;
home
Shri Datta Swami

 18 Dec 2025

 

శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-6)

8. వేదమంత్రముల నుదహరించుట :

వేదవచనములను ప్రమాణముగా తన ఉపదేశములలో చూపని శ్రీసాయి, దేవుడు కాడని శ్రీ సంపూర్ణానంద చేయు విమర్శ అనాలోచితము. వాల్మీకి రామాయణములో వాలి, జాబాలి మొదలగు వారికి ఉపదేశములను చేయునపుడు కూడా శ్రీరాముడు ఎట్టి వేదవాక్యములను ఉదహరించలేదు. శ్రీరాముడు బోధించినవి వేదములో నున్నవే కాని, అవి శ్రీరాముని సొంత మాటలలో బోధించబడినవి. అట్లే శ్రీసాయి బోధలన్నియును, వేదములలో కనిపించునవే కాని, అవి శ్రీసాయి సొంత మాటలలో నున్నవి. వేదమనగా (విదుల్‌ - జ్ఞానే) జ్ఞానమని అర్థము. జ్ఞానము అనగా మాటలేవి యైనను వాటిచే చెప్పబడు భావమే ప్రధానము. అదే భావము చెప్పబడినప్పుడు, అవే మాటలు అక్కరలేదు. వేదము యొక్క భావము చెప్పబడగానే, వేదము చెప్పినట్లే. గీతను చెప్పినపుడు కృష్ణుడు కూడా వేదవాక్యముల నుదహరించలేదు. అయినా, వేదార్థసారమే గీత. అయితే, శంకరులు తన భాష్యములలో వేదవాక్యములను ప్రమాణముగా చూపినారు. పండితులతో వాదించు పరిస్థితులలో పండిత సంప్రదాయము ననుసరించి అట్లు ఉదహరించినారు. అట్లు ఉదహరించనిచో, పండితులు తృప్తినొందరు. వేదవచనములను ఉదహరించుటయే దైవత్వమన్నచో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దైవము కారు. కేవలము శంకరులే దైవము అగుదురు. దైవము కాని పండితులు కూడా అట్లు వేదమును ఉదహరించగలరు. కావున వారు దైవమగుదురా? వేదముల నుదహరించని శ్రీసాయి - శ్రీరాములలో తేడాలేనందున, దైవము కాని శ్రీసాయిని పూజించు వారు, దైవమైన శ్రీరాముని పూజించరాదు అని ఎట్లు తేడాను ఇరువురిలో చూపగలరు?

నిశితముగ చూచినచో, బ్రహ్మసూత్రములు (శాస్త్ర యోనిత్వాత్‌) భగవంతుడే వేదముల కర్తయని పలుకుచున్నవి. గీత కూడా ఇదే చెప్పుచున్నది (వేదాంతకృత్). భగవంతుడు నరావతారమును ధరించినపుడు తన మాటలను తానే చిలుకవలె బట్టీ పట్టిన రీతిగా పలుక నవసరములేదు. తన మాటల భావమునే తాను వేరు మాటలతో వేరు సమయమున చెప్పవచ్చును. శంకరులు కూడా, వేదార్థమునే తన మాటలలో శ్లోకరూపమున స్తోత్రములుగా చెప్పినారు కదా. వాటికి ప్రామాణ్యము లేదా? వేదవాక్యములలోనే ఉదహరించి, వాటి అర్థమును వక్రీకరించినపుడు వేదమును ఉదహరించనట్లే అగును. వేదవాక్యములను ఉదహరించకపోయిననూ, వాటి యొక్క సత్యార్థమును వేరు మాటలలో వ్యక్తపరచిననూ, వేదమును ఉదహరించినట్లే. భగవదవతార పురుషడు మాట్లాడినపుడు, ఆయన మాటలన్నియు వేదమే. పండితులు భాషించినపుడు, వారి భావములు వేదసమ్మతములని తెలుపుటకు, వేదవాక్యముల నుదహరింతురు. నరరూపములో పలుకుచున్న భగవంతుని వాక్యములు లోపలనున్న భగవంతునివే కాని, బాహ్య నరరూపమునకు సంబంధించినవి కావు. భగవంతుడు వేరు భాషలో చెప్పుభావములను సమర్థించు కొనుటకు వేరొక భాషలో చెప్పిన మాటలను (వేదమును) ఉదహరించ నవసరము లేదు. తన మాటలకు తన మాటలనే ఎట్లు ప్రమాణముగా చూపుకొనును? భగవంతుడు చెప్పిన భావములను వేదములో అన్వేషించవచ్చునే కాని, ఆ భావమును వ్యక్తపరచు మాటలు యథాతథముగా, వేదములో ఉన్నవా? లేవా? అని వెతుక పనిలేదు. భావమే జ్ఞానము. జ్ఞానమే వేదము.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via