home
Shri Datta Swami

 30 Sep 2025

 

భక్తియోగమునకు రాధ, నిష్కామ కర్మయోగమనకు హనుమంతుడు ఆదర్శము

[05.12.2003] భక్తియోగములో ఉన్మాదము తొమ్మిదవ అవస్థ. అట్టి ఉన్మాదములో ఎట్టి కర్మయు ఆచరించలేరు. దీనినే కర్మసంన్యాస యోగము అందురు. రాధ ఇట్టి కర్మసంన్యాస యోగమను ఉన్మాదదశ పొంది అత్యుత్తమ ఫలమును పొందినది. ఉన్మాదావస్థ స్వయముగా వచ్చిన మంచిదే కాని, దాని కొరకు ప్రయత్నించనక్కరలేదు. హనుమంతుడు ఎప్పుడూ ఉన్మాదమును పొందలేదు. ఆయన కూడ రాధతో సమానముగా అత్యుత్తమ ఫలమును పొందినాడు. ఎట్లు అనగా, ఆయన కర్మలను చేసియు, కర్మలను చేయని కర్మసంన్యాసియే అయినాడు. ఎవడు కర్మఫలత్యాగమును స్వామి కొరకు చేయునో ఆ కర్మఫలాసక్తి వానికి ఉండదు కావున వాడు కర్మలను చేయనివాడే అని "నైష్కర్మ్యసిద్ధిం పరమామ్" అను గీతా శ్లోకములో చెప్పబడినది. ఇట్లు కర్మ చేసియు, కర్మ చేయకుండుటను "కర్మణ్య కర్మ యః పశ్యేత్‌" అని గీతలో చెప్పబడినది.

అట్లే కర్మ చేయకుండియు, కర్మలను చేయుట గలదు. సోమరిపోతు ఎట్టి కర్మలను చేయక స్వార్థఫలాసక్తితో ఉన్నాడు కావున వాడు కర్మ చేసిన వాడే అని "అ కర్మణి చ కర్మ యః" అని గీతలో చెప్పబడినది. సీతాదేవికి రావణస్పర్శ అను కర్మ జరిగినను ఆ కర్మఫలములందు ఇష్టము లేదు కావున ఆ కర్మఫలమగు పాపము ఆవిడకు అంటలేదని అగ్నిదేవుడు చెప్పినాడు. రేణుకాదేవి గంధర్వుని స్పర్శ చేయకున్నను ఆ కర్మఫలమగు పాపము ఆ కర్మఫలమునందు స్వార్థమైన ఆసక్తి ఉండుట చేత పాపము అంటి శిరచ్ఛేదమునకు గురి అయినది. కావున కర్మసంన్యాసము, భక్తియోగము ద్వారానే కాక నిష్కామ కర్మయోగము ద్వారా కూడ లభించును. భక్తియోగమున కర్మసంన్యాసి రాధ. నిష్కామ కర్మయోగము ద్వారా కర్మసంన్యాసి హనుమంతుడు.

Swami

ప్రేమ తోడ తన కృష్ణుని తలచుచు - నిత్య ధర్మముల సంన్యసించిన
అట్టి రాధకే భక్తి యోగమున - అందరాని గోలోకమందెనే
బృందావనమున మండుటెండలో - ఇసుకరేణువుల నిప్పుల కణములు
నడచుచు మాధవ మాధవ యనుచును - విలపించి రాధ ప్రాణము విడచెను.
ముత్యాల హారమిచ్చిన గానీ - రాముడు లేడని కొరుకుచు విసరెను
నఖముల హృదయము చీల్చి చూపెగా - శ్రీరాముని హనుమంతుడటులనే
దత్త దేవుని పిచ్చిప్రేమతో నీ - నిత్యసాధన తపము సాగించు భక్తా!
నీ నిత్యసాధన తపము సాగించు||

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch