;

21 Dec 2025
ఉపసంహారము :
ఊహలకు సైతము అందని (నైషాతర్కేణ..., మాంతువేద న...) పరబ్రహ్మము, నర శరీరియగు ఒకానొక భక్తజీవుని ఆవేశించి, నరావతారముగ యీ లోకమున ప్రకటిత మగుచుండును. ధర్మమునకు సంభవించిన క్షోభను నివారించి శాంతిస్థాపనము చేయుటకును, మోక్షా సక్తులకు ముక్తి మార్గమునుపదేశించుటకును, భక్తులకు దర్శన, స్పర్శ, సంభాషణ, సహవాసములను చతుర్విధములగు అనుగ్రహములను ప్రసాదించుటకును, ధర్మమోక్షములందు జీవులను నడిపించుటకు కావలసిన జ్ఞానమును ప్రచారము చేయుటకును, నరావతార ప్రయోజనములుండును. ఇస్లాం - హిందూ మతముల విరోధము యొక్క కాలక్రమ ఫలితములే యీనాటి మారణకాండలు. ఈ విరోధమును పరిహరించి ఆనాడే ముందుగా, మతసమైక్యతను సమగ్రముగా స్థాపించుటయే దీనికి శాశ్వత పరిష్కారము. దీనికొరకే శ్రీ షిరడీసాయి, శ్రీ సత్యసాయి అవతారములు ప్రకటితమైనవి. దీనిని అనుసరించియే కార్యక్రమము యొక్క స్వరూపము సంధానమగును. మతధర్మముల విరోధము లోకక్షోభకు దారితీయగా, మోక్షమార్గసాధన సైతము అల్లకల్లోలమగును. అట్టి ప్రత్యేక కార్యక్రమము యొక్క ప్రత్యేకమైన విధానము నర్థము చేసుకొనలేక, అవతారపురుషుని కీర్తిని సహించలేక, సాటి నరరూపముననున్న నరావతారము పైనున్న అసూయతో, స్వార్థపూరితమైన దురహంకారముతో, అవతార పురుషులను ఆక్షేపించుట (అవజానంతిమాం...) కృష్ణావతారము నుండియే గోచరించుచున్నది. నరావతారముగా నరులకు దత్తమైన ప్రతి అవతార పురుషుడును దత్తుడే. ఊహాతీతమైన పరమాత్మ, నరులకు నరరూపమున, చక్షువులకే గోచరించుట దత్తతత్త్వము, బుద్ధితర్కములకును అందని దైవమ, కన్నులకే అందుట, దత్త శబ్ద సారాంశము.
ప్రతి మానవ జీవునకును, తోటిమానవునిపై అసూయ కలుగుటకు కారణము - ఇరువురికిని ఒకే పార్థివమైన శరీర ముండుటయే. ఇదే మానవుడు, తేజోరూప శరీరధారులగు దేవతలపై శ్రద్ధను చూపును. సాటి మానవశరీరమున నున్న భగవంతుని సైతము తిరస్కరించి, తేజోరూపులగు దైవసేవకులగు ఇంద్రాది దేవతల నారాధించును. యాదవులు మానవ శరీరమున నున్న పరమాత్మయగు కృష్ణుని గుర్తించలేక, దైవ సేవకుడైన తేజోరూపియగు ఇంద్రుని ఆరాధించుట ఇదే. కాటన్ చొక్కావాడు, సిల్కు చొక్కావాడగు ప్యూన్‌ను అయినా గౌరవించునుకాని, కాటన్ చొక్కాలో నున్న కలెక్టరును సైతము గౌరవించడు. ఇదే మానవులు మానవ శరీరములను త్యజించి, మరణానంతరము తేజోరూపములను ధరించిననూ శివాది తేజోరూపములందున్న భగవంతునిపై నిర్లక్ష్యము చూపుదురు. ఇట్లు మానవుడు, ఇచ్చటను, అచ్చటను దైవమును గ్రహించక ఉభయ భ్రష్టులగుచున్నారు (మహతీవినష్టిః). దీనికి కారణము, తమ శరీరము వంటి శరీరము పరమాత్మకున్నప్పుడు నిర్లక్ష్యము వలన కలుగు ద్వేషమే (ప్రత్యక్షద్విషః). ఇట్టి అసూయ - అహంకారులగు మానవులు, నరరూపమున సాక్షాత్తుగ లభించిన దైవమును సేవించక, దైవమునకు ప్రతీకలగు విగ్రహములనే సేవింతురు. ఇట్టి సామాన్య మానవుని స్థితియే శ్రీ సంపూర్ణానంద స్వామీజీకిని ఉండుటయే, యీ విమర్శకు కారణము. ఇట్టి అయోగ్యులగు మానవులు దరిచేరకుండా చేయుటకే, రజస్సు - తమస్సు గుణములను ప్రకటించి, దైవము తన కార్యమును చేసుకొనును. కృష్ణుని జారచోరత్వము, సాయి ధూమపానము, యీ కోవకు చెందినవే. గుర్తించు సాధకులకు సైతము ఇవి వారి విశ్వాస బలపరీక్షలగును. ఈ రజస్సు - తమస్సు గుణములు, ఆ గుణములు కల మానవులతో కలిసిపోవుటకును ఉపకరించును. కొంతకాలము కలిసిపోయి, వారిని క్రమముగా దైవము బోధలతో ఉద్ధరించును. అన్ని కోణములలో అవతారతత్త్వమును అర్థము చేసుకొనలేని మూఢులు, ప్రత్యక్షమైన దైవమును త్రోసిపుచ్చి, శాశ్వతముగ నష్టపోవుచున్నారు.
“భల్లూకపట్టు” అను సామెత ప్రకారం - రామభక్తుడైన జాంబవంతుడను భల్లూకము, ఒకే విష్ణువు యొక్క అవతారములగు రామ - కృష్ణుల యొక్క బాహ్య భేదమును తెలుసుకొనలేక, కృష్ణునితో మొండిగా ఎన్నో దినములు యుద్ధము చేసెను. అట్లే శ్రీ సంపూర్ణానంద, ఒకే శివుని అవతారములగు షిరిడీసాయి (షిరిడీసాయి - శివ, సత్యసాయి - శివ శక్తి, ప్రేమసాయి - శక్తి అవతారములు) మరియు శంకరుల బాహ్యభేదము వలన భ్రమతో, షిరిడీసాయిని విమర్శించుచున్నారు. శైవ వైష్ణవ మత సమన్వయకర్త శంకరులు, హిందూ - ఇస్లాం మత సమన్వయకర్త షిరిడీ సాయి, ఆయాకాలానుగుణముగ వేషభాషలలో భేదము కలిగి ఉండవచ్చును. విష్ణు – శివ - అల్లాలతో ఒకే ఊహాతీత పరబ్రహ్మము ఉన్నందున, లోనున్న తత్వ్వమొకటేయని గుర్తించవలెను.
దైవము ఊహాతీతమని మూడు ప్రమాణ గ్రంథములు (ప్రస్థానత్రయము) నిర్ణయించినవి. వేదము (యతోవాచో, నమేధయా...), గీత (మాంతువేద న...) మరియు బ్రహ్మసూత్రములు (జన్మాద్యస్య...) పరమాత్మ యొక్క స్వరూపమును చెప్పలేమని చెప్పినవి. దీనికి కారణమేమనగా - ఖాళీస్థలమైన ఆకాశమును సృష్టించిన పరమాత్మలో ఆకాశము ఉండుటకు వీలులేదు. ఎందుకనగా సృష్టించబడిన ఆకాశము, తన సృష్టికి ముందే, తనకు కారణమైన దైవములో ఉండజాలదు. ఆకాశము తనలో లేనందున, దైవమునకు, ఆకాశ లక్షణమైన పరిమాణములేదు. కావున పరిమాణములేని ఏ వస్తువైనా ఊహించుటకు వీలుకానిదే. ఇట్టి ఊహాతీతమైన పరమాత్మ, ఊహలకును, కన్నులకు సైతము కనపడు నరరూపమును ఆవేశించి, దానితో తాదాత్మ్యమును పొంది, జ్ఞానప్రచారము చేయుటకు, అవతార పురుషునిగా వచ్చుచున్నాడు. పండితులకు శంకర రూపంతో, పామరులకు సాయిరూపంతో అవతరించినాడు. శివుడు జ్ఞానప్రదాత (జ్ఞానం మహేశ్వరాత్...). శివుడు తేజోరూపము, సాయి, శంకరులు మానవరూపములు. శివ, విష్ణు, బ్రహ్మాది రూపములు తేజో రూపములు. ఈ తేజో మానవ రూపములన్నింటిలోను ఉన్నది ఒకేఒక ఊహాతీత పరమాత్మయని తెలుసుకొన్నచో, మతముల మధ్య పరస్పర విరోధము అంతరించును. అప్పుడే విశ్వశాంతి ప్రతిష్టించబడును. ఈ బ్రహ్మజ్ఞానము లేకపోవుటచేత, అవతార ఉపాధి రూపములనే పరమాత్మయని భ్రమించి, అన్ని అవతార ఉపాధులలోనున్న ఊహాతీత పరబ్రహ్మమును గుర్తించక, ఊహలకందు ఉపాధిరూపముల బేధమును అధిగమించలేక మత కలహములతో అశాంతిని నెలకొల్పుచున్నారు. ఊహలకందు వస్తువులెన్నియైన విడివిడిగా ఉండవచ్చును కాని, ఊహాతీతములగు ఎన్ని వస్తువులైనను ఒకటే కావలయును. దైవము ఊహాతీతము కావుననే ఒకే దైవముగా ఏకత్వము సిద్ధించినది.
★ ★ ★ ★ ★