;
home
Shri Datta Swami

 19 Dec 2025

 

శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-7)

9. విగ్రహారాధనము :

శ్రీసాయి విగ్రహముల నారాధించు వారు అపమార్గములో నున్నారని శ్రీ సంపూర్ణానంద ఆక్షేపించుట పిచ్చితనము. ఆరాధన లక్ష్యము సత్యమై, చేతనమై, యోగ్యమై ఉండవలెనని వారు చెప్పుచున్నారు. శ్రీసాయి విగ్రహములకు ఈ మూడింటిలో ఏ లక్షణము లేదని వారు చెప్పుచున్నారు. మిగతా దేవాలయ విగ్రహములకు ఈ మూడు ఉన్నవి కావున పూజ్యములని వారి భావన. ఈ మూడు, ప్రాణప్రతిష్ట ద్వారా సిద్ధించుచున్నవని వారి మతము. ఈ విధిలో ఆయా విగ్రహములలోకి ఆయా దేవతలను ప్రవేశింప చేయుటకు ఆయా వేదమంత్రములను పఠించుచున్నారు. కాని శ్రీ సాయికి సంబంధించిన వేదమంత్రమేమీ లేకపోవుటచేత ప్రాణప్రతిష్ట వ్యర్థమగును. కావున శ్రీసాయి విగ్రహములు పూజాయోగ్యములు కావని వారి మొండిమతము, మూడు కారణముల వలన అంగీకారము కాదు.

i) మీరు చెప్పిన ఈ మూడు లక్షణములు ఈ తంతువులలో కావలయునని వేదము ఎచ్చట చెప్పినదో మీరు చెప్పలేదు. వేదములలో ఇవి ఎచ్చటను కానరాకుండుట చేత, వేదమునుదహరించనిచో ప్రామాణ్యతలేదని మీరు చెప్పినందున, వీటికి ప్రామాణ్యత లేదు.

ii) ప్రాణప్రతిష్టలో మంత్రములో ఎచ్చటనూ దేవతా నామములేదు. అవి కేవలము జడవిగ్రహములో ప్రాణమును తెచ్చుటకు వినియోగింపబడుచున్నవి. కావున, శ్రీసాయికి సంబంధించిన వేదమంత్రములు లేవని మీరు చెప్పుట హాస్యాస్పదము.

iii) జడ విగ్రహములలో చైతన్యమున్నట్లు భావించి సేవించవలయునను తాత్చర్యమును గ్రహించక, ఈ విధి ద్వారా నిజముగా ప్రాణప్రవేశము జరుగునట్లు తలచుట మూర్ఖత్వము. అట్టి తాత్పర్యమును శ్రీసాయి విగ్రహములలో కూడా నుంచి సేవించవచ్చును కదా. జడ విగ్రహములో యీ తంతువు ద్వారా నిజముగా ప్రాణము వచ్చుట లేదు. ఈ తంతువు తరువాత చలనము, చూపు, వినుట, భాషించుట మొదలగు ప్రాణ లక్షణములు విగ్రహములో నిజముగా వచ్చుటలేదు. కనీసం ఒక ఫ్యానులో జడశక్తియగు విద్యుత్తు ప్రవేశించగనే చలనము కనపడుచున్నది. విగ్రహములో కనీసం చలనలేశమైనను లేదు. ప్రాణప్రవేశము అనుభవవిరుద్ధము కావున ప్రామాణికము కాదు. ప్రమాణములలో శ్రుతి, స్మృతి, యుక్తి మరియు అనుభవము శాస్త్రసమ్మతములు. చివరిదగు అనుభవము వ్యతిరేకించుచున్నది కావున ఇది ఏ విధముగాను ప్రామాణికము కాదు.

ప్రాణప్రతిష్ట జరిగినా, జరుగకపోయినా, తేడాలేదు. విగ్రహములు ప్రతీకోపాసన కిందికి వచ్చును. అవి భగవంతుని ప్రతీకలే కాని, వాటిలో భగవంతుడులేడు (నతస్యప్రతిమా..., ప్రతిమాహ్యల్బబుద్ధీనాం...). ప్రాణప్రతిష్ట జరిగిననూ అవి సాక్షాదుపాసన కిందికిరావు. కేవలము నరావతారములే సాక్షాదుపాసన కిందికివచ్చును (మానుషీం తనుమాశ్రితమ్‌... గీత). కావున, శ్రీసంపూర్ణానంద పట్టుదల వ్యర్థము. ఈ విధిలో ఏమియు లేకున్నను, ఇది ఒక సత్యమును సూచించుచున్నది. అది ఏమనగా - జడవిగ్రహమైన జడశరీరము, ప్రాణ ప్రవేశము వలన చేతనమైన మానవుని సూచించుచున్నది. అది సూచించు తాత్పర్యమును గ్రహించవలయును కానీ, దానితో నిజముగా అది జరుగుచున్నది అని భావించరాదు. మానవుని లోనికి మాత్రమె తాను ప్రవేశింతునని తాత్పర్యము. జడము లోనికి ప్రవేశించననియే సారాంశము. జ్ఞానబోధ చేయుటకు చేతనమైన నరరూపము కావలయునన్నదే విషయము. అట్టి నరావతారమునే పూజించి సేవించమన్నదే పరమార్థము. జడస్తంభములోని చైతన్యరూపుడైన పరమాత్మ నరసింహావతారములో ప్రవేశించినాడుగదా అన్న మీ వాదము వివేక విచార రాహిత్యమును సూచించుచున్నది. జడస్తంభమును పగులగొట్టగా చైతన్యరూపమైన నరసింహ రూపము ద్వారా పరమాత్మ వ్యక్తమైనాడే తప్ప, చైతన్య ప్రవేశము ద్వారా జడస్తంభము కదిలి గర్జించి అసురసంహారము స్వయముగా చేయలేదు. ఇచట ప్రాణప్రతిష్టా విధి యేమియును జరుగలేదు. కావున, పూర్తిగా ఇది అప్రస్తుతము. భక్తాగ్రేసర రక్షణార్థమై జరిగిన ప్రకృత్యతీత మహిమ ఇది. ప్రాణప్రతిష్ట కర్మచేత సిద్ధమైనది కాదు. ఇది విగ్రహారాధన విషయమునకు చాలా దూరముననున్నది. సింహముఖ నరరూపము ప్రాణి రూపమైనది కావున ప్రాణియందే భగవదావేశము జరుగునని ముఖ్యార్థము. ఇచ్చట నరసింహ శరీరము, కాలవ్యవధి లేనందున, భగవంతుని చేత సృష్టింపబడినది. అట్టి విలక్షణప్రాణి - ఉపాధి, ప్రకృతి సిద్ధము కూడా కాదు. ప్రాణి శరీరమునే భగవంతుడావేశించునన్న నియమము ఇచ్చట కూడా యథాతథముగ పాటించబడినది.

జడవిగ్రహము, ప్రాణరహితమైన జడశరీరమును సూచించుచున్నది. అట్టి జడవిగ్రహము లోనికి ప్రాణప్రతిష్ట ద్వారా నిజముగ ప్రాణప్రవేశము జరిగినచో, ఆ విగ్రహమే చేతన నరశరీరముగ మారును అన్న విషయమే ఇచట సూచితము. ప్రాణప్రతిష్ట ద్వారా నిజముగ విగ్రహములోనికి ప్రాణప్రవేశము జరుగలేదు, నిజముగా విగ్రహము నరశరీరముగ మారనూలేదు. దీనిచే గ్రహించవలసినది ఏమనగా - చేతనమైన నరశరీరము = జడ విగ్రహము + ప్రాణము అనియే. ప్రాణములేని నరశరీరము సాక్షాత్తు జడవిగ్రహమే. కేవల జడవిగ్రహ పూజ కన్ననూ, చేతనమైన, నరశరీరమును ప్రవేశించిన భగవంతుడగు అవతారపురుషుని పూజయే చేయవలయునన్న సందేశమే జడవిగ్రహమునకు ప్రాణప్రతిష్ట చేయుట. సూచించిన అర్థమును గ్రహించక, సూచించు జడ విగ్రహములోనికే ప్రాణము ప్రవేశించినదన్న భ్రమతో, దానినే పూజించుట అవివేకము. అయితే, ప్రారంభదశలో నున్న వారు దానిని దైవ ప్రతీకగా భావించి పూజించుట తప్పదు. ప్రారంభదశలో దోషములు తప్పనిసరి (సర్వారంభాహి... గీత), కావున ప్రాణప్రతిష్ట తరువాత కూడా జడవిగ్రహము, జడవిగ్రహమే. గీతాచార్యుడు, అవతారపురుషుడగు కృష్ణుడు, తాను సచేతనమైన నరశరీరమును ఆశ్రయించి అవతరించెదనని గీతలో చెప్పినాడు (మానుషీం తనుమాశ్రితమ్‌...).

శ్రీ సంపూర్ణానంద చెప్పిన మూడు శబ్దములకు అర్థము నిట్లు ప్రతిపాదింపవచ్చును. దైవానుగ్రహము వలన, నీవు చేయు ప్రాణప్రతిష్ట ద్వారా, నిజముగా (సత్య) జడవిగ్రహములోనికి ప్రాణ ప్రవేశము జరిగి, అది సచేతనమైనచో (చేతన), అట్టి మానవ శరీరము భగవత్ర్పవేశమునకు యోగ్యము (యోగ్యత) అగును అనియే. దీని అర్థము అద్వైతులు భ్రమపడినట్లు, ప్రతి సచేతన శరీరములోనికి భగవత్ర్పవేశము జరిగినట్లు కాదు. కొందరు విశిష్ట భక్త సేవకులగు వారి యందు దైవమావేశింప, శ్రీసాయి, శంకర, రామ, కృష్ణ మొదలగు అవతారములు, ఆయా ప్రత్యేక కార్యక్రమముల కొరకు దైవసంకల్పముననుసరించి ప్రకటితమగును. జడములోనికి ప్రాణప్రవేశము, ప్రాణిలోనికి దైవప్రవేశము - ఈ రెండును భగవత్సంకల్పముచే జరుగును తప్ప ఏ జీవునికి శక్యముకావు. జడము + ప్రాణము = చేతన శరీరము అను సమీకరణములో ఎడమ భాగమే కుడిభాగము కాదు. ఎడమ భాగము కుడి భాగముగా మారవలెను. ఈ మార్పు దైవవశములో నున్నది కాని, ప్రాణప్రతిష్ట చేయు పురోహితుడగు ఏ జీవునివశములోను లేదు. ఎంత గొప్ప విజ్ఞానవేత్తయైనను ఈ మార్పును చేయజాలడు. ఈ మార్పు నిజముగా జరుగనపుడు సమీకరణములోని కుడిభాగము సున్నా అగును. అప్పుడు ఏమి మిగిలినవి? - జడవిగ్రహము మరియు ప్రాణప్రతిష్టతంతువు మాత్రమే. అప్పుడు ప్రాణప్రతిష్ట జరిగిన విగ్రహము, ప్రాణప్రతిష్ట జరగని విగ్రహము, ఈ రెండు విగ్రహములు సమానమైనపుడు, ప్రాణప్రతిష్ట జరగని శ్రీసాయి విగ్రహముల కన్ననూ ప్రాణప్రతిష్ట జరిగిన దేవాలయ విగ్రహములు ఎట్లు విశిష్టము లగును?

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via