home
Shri Datta Swami

 14 Nov 2025

 

భగవంతుని కొరకు చేసే శరీరత్యాగము కూడా కర్మఫలత్యాగమే

Updated with Part-2 on 15 Nov 2025


Part-1   Part-2


Part-1

[12.12.2002] "న తత్సమశ్చాభ్యధికశ్చ" అని శ్రుతి. అంటే స్వామితో సమానుడు కాని, అధికుడు కాని లేడు. అట్లే స్వామితో సమానమైన వస్తువు గాని, స్వామి కన్న అధికమైన వస్తువు గాని లేదు అని అర్థము. "త్యాగేనైకే" అను శ్రుతికి పరమాత్మను పొందుటకు నీవు చేయు త్యాగమే కారణమగును అని అర్థము. మరియు "సర్వధర్మాన్‌ పరిత్యజ్య" అను గీతాశ్లోకము సర్వధర్మములను త్యజించి నన్నే శరణు జొచ్చుము. నిన్ను సర్వపాపములనుండి విముక్తుని చేసెదను అని చెప్పుచు, ధర్మము కన్నను స్వామియే ఎక్కువ అని బోధించుచున్నది. ఈ మూడు వాక్యముల సారమే భాగవతము. గీతలో "జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్‌ కర్మఫలత్యాగః" అని చెప్పబడినది. అనగా జ్ఞానము కన్నను ధ్యానరూపమైన భక్తి గొప్పది. భక్తి కన్నను ఆచరణాత్మకమగు సేవ గొప్పది. కర్మఫలత్యాగము అనగా నీవు కష్టపడి సంపాదించిన ఫలమును స్వామికి అర్పించుట. కర్మ అనగా శ్రమపడి చేసిన పని. గోపికలు ఎంతో శ్రమపడి గోవులకు అనేక సేవలు చేసి అవి ఇచ్చిన పాలు, పెరుగు, వెన్న మధురానగరమునకు పోయి అమ్ముకొని ధనమును ఆర్జించి ఆ ధనముతో ఆహారపదార్థములను మధురా నగరములోనే కొని బుట్టలతో తెచ్చుకొనెడివారు. కావున పాలు, పెరుగు, వెన్నలు వారు శ్రమతో చేసిన కర్మయొక్క ఫలములు. ఆవియే వారికి జీవనోపాధి. రేపల్లె చుట్టును అరణ్యము ఉండెడిది. ఆ భూమి వ్యవసాయ యోగ్యము కాదు. మగవారు ఆ అరణ్యములో గోవులను మేపుకొని వచ్చెడివారు. కావున వారి జీవనోపాధి ద్రవ్యమైన పాలు, పెరుగు, వెన్న జాగ్రత్తగా ముంతలలో పెట్టి రక్షించుకొనెడివారు. దానిని స్వామి బాల్యమున దొంగిలించెడివాడు. అనగా స్వామి కొరకు నీవు ఎంత మాత్రము ధనబంధమును త్రెంచుకొనగలవు? అను స్వామి పరీక్షయే ఇది.

Swami

ధనము అధికముగా యుండి, దానిలో కొంత స్వామికి సమర్పణము చేయుట కన్నను, కేవలము జీవనాధారమగు ధనము మాత్రమే ఉన్నప్పుడు దానిని సైతము స్వామి కొరకు త్యాగము చేయుట చాలా గొప్ప త్యాగమగును. కొందరు గోపికలు అట్టి జీవనాధారమగు పాలు, పెరుగు, వెన్నలను స్వామి దొంగిలించినపుడు స్వామిని దండించెడివారు. మరికొందరు వాటిలో కొంత భాగమును ముందుగా స్వామికి కొంత అర్పించి, మిగితా భాగముతో పొట్ట పోసుకొనెడివారు. మరికొందరు మొత్తమును స్వామికి అర్పించి స్వామి భుజించగా మిగిలినచో ఆ మిగిలినది స్వామి ప్రసాదముగా భావించి దానితో పొట్ట పోసుకొనెడివారు. వీరే క్రమముగా అధమ, మధ్యమ, ఉత్తమ భక్తులు. ఈ మూడవతరగతి వారు ఏషణాత్రయమును తెంచుకున్నవారు. వీరికి పతి, పుత్ర, ధనబంధములు పూర్తిగా ఛిన్నములైనవి. మొదటితరగతి వారు అర్ధరాత్రి స్వామి మురళీనాదము వినిపించినను మంచమును కూడ దిగలేని వారు. వీరికి ఏషణాత్రయ బంధములు ఇంకను బిగుసుకునే యున్నవి. రెండవతరగతి వారు మంచము దిగినారే కాని గడపదాటలేదు. వీరికి ఏషణాత్రయబంధము తెగలేదు కాని సడలినవి. ఈ రెండు తరగతుల వారే సాధక గోపికలు.

 

Part-2

కలియుగమున మహాభక్తులైన రామకృష్ణ పరమహంస మొదలగు భక్తులుగా జన్మించిన వారు ఈ సాధకగోపికలే. అన్ని బంధములు తెంచుకొని, ఎన్ని అడ్డులున్ననూ దాటి ఏదియును స్వామికి సమానము కాదని ఎవరును స్వామికి సమానులు కారని నిశ్చయజ్ఞానము గల ఈ సిద్ధగోపికలకే సత్యలోకమునకు పైన గోలోకమును సృష్టించి నాడు స్వామి. వారు గోలోకములో సంచరించుచుండగా వారి చరణముల ధూళి రాలి తన శిరస్సుపై నిరంతరము పడుచుండునట్లు ఏర్పాటు చేసినాడు. జీవుల యొక్క ప్రవర్తనల చేత స్వామికి నిరంతరము తలనొప్పి వచ్చుచుండును. ఆ తలనొప్పికి దివ్య ఔషధము సిద్ధగోపికల చరణధూళియే. ఈ ఏర్పాటును తెలియపరచుటకే స్వామి ఒకనాడు తలనొప్పిని నటించినాడు. భక్తుల పాదధూళి తలపై నుంచినచో అది తగ్గునని సెలవిచ్చినాడు. నారదుడు భక్తుల పాదధూళి కొరకు అందరు భక్తుల వద్దకు వెళ్ళినాడు. మా పాదధూళిని స్వామి తలపై ధరించుట అధర్మమని కొందరు భక్తులు నిరాకరించినారు. అనగా వీరు స్వామి కన్నను ధర్మమునకు ఎక్కువ విలువ నిచ్చినారు. మరికొందరు భక్తులు పాదధూళి నిచ్చినచో నరకమున పడుదుమని నరకభయముతో నిరాకరించినారు. చివరకు అష్టసతులు పాదధూళి ఇచ్చుటకు ముందుకు వచ్చినారు. అప్పుడు నారదుడు "ఏ జీవుడు తన పాదధూళిని భగవంతుని శిరస్సుపై ఉంచునో, ఆ జీవుడు శాశ్వతముగా తామిస్ర, రౌరవాది నరకములలో పడునని" చెప్పినాడు. దానికి భయపడి అష్టసతులు వెనుకకు అడుగువేసినారు.

గోపికల వద్దకు పోగా పాదధూళి ఇచ్చుటకు ముందుకు వచ్చినారు. అష్టసతుల వద్ద చెప్పిన మాటనే నారదుడు మరల చెప్పినాడు. దానితో సాధకగోపికలు ఇంటికి మరలినారు. కాని సిద్ధ గోపికలు మాత్రము "మేము శాశ్వతముగా ఎంత దారుణ నరకమందైనను పడుటకు సిద్ధమే. స్వామి సంతోషమే మాకు ముఖ్యము." అని పాదధూళిని వస్త్రములో మూట కట్టి ఇచ్చినారు. అప్పుడు నారదుడు ఆ సిద్ధగోపికల యొక్క పరాభక్తిని తెలుసుకొని వారి స్థాయికి చేరవలయునన్న తానును ఇంకనూ సాధన చేయవలయునని తెలుసుకున్నాడు. ఇట్లు సిద్ధగోపికలు వారికి పొట్ట పోసుకొనుటకు మాత్రమే ఉన్న ధనమును స్వామికి అర్పించి స్వామి కన్న ఎక్కువ భర్తగాని, సంతానముగాని, తల్లిగాని, తండ్రిగాని, ఏ వ్యక్తియు ఎక్కువ కారని నిరూపించినారు. ఏలననగా వీరందరును జీవులే. ఏ జీవుని ఏ జీవుడు ఉద్ధరించలేడు. సర్వజీవులను ఉద్ధరించగలవాడు స్వామి ఒక్కడే. కావున స్వామి ముందు వారు సమస్తజీవుల బంధములను త్యజించినారు. ఇక కర్మఫలమనగా ధనము. ఈ ధనమును నీవు నీ శరీరమును నిలుపుకొనుటకు, నీ శరీరసుఖము కొరకు మరియు నీవు బంధము లేర్పరచుకున్న జీవుల శరీరములను నిలుపుటకు వారి శరీరసుఖభోగముల కొరకు ఈ ధనమును ఆర్జించుచున్నావు.

సిద్ధగోపికల యొక్క స్థితి ఏమనగా వారి శరీరములను నిలుపుకొనుటకు మాత్రమే ఉన్న జీవనాధారమైన కనీస ధనమును కూడా స్వామికి అర్పించినారు. అనగా వారికి స్వామి కన్న వారి శరీరము గాని, వారి ప్రాణములు గాని ఎక్కువ గావు. శరీరము కూడా ప్రారబ్ధకర్మ ఫలమే. కావున శరీరత్యాగము కూడా కర్మఫలత్యాగమనబడును. ఇట్టి కర్మఫల త్యాగమునే భాగవతమున ప్రహ్లాదుడును ప్రదర్శించినాడు. వాని ప్రాణములను తీసి వాని శరీరమును ఎన్ని రకములుగ హింసించినను, వాటి కన్నను స్వామియే ఎక్కువ అని నిశ్చయించినాడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch