
30 Nov 2025
[13.12.1997] "నేను పుట్టితినా? నాకు జయంతి ఉన్నదా?" అంటూ దైవరహస్యాన్ని వెల్లడించారు స్వామి. “అస్మత్ప్రియతమ భక్తులగు శ్రీ విష్ణుదత్తుల వారికి (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి), శ్రీగురుడు (శ్రీదత్తస్వామి) వ్రాయునది మీరు మా ఆజ్ఞ చేత ఈ లోకమునకు జీవోద్ధరణమునకై వచ్చి క్రింది మెట్టులో నున్నారే తప్ప మీరు పై మెట్టు ఎక్కుటకు ఎట్టి సాధనయు చేయనవసరము లేదు. మీపై మాయా ప్రభావమును ఇక నుండి ఉపసంహరించుచున్నాము. మీవెంట ప్రతి నిమిషము మేమున్నాము. మీరు నిద్రించుచున్న సమయములో కూడ మేము మేల్కొని మిమ్ములను రెప్పవేయుకుండా చూచుచు కాపాడుచున్నాము. మీరు మీ వెంట ఉన్న జీవులను మాపై భక్తి కలుగునట్లు చేసి ఉద్ధరించుడు” అని శ్రీ దత్తస్వామి రాబోవు జన్మ రహస్యాన్ని ఈవిధంగా వెల్లడించారు. “నేను మహారాష్ట్ర దేశములోన వత్తును. శ్రుతి, జ్ఞానేశ్వరులను పేర్లతో విశ్రుతులవబోయే మీరు తల్లితండ్రులుగ కలుగుటకు నా వరదాన మిదియె. నేను కృష్ణసరస్వతి నామముతో అపుడు ఉండెదను. అవతారపురుషులు తమ తల్లితండ్రులను వారే ముందుగా నిర్ణయించుకొందురు.
ఓ విష్ణుదత్తా! నావాడవగు నిన్ను పతనము కానీయకుండా కాపాడుకుంటాను. “నా మార్గ ప్రచారమే నా నిజమగు సేవ” అని వచించారు. "విష్ణుదత్తుల వారూ! తమరేల మాటి మాటికి రక్ష రక్ష అని పలవరిస్తున్నారు? ఈ సర్వజీవులలో మిమ్ములను రక్షించినంత ఎవ్వరినీ రక్షించ లేదు. మీరు మమ్ము పరిపూర్ణముగా విశ్వసించి మమ్ములను సేవించుచున్నారు. మమ్ములను పూర్తిగా విశ్వసించినవారు, మేము రక్షింతుమన్న పూర్ణవిశ్వాసము కలవారు కాన రక్షించమని అర్థించరు. అట్లు అర్థించుట ఆత్మీయతపై నమ్మకము లేనట్లే కదా!
మేము మిమ్ములను సత్యమైన లక్ష్యమగు, పరబ్రహ్మమైన మమ్ములను గుర్తించునట్లు చేసి సత్యమైన మార్గమును మీకు ప్రకాశింప చేసి మిమ్ములను మావైపుకు నడిపించుకొనుచున్నాము, అని తెలియుడు. మా సేవకులగు కాలభైరవుల వారిని మీవద్దకు పంపి సంపూర్ణ సత్యము ప్రకాశింప చేసినాము. కాలభైరవులవారే మేము. మేమే కాలభైరవులము. మాకు కాలభైరవులకును ఏ భేదమూ లేదు. మేము ప్రతి వస్తువులోను, ప్రతి వ్యక్తిలోను ఉన్నాము. అయితే అహంకారము నశించి కేవలము “నేను" అను పదము మాత్రము మిగిలిన వారిలో మేము పూర్తిగా ప్రకాశింతుము. అహంకారము ఘనీభవించిన వారిలో మేము ప్రకాశింపము" అన్నారు స్వామి. స్వామి నా శ్రీమతితో ఇలా వచించారు. కుంటి, గ్రుడ్డి, వ్యాధిగ్రస్తులకు అన్నశాంతి చెయ్యి చాలు అన్నారు. స్వామి బయలు దేరి వెళ్ళే ముందు ఇలా వచించారు. "వీడిని ఉద్ధరించటం ఏనాడో జరిగిపోయింది. ఇంకా ఏదో ఉద్ధరింపబడాలని భ్రమలో ఉన్నాడు. వాడిని మరల హెచ్చరించు, ఆంజనేయస్వామి వారికి ఆయన బలం ఎలా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చెయ్యాలో అలాగే వీడికి ఈ మాట పదేపదే హెచ్చరించు. సేవ చేయమను. సోదరులను ఉద్ధరించమను" అని స్వామి వచించారు.

[03.12.1998]
[శ్రీదత్త జయంతి నాడు శ్రీదత్తస్వామి నా శ్రీమతికి శ్రీదత్తగురు భగవద్గీత గ్రంథమును అనుగ్రహించుచూ, ఇలా లిఖించారు.] శ్రీ విష్ణుదత్త ధర్మపత్ని యగు శ్రీసోమిదమ్మ స్వరూపిణి శ్రీచిలుకూరు భవాని గారికి అని లిఖించారు. నేను విష్ణుదత్తుడు అని ఆమె నా ధర్మపత్ని సోమిదమ్మ అని తెలియపరచారు. పాండవుల మధ్యలో శ్రీకృష్ణభగవానుడున్నట్లు మాఇంట, మాజంట, మావెంట శ్రీ దత్తభగవానుడు శ్రీదత్తస్వామి రూపంలో ఉండి మమ్ము ఉద్ధరిస్తున్నారు. ఇది సత్యం. శ్రీదత్తవేదము, శ్రీదత్తగురు భగవద్గీత, శ్రీదత్తోపనిషత్తులు వంటి గ్రంథములు మా చేత ముద్రింప చేయించి; శ్రీపాద శ్రీవల్లభలు, శ్రీనరసింహ సరస్వతి, శ్రీమాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్ కోట మహారాజు, శ్రీ షిరిడి సాయినాథుడు, శ్రీసత్యసాయి నాథుడు, శ్రీగణపతి సచ్చిదానంద స్వామిజీ, మహిమయమున వంటి గ్రంథములు మా చేత వ్రాయించి స్వామి అనుగ్రహించారు. "మేము - మా గురుదేవులు" అను గ్రంథమును విస్తరంగా వ్రాయించారు. స్వామి మా దంపతులను మాకుటుంబ సభ్యులను కంటికి రెప్పవలె కాపాడుచున్నారు.
★ ★ ★ ★ ★