home
Shri Datta Swami

 25 Sep 2025

 

విశేష జ్ఞానము కలది బ్రహ్మము మాత్రమే

Updated with Part-3 on 27 Sept 2025


Part-1   Part-2   Part-3


Part-1

[05.12.2003] వేదము ప్రకారము జ్ఞానము, ఆనందము, ప్రేమ ఈ మూడును పరబ్రహ్మము యొక్క స్వరూప లక్షణములు. ఈ మూడును గుణములు. గుణములు ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఉండవలయును. కాంతి, వేడి సూర్యుని స్వరూప లక్షణములు. సూర్యుడు ఒక ద్రవ్యము. ఈ ద్రవ్యము ఈ గుణముల యొక్క సాంద్రరూపమై యున్నది. అట్లే జ్ఞానము, ఆనందము, ప్రేమ అను ఈ మూడు లక్షణముల యొక్క అత్యంత సాంద్ర స్వరూపమైన ఘనమే బ్రహ్మము. దీనినే “ప్రజ్ఞాన ఘనః," "బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా" అని శ్రుతి వాక్యములు చెప్పుచున్నవి. ఇట్టి బ్రహ్మము ఊహలకు సహితము అందకయున్నది. ఊహలకు అందుట అనగా జ్ఞానము అని అర్థము. జ్ఞానము అనుభవము నుండి పుట్టి వేద, శాస్త్ర, తర్క ప్రమాణముల చేత సమర్థింపబడినప్పుడే సత్యమైన జ్ఞానమగును. ఒక పిచ్చివాని అనుభవము అగు భ్రమ నుండి పుట్టిన జ్ఞానము సత్యము కాదు గదా. అనుభవము ప్రత్యక్షప్రమాణ సిద్ధమై యుండవలయును. ఉదాహరణకు లడ్డు తియ్యగా నుండును అని ఒకరు చెప్పిన మాట నుండి ఏర్పడు జ్ఞానము సాక్షాత్తు లడ్డు తిని పొందు సత్యమైన జ్ఞానము కానేరదు.

 చైతన్యము ఒక గుణము. కాని గుణము ప్రత్యేకముగా ఎచ్చటనూ లభించదు. లోకములో చైతన్యము ద్రవ్యమైన ఒక ప్రాణి యొక్క లక్షణముగనే కనిపించుచున్నది. చైతన్యము శక్తి స్వరూపము. ద్రవ్యము ఘనీభవించిన శక్తి. కాని శక్తి, ద్రవ్యము లేక స్వయముగా నిలువజాలదు. సూర్యుడు తేజోఘనుడైనను, సూర్యుడు లేనపుడు తేజస్సు స్వతంత్రముగా గోచరించుటలేదు. ఇట్టి చైతన్య, జ్ఞాన, ఆనంద, ప్రేమ ఘనమైన పరబ్రహ్మము జగత్తును మాయ ద్వారా సృష్టించినది. జ్ఞానము అన్నప్పుడు అది చైతన్యము అని కూడా అర్థము. ఏలననగా చైతన్యము కలవాడే జ్ఞానమును కలిగియుండును. చైతన్యము ఉన్నంత మాత్రమున జ్ఞానము ఉండనక్కరలేదు. కాని జ్ఞానము ఉన్నచో చైతన్యము ఉండితీరవలయును. జ్ఞానము అనగా శాస్త్ర జ్ఞానము.

Swami

సత్యమైన అనంతమైన శాస్త్రజ్ఞానము, ప్రజ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానము అనగా వేదాంతము. వేదాంతము బ్రహ్మమును గురించిన జ్ఞానము. వేదాంతము అనగా వేదముల యొక్క చిట్టచివరి కొసజ్ఞానము. ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మమునకే పరిపూర్ణముగా యుండును. కావున "ఈశ్వరుడు సర్వజ్ఞుడు" అనబడుచున్నాడు. బ్రహ్మము స్వయముగా సంకల్పించుకొని కల్పించుకున్న అజ్ఞానమగు మాయ ద్వారా తన సంకల్ప స్వరూపమగు జగత్తు ఏర్పడినది. కావున బ్రహ్మము మాయాచ్ఛాదితమై యున్నది. అట్టి బ్రహ్మమును నీవు ఎట్లు దర్శంచగలవు? బ్రహ్మమునకు మాయ తొలిగిన కాని శుద్ధబ్రహ్మము బయిటపడదు. మాయ తొలిగినచో జగత్తు అదృశ్యమైపోవును. అప్పుడు శుద్ధబ్రహ్మము ఒక్కటియే మిగులును. అప్పుడు శుద్ధబ్రహ్మము తన్ను తాను తెలియును. కావున శుద్ధబ్రహ్మమును బ్రహ్మము తప్ప జీవుడు తెలియజాలడు. దీనినే "బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ" అని శ్రుతియు "మాం తు వేద న కశ్చన" అని గీతయు చెప్పుచున్నవి. బ్రహ్మవేత్త బ్రహ్మమే కాని జీవుడు కాడు అని ఆ శ్రుతికి అర్థము. కావున జ్ఞానానంద ప్రేమలను నీవు నీవుగా ఉండి తెలుసుకొనుట అసంభవము. నీవే అదృశ్యమైనపుడు అవి నీ అనుభవమునకు రావు. అనుభవము లేక జ్ఞానము రాదు. విశేషజ్ఞానము కలది బ్రహ్మము అని తెలుసుకున్నంత మాత్రమున బ్రహ్మము నుండి నీవు ఆ విశేషజ్ఞానమును విన్నావా? వినకుండా ‘విశేషజ్ఞానము’ అను శబ్దశ్రవణము చేత నీకు ఏమి తెలిసినది? గణితశాస్త్రము అను శబ్దము విన్నంత మాత్రమున గణితశాస్త్రమంతయు నీకు తెలిసినదా? కావున బ్రహ్మము నుండి విశేషజ్ఞానమంతయు విని అపార ఆనందమును పొంది అపరిమితముగా బ్రహ్మమును సేవ ద్వారా ప్రేమించి ఆ బ్రహ్మము చేత మరల ప్రేమించబడిన గాని నీకు అనంత, ఆనంద, ప్రజ్ఞానానంద ప్రేమానుభవము కలుగదు. అట్టి అనుభవము చేతగాని నీకు పూర్ణ బ్రహ్మజ్ఞానము ఉదయించదు. అట్టి పూర్ణ బ్రహ్మజ్ఞానము బ్రహ్మము నుండి నేరుగా నీవు ప్రత్యేకముగా ఉండుచూ పొందుట సాధ్యము కాదని చెప్పియేయున్నాను.

 

Part-2

కనుక ఈ సమస్యకు పరిష్కారమేమి?

జగత్తు లోనికి బ్రహ్మము దూరి తాను బయటపడక దాగి యుండి తన యొక్క జ్ఞానానంద ప్రేమలను నీకు అందించవలెను. ఇదే మార్గము. అనగా తన మాయా శక్తి చేత, మాయారూపమైన నీ వంటి ఒక మానవ రూపమున ప్రవేశించి, తాను బయటపడక ఆ మానవ రూపము ద్వారా జ్ఞానానంద ప్రేమలను నీకు అందించవలయును. వాటిని కూడా పరిమితమైన మోతాదులోనే స్వల్పముగా నీకు అందించవలయును. మోతాదు మించినచో నీవు తట్టుకొనలేవు. నీకు అందుచున్న జ్ఞానానంద ప్రేమలు సాక్షాత్తుగా పరబహ్మము నుండియే పొందుచున్నావు. అది ఆ మానవ శరీరమును ఆపాదమస్తకము లోపలా బయటా వ్యాపించియే యున్నది. కావున పరబ్రహ్మమే సాక్షాత్తుగా ఆ మానవ రూపము ద్వారా నీ అనుభవము లోనికి వచ్చి నీకు పూర్ణ బ్రహ్మజ్ఞానమునే కలిగించుచున్నది. నీవు అదృశ్యము కాకుండా రక్షించుకొనుచూ నీకు పూర్ణముగా ఆందివచ్చుటకు ఇంత కన్న వేరు మార్గము లేదు. అనంతమైన జ్ఞానానంద ప్రేమలతో నున్న ఆ మూలస్వరూపము చర్మ చక్షువులకు గోచరించినచో ఆ శక్తికి నీవు అదృశ్యమైపోవుదువు. ఆ మూలస్వరూపము కేవలము నీ జ్ఞాన నేత్రముల యొక్క దివ్యదృష్టికి మాత్రమే గోచరించును. ఆ బ్రహ్మానుగ్రహము వలన మాత్రమే ఈ దివ్యదర్శనము గోచరించును. అట్టి మూలరూపము నీకు దర్శన, స్పర్శన, సంభాషణ యోగ్యము కాదు. జగదేకవీరుడగు అర్జునుడే దానికి గడగడ వణకిపోయి, మరల నరరూపమునకే రమ్మని యాచించినాడు.

"అదృష్ట పూర్వం హృషితోஉస్మి దృష్ట్వా, భయేన చ ప్రవ్యథితం మనో మే ।
తదేవ మే దర్శయ దేవ రూపం, ప్రసీద దేవేశ జగన్నివాస ॥
కిరీటినం గదినం చక్రహస్తమిచ్ఛామి త్వాం ద్రష్టు మహం తథైవ ।
తేనైవ రూపేణ చతుర్భుజేన, సహస్ర బాహో భవ విశ్వమూర్తే" ॥

గత వేయి జన్మల నుండి నరనారాయణ నిత్యసహచర్యముతో నారాయణుని సేవించిన నరఋషియే అట్లు బెదిరిపోయినచో, సామాన్యుడు దానిని దర్శించుట ఎంత అసాధ్యమో తెలియవలెను. ఎన్ని జన్మల సేవాఫలము కావలయును? ఐతే అట్టి దర్శనము వలన ప్రయోజనము లేదు. సాక్షాత్కారము కంటే అనుగ్రహమే ముఖ్యము అని చెప్పియే యుంటిని గదా. ధృతరాష్ట్రుడు కూడ దానిని దర్శించినాడు. కాని ప్రయోజనమేమి? కావలసినది దర్శనము కాదు. అనుగ్రహము. రాధకు అట్టి దర్శనము ఈయలేదు. హనుమంతునకు అట్టి దర్శనము కలుగలేదు. బ్రహ్మపదవిని పొందిన హనుమంతుని కన్నను అత్యున్నత గోలోక ఆధిపత్యము పొందిన రాధ కన్నను సిద్ధులు లేరు కదా. రాజును దర్శించి ఆయన యొక్క స్వరూప లక్షణము జ్ఞానము వలన ఆనంద ప్రేమ కలిగినవారే అనుగ్రహింపబడుదురు. అనుభవ పూర్వకమగు జ్ఞానము నరావతారము నుండియే లభించును. జ్ఞానము లేక కేవలము ఆనంద ప్రేమలను కలిగి యున్నవారు అవతార పురుషులు కారు. సూర్యకాంతియు, వేడియు విడివిడిగా విడదీయజాలవు. బ్రహ్మజ్ఞానము ఉన్నచోటనే సత్యమైన ఆనంద ప్రేమలు ఉండును. ఆ విశేషమైన బ్రహ్మజ్ఞానము వేదశాస్త్రతర్కములచే సమర్థించబడియే అవతార పురుషుని నోటి నుండి వెలువడును. భగవద్గీతను విన్నగాని సత్యమైన, అనంతమైన జ్ఞానమును నీవు తెలియజాలవు. కృష్ణుడు లేనిచో భగవద్గీత ఎట్లు వచ్చును? బ్రహ్మరూపమున పరమాత్మ వేదములను చెప్పినాడు. బ్రహ్మదేవుడే లేనిచో వేదము ఎట్లు వచ్చును?

 

Part-3

బ్రహ్మదేవుని నుండి ఋషులు వేదములను శ్రవణము చేసి ఆ విశేషజ్ఞానము చేత బ్రహ్మ సమక్షమున బ్రహ్మసభలో ఆసీనులై బ్రహ్మలోకములో అపార బ్రహ్మానందమును పొందుచున్నారు. దశావతారములలో ఒకరైన బుద్ధుడు వేదములను పౌరుషేయములు అన్నాడు. పౌరుషేయములు అనగా దివ్యపురుష రూపమున ఉన్న బ్రహ్మదేవుడు చెప్పినవి అని అవతార తత్త్వమునకు ప్రాధాన్యమిచ్చినాడు. అపౌరుషేయములనగా బ్రహ్మదేవుని రూపములో దాగి ఉన్న పరమాత్మ చెప్పినవి అని అర్థము. రెండు మాటలకు అర్థము ఒక్కటె. కావున అవతారమును, మూఢులు లోపల దాగియున్న పరమాత్మను తెలుసుకొనలేక అవమానింతురని శ్రీకృష్ణభగవానుడు గీతలో చెప్పియే ఉన్నాడు.

"అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్‌।
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్‌॥"

అనగా నా పరతత్త్వమును తెలియని మూఢులు, సర్వభూతములకు ప్రభువును, మానవ దేహమును ఆశ్రయించిన నన్ను అవమానించుచున్నారు అని. కనుక నాయనా! నీవు ఈ శరీరము ఉన్నంత వరకు అవతార పురుషుని ఉపాసించుట తప్ప వేరొక గతి లేదు. "వేదాహ మేతం పురుషం మహాన్తమ్‌" అనగా అజ్ఞానాంధకారమును పారద్రోలు ఆదిత్యవర్ణుడైన అవతార పురుషుని తెలుసుకున్నానని అర్థము. "తమేవం విద్వాన్‌ అమృత ఇహ భవతి" అనగా అట్టి అవతార పురుషుని గుర్తించిన వాడు ఇచ్చటనే జీవన్ముక్తుడగునని అర్థము. "నాన్యః పన్థా అయనాయ" అనగా పరమాత్మను పొందుటకు ఇంత కన్న వేరు మార్గము లేదు అని అర్థము.

అనగా నాయనా! నీకు ఈ శరీరము ఉన్నంతవరకు అవతార పురుషుని ఉపాసించుట తప్ప వేరొక గతిలేదు. అజ్ఞానాంధకారమును పారద్రోలు ఆదిత్యవర్ణుడైన అవతార పురుషుని తెలుసుకున్నానని గ్రహించుము. అట్టి అవతార పురుషుని గుర్తించిన వాడు ఇచ్చటనే జీవన్ముక్తుడగును. పరమాత్మను పొందుటకు ఇంతకన్న వేరు మార్గము లేదు – "వేదాహ మేతం పురుషమ్‌ మహాన్తమ్ అదిత్యవర్ణం (తమసస్తు పారే) తమసః పరస్తాత్‌, తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పన్థాఽయనాయ".

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch