము సంతృప్తినిచ్చును. మరికొందరు తక్కువ మాత్సర్యముతో ఉన్నవారు, కావున కృష్ణుని దేవుని అంశగా భావింతురు. వీరికి విశిష్టాద్వైతము తృప్తి నిచ్చును. మరికొందరు పూర్తిగా మాత్సర్యము విడచిన వారు కావున వారు కృష్ణుని పూర్తి దేవునిగా అంగీకరింతురు. వీరి కొరకే అద్వైతము. ఈ ముగ్గురు మతాచార్యులు ఒకే గురుదత్తుని అవతారములు కావున ఒకే గురువు ఆయా స్థాయిలలో ఉన్న వివిధ శిష్యులకు వివిధ రీతులలో ఒకే సిద్ధాంతమును బోధించినాడు. ఈ మూడు మతములు వరుసగా అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతమతములు. మూడుసోపానములలో ఒక్కొక్కటి క్రింద నుండి పైకి పోవుటకు ఉన్న మెట్టు వంటిది.

ముందు ద్వైతములో సేవకునిగా స్వామి సేవలో చేరినచో, తర్వాత స్వామి నన్ను ఆత్మీయునిగా తనలో ఒక భాగముగా (అంగము) ఆదరించును. "మీ ఇరువురు నా రెండు కన్నులు" అని లోకములో తండ్రి పుత్రులను అనుట గలదు గదా. ఈ అంగాంగి సంబంధమే విశిష్టాద్వైతము. ఇక సేవలో పరాకాష్ఠకు పోయినచో నీవే స్వామివి అగుదువు. అనగా స్వామి నిన్ను ఆపాదమస్తకము ఆవేశించును. ఇదే అద్వైతము. ఈ క్రమములో నాల్గవమెట్టు దత్తమతము. దత్తమతము ఏమనగా స్వామి నిన్ను స్వామిగా చేసి నీకు దాసుడగును. హనుమంతుడు ఇలా సేవ ద్వారా ద్వైతముక్తిని సాధించి, స్వామి అగుటయే కాక యుద్ధములో స్వామిని సహితము ఓడించినాడు. సేవ అనగా స్వామి కొరకు కర్మను చేయుట (కర్మ సంన్యాసము), మరియొకటి కర్మఫలము నివేదించుట. అనగా కర్మఫలమైన ధనమును స్వామికి త్యాగము చేయుట (కర్మఫలత్యాగము) అని గీత చెప్పుచున్నది. నీకు వీలును బట్టి, పరిస్థితులను బట్టి ఏ ఒక్కటి గానీ రెంటినీ గాని చేయవచ్చును. కర్మసంన్యాసము కన్నా కర్మఫలత్యాగము గొప్పది. ఈ రెండూ కలిపిన కర్మయోగము అనబడును. అది అత్యుత్తమము అని గీత చెప్పినది.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch