;
home
Shri Datta Swami

 17 Dec 2025

 

శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-5)

6. భగవదవతారముల సంఖ్య :

భాగవతంలో కలియుగ అవతారముల సంఖ్య 22 అనియు, వాటిలో శ్రీసాయి పేరులేదని మీరు ఆక్షేపించుటలో మీరు చూపిన పాండిత్యము మీ మూలమునకే ముప్పుతెచ్చుచున్నది. ఆదిశంకరులు భగవదవతారమని వేదములోనే చెప్పబడియున్నది (వ్యుప్తకేశాయచ). శివుడే ముండిత శిరస్కుడై వచ్చునని ఈ వేదమంత్రార్థము. అయితే, ఆదిశంకరులు ఈ 22 అవతారములలో చెప్పబడలేదు. భాగవతము కన్నను వేదప్రామాణ్యము అధికము (శ్రుతిరేవగరీయసీ). ఎప్పుడు ఏ అవసరము వచ్చినా భగవంతుడవతరించునని గీతావచనము (యదాయదాహి...), ఈ పురాణోక్త సంఖ్య భగవంతుని నియమించలేదు. ఆదిశంకరులు కూడా 22 సంఖ్యలో చెప్పబడలేదని భగవదవతారము కాదని శ్రీ సంపూర్ణానంద, కర్మకాలి, చెప్పుదురా ఏమి!

7. గంగాస్నాన నిషేధము :

శ్రీసాయి భక్తులు గంగా స్నానము చేయరాదని శ్రీ సంపూర్ణానంద నిషేధించుట వారి ఘనీభవించిన అజ్ఞానపరాకాష్ట. ఏ నదీ జలమైననూ, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ 2:1 నిష్పత్తిలో కలిసి సమ్మేళనముగా మారుటయేకదా. నదీ జలములో కలుషములతో బాటు ఖనిజములు కూడా ఉండును. వీటిని వదిలినచో అన్ని నదీజలములు ఒక్కటియే. అజ్ఞాన దోషములను సూచించు కలుషముల పరిమాణము ఎక్కువగా గంగాజలములోనే నున్నది. ప్రస్తుత గంగాజలము మీ అజ్ఞాన కలుషితమైన బుద్ధిని సూచించుచున్నది. అజ్ఞాన రహితులగు శ్రీసాయి భక్తులకు గంగాజలస్నాన నిషేధము యీ విధముగా సమంజసమేనేమో! ప్రస్తుత ప్రభుత్వము గంగాజల శుద్ధిని గురించి చేయుచున్న ప్రయత్నము, మీ బుద్ధిని శుద్ధిచేయుటకై చేయు ప్రయత్న రూపమైన యీ సందేశము వలెనున్నది. ఎన్నో నదులు గంగవలె హిమాలయములో ఉద్భవించి సాగరమును చేరుచున్నవి. మిగిలినట్టి ఆ నదులలో స్నాన నిషేధమును చేయక, కేవల గంగనే ఎట్లు నిషేధించగలరు? అన్ని స్తోత్రములలోను గొప్పది యగు మహిమ్నః స్తోత్రము (మహిమ్నోనాపవరాస్తుతిః) లో- నదులన్నియు నేరుగా కానీ వక్రముగా కాని పయనించుచున్నను, ఒకే సముద్రమును చేరునట్లు, భిన్న మార్గ సంస్కృతులు కల మతము లన్నియు ఒకే భగవంతుని చేరుచున్నవి (పయసామర్ణవ ఇవ) అని చెప్పబడినది.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via