;

14 Dec 2025
2. మతముల ఐక్యత నిగూఢతర్క సాధ్యము:
స్వామి వివేకానంద ప్రపంచ పౌరుల సభలో మతసామరస్యమునకై ప్రయత్నించినారు. ఈ సందేశము నిచ్చు దత్తస్వామి, ఆ సామరస్యమును నిగూఢ తర్కవాదముతో సాధించుచున్నారు. దీనికి కారణమేమనగా - ప్రతి మానవుడును తనలో నున్న అత్యున్నతమైన బుద్ధియోగమును సమాధానపరచగల తర్కముతోనే సంతృప్తిని చెందును. ఆ తర్కవాదమేమనగా –
శ్రీ సంపూర్ణానంద స్వామిజీ హిందూమతమునకు చెందినవారు. ఈ హిందూమత దైవమగు పరబ్రహ్మము యీ విశ్వమును సృష్టించినది కావున, యీ విశ్వములోగల అన్ని పాశ్చాత్యదేశములను కూడా పరబ్రహ్మమే సృష్టించినది గదా. ఈ భారతదేశములో అనేక దైవావతార పురుషులు హిందువుల కొరకు ఆధ్యాత్మిక జ్ఞానమును వర్షించినారు. అయితే, ఈ జ్ఞానామృతము భారతదేశములో కురిసిన సమయములోనే వెంటనే అన్ని పాశ్చాత్యదేశములకు చేరలేదు. పాశ్చాత్యదేశములు, భారతదేశమును 17వ శతాబ్దము లోనే కనుగొన్నవి. అప్పటివరకు, పాశ్చాత్యదేశములలో అనేక మనుష్యతరములు, యీ జ్ఞానామృతమును తెలుసుకొను అవకాశమే లేక అంతరించినవి. అయితే, విశ్వములోని అన్ని దేశముల జీవులును ఆ ఏకైక దైవమైన పరబ్రహ్మము యొక్క సంతానమే కదా (అహంబీజప్రదఃవీతా... గీత). మరి, 17వ శతాబ్దము వరకు భారతదేశజీవులగు కొందరు పుత్రులకే జ్ఞానామృతమునిచ్చి, యీ నిష్కారణ పక్షపాతము నేల దైవము చూపినది? దైవము విశ్వమును సృష్టిచేసినపుడు, సర్వవిశ్వజీవులకు ఒకే మాతృభాషగా సంస్కృతమును పెట్టియుండవలసినది. సృష్టించినపుడే, అన్ని దేశములను అనుసంధానము చేసి ఉన్నచో, సంస్కృతములో ఇచ్చట బోధించిన జ్ఞానామృతము వెంటనే అన్ని దేశములకు వ్యాపించి యుండెడిది. అప్పుడు విశ్వపితయగు దైవమునకు ఎట్టి పక్షపాత దోషము లేశమైనను వచ్చియుండెడిది కాదు గదా. దీనికి ఒకే ఒక సమాధానము తప్పవేరు మార్గము లేదు. అది ఏ మనగా - సృష్టించిన సమయము నుండి, విశ్వములోని అన్ని దేశములకు ఏకైక దైవమగు పరబ్రహ్మము అనేక రూపములలో అవతరించి, ఆయాభాషలలో ఈ జ్ఞానామృతమును బోధించినట్లు అంగీకరించవలెను. ఆయా దేశముల జీవుల గ్రహణశక్తి స్థాయిలననుసరించి భిన్నస్థాయిలలో యీ జ్ఞానామృతమును బోధించి యుండవచ్చును. సర్వమతదైవరూపములలో ఒకే దైవమున్నదనియు, ఆ దైవప్రీతిని సాధించు ప్రయత్నమే తాత్పర్యముగాగల మతములన్నియు ఒక్కటేననియు, యీ ఏకైక సమాధానమే నిరూపించుచున్నది. శ్రీ సంపూర్ణానంద, దీనిని అంగీకరించనిచో, దైవమునకు అంటు అకారణ పక్షపాత దోషమును గురించి సమాధానమీయవలెను. తమ మతమే నిజమైనది యని భావించు ప్రతి మతమునకును, ఈ పక్షపాత దోషము వెంబడించుచున్నది, కావున, సర్వమతములును ఈ సమాధాన సమన్వయము నంగీకరించక తప్పదు.
To be continued...
★ ★ ★ ★ ★