;

13 Dec 2025
[పీఠిక: 12-07-2014 గురుపూర్ణిమ నాడు భక్తులు శ్రీదత్తస్వామితో, ద్వారకాపీఠాధిపతి యగు శ్రీసంపూర్ణానందస్వామి, శ్రీ షిరిడీ సాయాబాబా మీద చేసిన ఆక్షేపణల గురించి ప్రస్తావించగా, శ్రీదత్తస్వామి ఇచ్చిన సందేశమే ఇది.]
ఈ రోజు గురు పూర్ణిమ. శ్రీ షిరిడీ సాయిబాబావారి మూలంగా ఈ పండుగ చాలా ప్రసిద్ధికి వచ్చినది. ఈ సందేశమునకు ఈ రోజు చాలా యోగ్యము. స్వామి సంపూర్ణానంద, లోతుగా విశ్లేషణ చేయకుండా బాబావారిపై ఆక్షేపణలనుచేసినారు. ఆయన చేసిన విమర్శలు ఆయననే కాక, ఆయన మూలగురువగు ఆది శంకరులనే వ్యతిరేకించు చున్నవి. హిందూమతములోని భిన్నసంస్కృతుల యొక్క మిశ్రమమైన స్మార్తమార్గమును శ్రీసంపూర్ణానందయే స్వయముగా అనుసరించుచున్నారు గదా.
1. భిన్న సంస్కృతుల మిశ్రమ - ఏకీకరణము:
రెండు భిన్న సంస్కృతి మార్గములను గురించి ఆలోచిద్దాము. ఈ రెండింటిలో ఒకటి సుప్రసిద్ధ శైవమతము, మరియొకటి సుప్రసిద్ధ వైష్ణవమతము. ఈ రెండు మతములు అంతరార్థ వేదాంతములందే కాక, బాహ్యసంస్కృతులలో సైతము పరస్పర విరుద్ధములు. మొదటి మతము వారు నుదిటిపై అడ్డరేఖలను, రెండవమతము వారు నుదిటిపై నిలువురేఖలను బొట్టుగా పెట్టుచుందురు. పాత చరిత్రను తిరగేస్తే, ఈ రెండుమతముల విరోధము ఎంత తీవ్ర మంటే - ఒకరి నొకరు చంపుకొనుట వరకు జరిగినది. ఈ మతముల ఆరాధ్య దైవములు (లక్ష్యములు) కూడా పూర్తిగా భిన్నములే. ఒక మత జనులు వారి దైవమునకు రెండవమతము వారి దైవము కూడా దాస్యము చేయునందురు. మొదటి మతము వారు తమ మతదైవమైన శివునకు, రెండవ మత దైవమైన విష్ణువు దాసుడందురు. రెండవ మతము వారు కూడా అట్లే విష్ణువునకు శివుడు భక్తుడందురు.
మూడవ మార్గమైన స్మార్త మతము, యీ రెండు మతముల సమన్వయము కొరకు ఉద్భవించినది. ఆదిశంకురులు, వారి శిష్యుడగు ఈ శ్రీ సంపూర్ణానందయును యీ మూడవ మార్గమునకు చెందినవారే. ఈ శ్రీ సంపూర్ణానందగానీ, మరి ఏ శంకర పీఠాధిపతి గానీ, నుదిటిపై అడ్డముగా బొట్టు పెట్టి, సంభాషణ సందేశము చివర ‘ఇతి నారాయణ స్మృతిః’ అని ముగించుట ఆచారమై యున్మది. ఈ స్మార్త మతము, రెండు మత లక్ష్యములగు శివ విష్ణువు లొకరే యనుటయే కాక, మార్గ సంస్కృతులను కూడా మిళితము చేయును. రెండు మతముల లక్ష్యమగు ఒకే పరమాత్మను చేరు ప్రయత్నమే రెండు మార్గములలోని సంస్కృతి తాత్పర్యము. స్మార్త మార్గస్థుడు, ఈ రెండుమతములకు సంబంధించిన పండుగలన్నియును చేయును. ప్రతి పండుగ లోను, ఒకే భగవంతుని చేరు ప్రయత్నము (సంస్కృతి) కూడా ఒక్కటే కావున మార్గసంస్కృతి కూడా ఒక్కటియే కావలయును. రెండు ఎట్లు అగును?
శ్రీ సాయిబాబా కూడా భిన్న సంస్కృతులు గల హిందూ-ముస్లిం మతములను అనుసరించుటను, స్మార్త మార్గము నవలంబించు శ్రీసంపూర్ణానంద ఆక్షేపించుట విచిత్రము. భిన్నమత సంస్కృతులు గల శివ, విష్ణువులలో ఒకే దైవత్వ మున్నపుడు, అదే దైవత్వము, భిన్నమత సంస్కృతి గల ‘అల్లా’లో ఏల ఉండరాదు? భిన్నమతముల లక్ష్యములలోను, మార్గసంస్కృతులలోను ఏకత్వమును సాధించిన స్మార్త మతమార్గమునకు మూలపురుషుడే ఆది శంకరులు. లక్ష్యము ఒకటే అయినప్పుడు, ఆ లక్ష్యమును చేరు ప్రయత్నమే సారాంశముగా గల భిన్న మత మార్గములు కూడా ఒకటియే కావలయును. వాటిలో విరోధము అసంభవము. భూమిపై నున్న ఒకే పట్టణమును చేరు మార్గములు వేరు వేరు కావచ్చును కాని, ఒకే దైవ ప్రీతిని లక్ష్యముగా గలిగి, ఆ లక్ష్యసాధన ప్రయత్న రూపములైన భిన్నమతములు మాత్రము వేరు వేరు కాలేవు. ప్రయత్న రూపమైన సాధన ఒకటియే గదా. భూమిపై నున్న మార్గములు వేరు వేరుగా నుండవచ్చును కానీ, సాధన తత్త్వము ఒకటియే గల మతములు వేరువేరుగా నుండజాలవు. ఒకే పట్టణమును చేరు భిన్నమార్గములను, ఒకే దైవమును చేరు భిన్న మతములతో పూర్తిగా పోల్చరాదు.
ఆదిశంకురులు మతలక్ష్యములైన దైవరూపములందే కాక, ఆయా దైవరూపములను ప్రసన్నము చేసుకొను మార్గములగు మతములందును ఏకత్వమును సాధించినారు. ఈ విశ్వమను బ్రహ్మాండమునకు ప్రతీకగా నిలచిన పిండాండమే హిందూమతము. హిందూమతము లోని మతముల యొక్క ప్రతీకలుగా విశ్వమతములను తీసుకొనవచ్చును. అన్ని మతముల దేవతా రూపములలో దైవత్వము ఒకటే అనియు, ఆ ఏకైక దైవప్రీతిని సాధించు ప్రయత్నములగు మత మార్గములు కూడా ఒకటియేనని బోధించు విశ్వమతములోని ఉపమతములే యీ విశ్వమందున్న మతములు. కావున హిందూ మతముతో విశ్వమతము పూర్తిగ పోలియున్నది. మతముల బాహ్యసంస్కృతులగు భాషాభేదము, రూపభేదము, వస్త్రధారణభేదము, ఆహారాదులలో భేదము మొదలగు భేదము లన్నియు పట్టించు కొనుటకు పనికిరానివి. ఏలనన, దైవము ఒకటియే, మరల, దైవసాధన ప్రయత్నమే ఏకతాత్పర్యముగా గల మతములు కూడా ఒకటే గదా.
దైవము ఊహకును అందని అతీతము అని మా సిద్ధాంతము. ఆ దైవము చైతన్యమని అద్వైతులందురు. మా యీమత భేదము గురించిన చర్చ ఇచట అప్రస్తుతము. దైవము అనూహ్యమైననూ, చైతన్య స్వరూపమైననూ, పైన చెప్పిన బాహ్యభేదము లేవియును దైవమును అంటజాలవు. శంకర మతములోను, బాహ్యములగు మిథ్యానామ రూపముల భేదము, సత్యమైన అంతఃస్వరూపము అగు బ్రహ్మమును స్పృశించ జాలదనియే గదా సారాంశము. ఈ శంకర సిద్ధాంతమును హిందూమతము లోని భిన్న మతములకే కాక, విశ్వమతములోని భిన్న మతములగు హిందూ, ముస్లిం, క్రైస్తవాది మతములకును ఏల వర్తింప చేయరాదు? హిందూమతమునకు ఒక సిద్ధాంతమును, ఇతర మతములకు మరియొక సిద్ధాంతమును వర్తింపచేయుట విజ్ఞత కాజాలదు. భారతదేశములోని హిందూమతమునకు, విశ్వములోని ఇతర మతములకు ఒకే తర్కమును అన్వయించ వలెను.
ఆదిశంకరులు హిందూమతములోని ఉపమతముల మధ్య నున్న అడ్డుగోడలను తొలగించినారు. ఒకే ఇంటిలో ఉన్న గదుల మధ్య గోడలను తొలగించి, మొత్తము ఇంటిని ఒకే హాలుగా చేయుటయే యీపని. శ్రీ సాయిబాబా ఇదే పనిని ప్రపంచములో నున్న మతముల మధ్య గోడలను తొలగించి వేసినారు. అంటే-వారు ఒకే హాలుగా మారిన ఇళ్ళను అన్నింటిని కలిపి ఒకే పెద్దహాలును చేసినారు. ప్రతి మతములోను, ఉపమతములను ఏకీకరణము చేయు ప్రయత్నము జరిగినది. ఇస్లాం మతములోను, ప్రవక్త మహమ్మదు రాకముందు అనేక ఉపమతము లుండెడివి. ప్రవక్త, ఈ ఉపమతముల మధ్య గోడలను తొలగించి ఒకే మతమును చేసి, ‘అల్లా’ అను పేరుతో ఒకే దైవమును స్థాపించినారు. హిందూమతములో శంకరులు చేసినపనినే, ప్రవక్త మహమ్మదు, ఇస్లాంలో చేసినారు. ఈ ఇరువురి ప్రయత్నముల వల్లను, హిందూమతము ఒక పెద్దహాలుగాను, ముస్లింమతము మరియొక పెద్దహాలుగాను మారినవి. ఇప్పుడు శ్రీ సాయిబాబా యీ రెండు పెద్దహాలుల మధ్య గోడలను తొలగించి ‘ఒకే ఒక పెద్దహాలును’ ఏర్పరిచినారు. ఈ విశ్వములోని అన్ని మతములను పెద్దహాలులను కలిపి, ఒకే పెద్దప్రపంచ హాలును నిర్మించినారు స్వామి వివేకానంద. ఇప్పుడు ఆదిశంకరులు, మహమ్మదు ప్రవక్త, సాయిబాబా, వివేకానందులలో ఏమి తేడా ఉన్నది? శ్రీ రామకృష్ణ పరమహంస గూడా అన్ని మతముల దైవరూపములలోను, అన్ని మతముల మార్గములలోను ఏకత్వమును అనుభూతిగా పొంది, దానిని ప్రకటించినారు. అన్ని మతముల లక్ష్యములలో ఏకత్వమే ఒకే దేవుడు. అన్ని మత మార్గములలో ఏకత్వము ఆ ఒకే దైవమును ప్రసన్నము చేసుకొను ఏకైకప్రయత్నమే. ఈ విషయము, శ్రీ సంపూర్ణానంద వాదించు మతసంస్కృతుల భిన్నత్వమును ఖండించుచున్నది. ఈ విషయములో ఆయన సాయిబాబాను దూషించినచో, వారి గురువగు ఆదిశంకరులను కూడా పరోక్షముగ దూషించినట్లే గదా.
To be continued...
★ ★ ★ ★ ★