;

15 Dec 2025
3. శాకాహార మార్గము - దైవత్వము:
శ్రీ సంపూర్ణానంద, మాంసాహారి యగు శ్రీ సాయిబాబా దైవము కాదనుచున్నారు. ఆయనే శ్రీరాముని దైవముగా స్తుతించుచున్నారు. శ్రీరాముడు కూడా మాంసాహారియే కదా! సాయిని పూజించరాదని ఎట్లు చెప్పుచున్నారు? ఆహారము బాహ్యసంస్కృతియే. ఆయిననూ, ప్రాణివధ కారణమున మాంసాహారము పాపమే. కాని, భగవంతుడు ఒకచోట అవతరించినపుడు అచట నున్న జీవుల బాహ్యసంస్కృతిని తానూ అనుసరించి, వారితో ముందు సఖ్యతను ఏర్పరుచుకొనును. ఆ తరువాత వారికి జ్ఞానబోధను చేయుచు, పరమధర్మమైన అహింసామార్గమునకు వారిని నెమ్మదిగా మరలించును. బురదగుంటలో కూరుకొని పోవువారిని ఉద్ధరించుటకు రక్షకుడును, బురదగుంటలో దూకవలయును కదా. అట్లు దూకినప్పుడు తన దేహమునకును బురద అంటుకొనక తప్పదు. పరుగెత్తు ఆంబోతును నిలువరించుటకు ముందు, దానితో కూడా కొన్ని అడుగులు వేయకతప్పదు. అజ్ఞానులను ఉద్ధరించుటకు ముందు వారి అజ్ఞానమును కొంతకాలము అనుసరించుట, అవతారపురుషునకు తప్పదు. గాయపడిన జటాయుపక్షిని చూచి దుఃఖించిన శ్రీరాముని, ప్రేమతో మేక నెత్తుకొన్న క్రీస్తును, మాంసాహార విషయములో ఇట్లు అర్థము చేసుకొనవలెను. కానీ, శ్రీ సాయిబాబాను మాంసాహారి యనుట సరికాదు. మాంసాహార భక్తులకు, మాంసాహారమును వండించి వడ్డించినాడే తప్ప, తాను మాంసాహార భక్షణము చేయలేదు. భక్తురాలు గేదెను కొట్టినందుకే తన వీపుపై వాతను చూపి భూతదయను బోధించిన శ్రీసాయి, అమాయక జంతువధ వలన లభ్యమైన మాంసమును తినునా? శ్రీరాముని మాంసాహారమును క్షత్రియకుల ధర్మముగా చూచిననూ, తాను బ్రాహ్మణుడని ఎన్నోసార్లు ఎలుగెత్తి చాటిన శ్రీసాయి విషయమున దీనిని నమ్మశక్యము కాదు. మాంసాహారులెవరైన తమ పాపమును సమర్థించు కొనుటకు ఇట్లు శ్రీసాయిపై ఆరోపించి చెప్పియుండవచ్చును. కాదని, నీవు మూర్ఖముగా శ్రీసాయి మాంసాహారియేనని వాదించిననూ, కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లే వ్యర్థమగును. ఏలననగా – మాంసాహారమునకును - దైవత్వమునకును ఎట్టి సంబంధము లేదని శ్రీరాముని విషయములో తేలినది కదా.
శ్రీ సాయిబాబా మేకను స్వయముగా చంపినారన్న మీ ఆక్షేపణయును పూర్తిగ అసత్యము. ఆయన ఒక మేకను చంపమని ఒక బ్రాహ్మణ భక్తుని ఆదేశించగా, ఆ భక్తుడు చంపుటకు సిద్ధమయ్యెను. అప్పుడు శ్రీసాయి భక్తుని వారించి ‘నేనే చంపెదను’ అనెను. వెంటనే మేక భూమిపైపడి చనిపోయెను. దీని ద్వారా శ్రీసాయి సృష్టి స్థితి లయములు భగవంతుని అధికారములనియు, భగవంతుడు నరావతారమున జ్ఞాన బోధకుడనియు సూచించెను.
To be continued...
★ ★ ★ ★ ★