17 May 2025
[12.12.2003] నాయనా శ్రద్ధగా విను, ఆచరించు, సేవించు, తరించు. బంధములను మనసా త్రుంచివేయుము. అంటే కాషాయవస్త్రములను ధరించి భార్యాబిడ్డలను వదలివేసి, ఇల్లు వదలిపొమ్మని కానేకాదు. ఈ ఐహిక బంధములను మనస్స్ఫూర్తిగా త్రుంచి వేసుకొని నిశ్చలముగా యుండి, ఆ బంధమును భగవంతునిపై పెట్టుకొనుము. "అహంకారమును అంతము చేసి మమకారమును మరల్చునతనికి, నారాయణుడు నటనము నాపి దారిని చూపి దరికి చేర్చును" అని దివ్యవాణి. ఏసుక్రీస్తు భగవానుని వద్దకు ఒకనాడు వారి తల్లి, బంధువులు వచ్చినారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక శిష్యుడు భగవానునికి విన్నవించగా, స్వామి ఇలా వచించినారట "తల్లి ఎవరు? బంధువులు ఎవరు? శిష్యుల వంక చూపుచూ మీరే నా తల్లి, తండ్రులు, బంధువులు, సోదరులు. భగవంతుని వద్దకు చేర్చువాడే నా సోదరుడు" అన్నారట. త్యాగరాజు ఏమన్నారు? "సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి, హనుమదాదులు మా సోదరులు మనసా!" అన్నారు. కనుక నాయనలార! ఏమీ వద్దు, చక్కగా స్వామి సేవలో పాల్గొనండి. మాటలు కాదు. క్రియలో చూపాలి. ఆవేశపూరితమైన కన్నీరు వద్దు. కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము చేయండి. ఉత్తుత్తి మాటలు వద్దు, రామకోటి వ్రాయటకాదు అన్నారు స్వామి. "నేను అనే అహంకారము, నాకు అనే మమకారము" ఈ రెండూ ఉండరాదు. చిన్ననాటి నుండి నీ పిల్లలను పెంచి పెద్దవాళ్ళను చేశావు. చదువు చెప్పించావు. వివాహలు చేశావు. ఒక ఇంటివాళ్ళను చేశావు. పొట్టకట్టుకుని వాళ్ళను పెంచి పెద్దవాళ్ళను చేశావు. నీకున్నదంతా వాళ్ళకే పెట్టావు. ఇంకా పెడుతున్నావు. కాని కొద్దిపాటి బుద్ధిమంతులు తప్ప, ఎక్కువ భాగము ఇలాగే కనిపిస్తున్నారు. వారి ఇల్లు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సంపద, వాళ్ళ సంతోషము అంతే. ముసలివాళ్ళైన తల్లిదండ్రులు వాళ్ళకు భారముగా తోస్తున్నారు. అయినప్పటికి, నీకు మిగిలిన ఆస్తి యావత్తు పిల్లలకే వ్రాసి ఇస్తున్నావు గదా!
నీ జన్మకు కారణమై, నీకు ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతాన, సంపత్తులు ప్రసాదించి, నీకు కష్టము వచ్చినప్పుడల్లా ఆదుకుంటూ, నీకోరికలన్నీ తీరుస్తున్న ఆ పరమేశ్వరుడికి నీవేమి ఇస్తున్నావు? ఏమీ లేదు. జపము, పారాయణ, భజన, ధ్యానము చేశానంటూ ఉద్ధరిణెడు నీళ్ళు అంతే కదా! ఆలోచించు. వెనక్కి తిరిగి చూసుకో. కనుక తెలుసుకో. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నరావతారములో దిగివచ్చిన పరమాత్మను గుర్తించి, సేవించు. కర్మఫలత్యాగము చేయి. తరించు. మనం ఆచరణ పూర్వకముగా స్వామి కోసము ఏమి చేశామో అదే కాలభైరవుడు వ్రాస్తాడు. కనుక త్యాగము లేక మోక్షము లేదు. బంధచ్ఛేదము లేక దైవము రాడు. ధనమును, రక్తసంబంధమును త్యాగము చేయనిదే భగవంతుడు అందడు. శ్రీసత్యసాయిని చూడండి. తల్లి రాగానే ఏమన్నారు. "అదిగో మాయ వచ్చింది" అన్నారు గదా 12 వ యేట. 8 వ యేట ఆదిశంకరులు తల్లి బంధాన్ని తెంచుకుని భగవంతుని సేవలోనికి వెళ్ళాడు గదా. శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో వచించినట్లు కర్మయోగము అనగా కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము. నిష్కామ కర్మయోగమే మోక్షమునకు మార్గము. దీనికి వేదము, గీత ప్రమాణములు. కనుక –
"మోహము తెగక మోక్షము రాదు
నా వ్యామోహము రాక కైవల్యము రాదు"
లోహము తెగినా, మీ మోహము తెగదు
మోహము తెగక మోక్షము రాదు ఓ మానవులారా!
నా వ్యామోహము రాక కైవల్యము రాదు
పతియని, సతియని, సుతుడని, సుతయని,
ధనమని, గృహమని, నా తను విధి యనెడి
మోహము తెగక మోక్షము రాదు
మాటల పాటల మనసున తలపుల
త్యాగము చేసిన నా దయ రాదు
ఆచరణంబున సర్వార్పణమను
త్యాగము చేసిన ఆనందింతును
అని వచించారు.
★ ★ ★ ★ ★