;

20 Dec 2025
10. జీవోద్ధరణము కొరకు దైవము సృష్టిలోనికి ప్రవేశించును:-
“అత్రిముని అనసూయలకు ముగ్గురు పుత్రులు పుట్టిరి. మొదటివాడు చంద్రుడు. మూడవవాడు దుర్వాసముని. మధ్యవాడు దత్తాత్రేయముని. శ్రీసాయి దత్తావతారమన్ననూ, దైవత్వము ఎచ్చటనూలేదు” అని శ్రీ సంపూర్ణానంద పలుకుట, వారు ఇంకను బాల్యావస్థలోనే ఉన్నారని నిరూపించుచున్నది. భాగవతకథాను సారముగా - అత్రిముని ఏకైక పరమాత్మ అగు పరబ్రహ్మ దర్శనము కోరి, ఋక్ష పర్వతమున, అనసూయతో కలిసి తపమును చేసెను. సృష్టి స్థితి లయములు ఒకే ఒక పరమాత్మ చేయుచున్నాడని వేదము పలుకుచుండ, సృష్టికర్తయగు బ్రహ్మ, స్థితి కర్తయగు విష్ణువు, లయకర్తయగు శివుడు, వేరువేరుగా వేరువేరు లోకములందుండుట స్పష్టముగాకనిపించుట ఎట్లు కుదురును? ఇదియే అత్రి సందేహము. త్రిమూర్తులు ముగ్గురును సాక్షాత్కరించి ‘మేము ముగ్గురు ఒక్కటే. సృష్టి స్థితి లయములను చేయుచున్నాము’ అనిరి. అత్రి దీనికి అంగీకరించలేదు. “త్రిమూర్తులు వేరువేరుగా కనిపించుచుండగా, ఒకే స్వరూపము ఎట్లు అగుదురు?” అని ప్రశ్నించెను. అత్రి శబ్దమునకు అర్థము కూడా ‘ముగ్గురు కాదు’ అనియే. కావున అత్రి సార్థకనాముడయ్యెను. అప్పుడు త్రిమూర్తులు కలిసి ఏక స్వరూపములో దర్శనమిచ్చిరి. ఆ ఏక స్వరూపములో బ్రహ్మ - విష్ణు - శివ ముఖములున్నవి. అయినను, వ్యక్తి ఒక్కరే. ఈ స్వరూపము, వేదము బ్రహ్మమును గురించి యిచ్చిన నిర్వచనమునకు సరిగా సరిపోయెను (యతోవాఇమాని..., ఏకమేవాద్వితీయం...). ఇదియే త్రిమూర్తులకు మూలమైన ఏక పరబ్రహ్మ స్వరూపము. అనూహ్యమైన పరబ్రహ్మము ఈ ఏకస్వరూపములో నున్నది, విడివిడిగా త్రిమూర్తుల స్వరూపములలోను ఉన్నది (అవిభక్తం విభక్తేషు... గీత). అనూహ్య పరబ్రహ్మమునకున్న అనూహ్య శక్తి మహిమ ద్వారా ఇది సాధ్యము. లౌకికసృష్టికి అతీతమైన పరబ్రహ్మశక్తియందు, లౌకికసృష్టి భాగము లందే ప్రవర్తించు తర్కము పనిచేయదు.
ఈ ఏకైక పరమాత్మ స్వరూపము, అనసూయ గర్భమున త్రిమూర్తులుగా మారి, చంద్ర - దత్త - దుర్వాసుల రూపములలో ముగ్గురు పుత్రులుగా గోచరించినది. బ్రహ్మాంశ - విష్ణు అంశ - శివాంశలు ముగ్గురి యందు వేరువేరుగా నుండుటచే ఒకటియే మూడగుట ఇది. ప్రథముడు, తృతీయుడు, తమ బ్రహ్మ - శివ అంశలను దత్తునకు యిచ్చి వెడలిపోయిరి. అనగా త్రిమూర్తుల ఏకస్వరూపమై దత్తాత్రేయరూపము ఏకముఖముతో నిలచినది. ఏకముఖమైనను, మిగిలిన రెండు ముఖముల శక్తులును అందే ఇమిడియున్నవి. దీనిని స్పష్టపరచుటకు, ఏకస్వరూపము త్రిముఖములతో గోచరించినది. వేదపండితుడగు అత్రి సంశయము దీనితో పటాపంచలైనది. ఇంత మహత్తర అంతరార్థము కల ఈ కథను కేవలము ఒక ముని వంశచరిత్రగా మీరు చూచుట, మీ కన్నులకే కాక, మీ బుద్ధికిని పట్టిన చత్వార దోషమును స్పష్టము చేయుచున్నది. ఇట్టి మీరు ఆదిశంకరులను గురించి కూడా “అతడొక కేరళదేశీయుడైన నంబూద్రి బ్రాహ్మణయువకుడు. వేదశాస్త్రములను బాగుగ అధ్యయనము చేసిన పండితుడు, సంపూర్ణ జీవితానుభవజ్ఞానము లేనివాడు” అనియు చెప్పగల మహానుభావులు! ఆయన యొక్క భాష్యములను, ఆయన యొక్క జీవిత పరమార్థమును అంతరదృష్టితో నిశితముగా పరిశీలించిన కాని, ఆయన సాక్షాత్తు శంకరుల అవతారమని అర్థము చేసుకొనలేరు.
To be continued...
★ ★ ★ ★ ★