09 Oct 2025
[13.02.2003] బ్రహ్మ సత్యము. జగత్తు మిథ్య. జీవుడు బ్రహ్మమే అని అన్నారు శంకరులు. దీని అర్థము బ్రహ్మము జీవుడు, బ్రహ్మము సత్యము కాన జీవుడు సత్యము. జగత్తు మిథ్య అనగా దాదాపు అసత్యమే అని అర్థము. బ్రహ్మము యొక్క ఊహయే ఈ జగత్తు. ఒక వ్యక్తితో పోల్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఊహ దాదాపు లేనట్లే. ఒక వ్యక్తి విశాలమైన మైదానమున ఉన్నాడు. అతడు తన ఎదురుగా ఒక గోడ వున్నట్లు ఊహించుకొన్నాడు. ఆ ఊహించుకున్న గోడ గుండా దూరి పోవలయునని సంకల్పించి ఆ ఊహ గోడ గుండా దూరిపోవుచున్నాడు. ఈ వ్యక్తి ముందు ఆ ఊహా గోడ ఊహా స్వరూపముగా ఉన్నను ఊహ అత్యల్పమైన స్వల్పము గావున ఆ గోడ దాదాపు లేనట్లే. కావుననే అత్యధికమైన సత్యమైన ఆ వ్యక్తి అత్యల్ప సత్యమైన ఆ గోడ గుండా దూరిపోవుచున్నాడు. “సదసత్ విలక్షణా మిథ్యా” అన్నారు శంకరులు. అనగా మిథ్య అనగా బొత్తిగా లేనిది అని చెప్పలేము. పూర్తిగా ఉన్నది అని చెప్పలేము. ఊహా గోడ ఊహా స్వరూపముగా ఉన్నది. ఊహ అనగా శక్తి. అన్నము తిన్నవాడే ఊహించగలుగుచున్నాడు. ఏలననగా తిన్న అన్నము జీర్ణమై శక్తిగా మారుచున్నది. ఈ శక్తిలో కొంత శక్తి మనస్సులోకి చేరుచున్నది. మనస్సులోకి చేరిన ఈ శక్తి వల్లనే మనస్సు అనేక ఊహలను చేయగలుగుచున్నది. అన్నము భుజించని వాడు నీరసస్థితిలో ఉన్నప్పుడు వాని మనస్సు ఎట్టి శక్తియు లేనందున పని చేయదు. అనగా మనస్సు ఏమియును ఊహించలేదు. కావున ప్రతి ఊహయూ శక్తిస్వరూపమే. శక్తి యున్నది కావున ఊహ ఉన్నది. కావున ఊహా స్వరూపమైన గోడ ఉన్నది. కావున ఈ గోడ బొత్తిగా లేదని చెప్పలేము. అయితే ఈ గోడ నిజముగా ఉన్నచో నిజమైన గోడలోకి దూరి పోలేకున్నాము. కావున నిజమైన గోడవలె ఈ ఊహాగోడ కూడ ఉన్నచో ఈ ఊహాగోడ గుండా దూరిపోవుట సాధ్యము కాదు. కావున నిజమైన గోడవలె ఈ ఊహాగోడ ఉన్నది అని చెప్పుటకు వీలు కాదు. కావున దీని సారాంశము ఏమనగా ఊహాగోడ అత్యంత సూక్ష్మ స్వరూపమైన శక్తిచే నిర్మించబడి ఉన్నది. కావున ఒక ఘన పదార్థమునకు ఉన్నంత సాంద్రత బలము లేదు. ఒక్క చిన్న ఘన పరమాణువు శక్తిగా మారినప్పుడు ఆ శక్తి కోటాను కోట్ల సంఖ్యలో అత్యంత సూక్ష్మకణములుగా మారుచున్నది. శక్తి కణములుగా ఉండునని ఐన్ స్టీన్ అను శాస్త్రవేత్త నిరూపించినాడు. ఒక ఘన పరమాణువు యొక్క భారమును కాంతి యొక్క, వేగము యొక్క వర్గముచే హెచ్చవేసినప్పుడు ఎంత విలువ వచ్చునో అంత శక్తి వచ్చునని సిద్ధాంతమును e = mc2 అను సూత్రము ద్వారా నిరూపించినాడు. అనగా ఒక ఘన పదార్థము యొక్క కణము ఎన్ని కోటాను కోట్ల శక్తి కణములుగ మారుచున్నదో ఈ సూత్రము వివరించుచున్నది. అన్ని కోటాను కోట్ల శక్తి కణముల చేత నిర్మించబడిన ఈ ఊహాగోడ మొత్తము కలిపి ఒక ఘనపదార్థ కణములకు సమానమగు చున్నది. ఒక టార్చిలైటు నుండి కోటానుకోట్ల కణములు గల ఒక కాంతిపుంజము వచ్చుచున్నది. దానికి ఎదురుగా ఆ కాంతిపుంజములోకి దూరి నడవగలము. కానీ అదే కాంతిపుంజము బదులు కోటానుకోట్ల నీటి అణువులతో కూడిన ఒక జలధార దూకుచున్నప్పుడు దానికి ఎదురుగా దానిలో ప్రయాణించలేరు. జలధారకు అంత బలము ఉన్నది అదే బలము కాంతి ధారకు లేదు. కారణమేమి?
ఆ నీటిలో గల ఒక ఆణువు శక్తిగా మారినచో కోటాను కోట్ల కణములు గల కాంతిధార ఏర్పడుచున్నది. కావున ఒక నీటిఅణువుకు ఎంత బలము కలదో అదే బలము ఆ కాంతి ధారకు ఉన్నది. అనగా ఒక నీటిఅణువును ఎదిరించుట ఎంత సులభమో ఆ కాంతిధారను ఎదిరించి నడచుటయు అంతే సులభము. ఈ జలధారయే బ్రహ్మము. అనగా అత్యంత బలము గల పరిపూర్ణసత్యము. ఈ జలధారలో ఉన్న ఒక్క జల అణువు కాంతిగా మారినట్లు బ్రహ్మముతో ఒక్క కణము ఈ సమస్త జగత్తుగా పరిణమించినది. దీనినే శృతి "పాదోఽస్య విశ్వా భూతాని" అని చెప్పుచున్నది. అనగా అనంత కోటికిరణములు గల సూర్యుడే బ్రహ్మము. ఆ అనంత కోటికిరణములలో ఒక్క కిరణము మాత్రమే ఈ సమస్త విశ్వముగా పరిణమించినది అని అర్థము. కావున ఈ జగత్తు అంతయు బ్రహ్మమునకు కేవలము ఊహ మాత్రమే. అనగా జలధార యందు కాంతిధార అత్యల్పమైనది. కావున జగత్తు మిథ్య ఎవరికి? బ్రహ్మమునకే అనగా కాంతిధార గుండా జలధార దూసుకుని పోగలదు. కానీ కాంతిధారలో ఉన్న కోటానుకోట్ల కణములలో ఒక కణమైన ఈ జీవుడు అనబడు మానవుడు కాంతిధారయగు ఈ జగత్తును ఎదిరించి దూసుకువెళ్ళగలడా. కావున జగత్తు మిథ్య అన్నది జీవులకు కాదు, బ్రహ్మమునకు. బ్రహ్మము జీవునిగా అవతరించినపుడు ఆ జీవునకు కూడ జగత్తు మిథ్యయే. ఏలననగా ఆ జీవుడు సాక్షాత్తు బ్రహ్మమైయున్నాడు. కావుననే తలుపులు లోపల గడియపెట్టి ఉన్నను మండనమిశ్రుని ఇంటి ద్వారము గుండా శంకరులు లోపలకు వెళ్ళినారు. కావున శంకరులకు మాత్రమే ఆ మూసిన తలుపులు ఊహాతలుపులుగా యుండి మిథ్యయై ఉన్నది. కావున శంకరులు అను జీవుడు బ్రహ్మమే. ఆయన "అహం బ్రహ్మాస్మి" అనుట సత్యమే కానీ ఆయన శిష్యుడు 'అహం బ్రహ్మాస్మి' అని అనుకుని ఆ తలుపులలో దూరి లోపలికి పోవుటకు ప్రయత్నించినపుడు అతడు లోపలకు పోలేక పోవుటయే కాక తలుపు నుదుటిపై కొట్టుకొని జామకాయ ప్రమాణమున బొప్పి కట్టుచున్నది. కావున శంకరులు చెప్పిన "జీవో బ్రహ్మైవ నాపరః" అని చెప్పినది బ్రహ్మము జీవునిగా అవతరించుచున్న వాని విషయముననే అని జగత్తు మిథ్య అను పరీక్ష నిరూపించుచున్నది.
★ ★ ★ ★ ★